అందరిచూపు టన్నెల్​ వైపే.. మూడు రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు

అందరిచూపు టన్నెల్​ వైపే.. మూడు రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు
  • మంగళవారం నుంచి టన్నెల్​ వద్దకు మీడియాకు నో ఎంట్రీ

మహబూబ్​నగర్/అమ్రాబాద్​, వెలుగు  ఫొటోగ్రాఫర్ : ఎస్ఎల్​బీసీ టన్నెల్​ వద్ద ప్రమాదం జరిగినప్పటి నుంచి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి చూపు ఇక్కడే ఉంది. ఉన్నతాధికారుల నుంచి మంత్రుల వరకు అందరూ ప్రమాదంలో గల్లంతైన వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రెస్క్యూ టీమ్​లు లోపలికి వెళ్లిన ప్రతిసారి దాదాపు ఐదు గంటల వరకు అక్కడే వర్క్​ చేస్తున్నాయి. ఒక షిఫ్ట్​ టీమ్​ అర్ధరాత్రి 2 గంటలకు లోపలికి వెళితే తిరిగి ఉదయం 8 గంటలకు బయటకు వస్తోంది. మరో టీం మధ్యాహ్నం 12 గంటలకు లోపలికి వెళితే రాత్రి తిరిగొస్తుంది. శిథిలాలను తీసేందుకు మధ్యాహ్నం హిటాచీని తీసుకెళ్లారు. 

వెంట 30 మంది కార్మికులు కూడా వెళ్లారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ టీమ్​ మెంబర్స్​కు అక్కడే భోజనం, నీరు అందిస్తున్నారు. టన్నెల్​ ఉన్న ప్రాంతం వద్దకు వెళ్లడానికి మెయిన్  రోడ్డు నుంచి నాలుగు కిలోమీటర్లు అటవీ మార్గంలో వెళ్లాల్సి వస్తోంది. దీంతో అక్కడ సెల్​ఫోన్​ సిగ్నల్స్​ లేకపోవడంతో ఓ ప్రైవేట్​ కంపెనీ టవర్​ను ఏర్పాటు చేసింది. అలాగే టన్నెల్​లో సగం వరకే సిగ్నల్​ వస్తుండడంతో వాకిటాకీలు వినియోగిస్తున్నారు.