
- ప్రయాగ్ రాజ్ కలెక్టర్ క్లారిటీ..
- సోషల్ మీడియాలో పుకార్లను నమ్మవద్దని సూచన
ప్రయాగ్ రాజ్/పట్నా: మహా కుంభమేళాను పొడిగించబోమని ప్రయాగ్ రాజ్ జిల్లా కలెక్టర్ రవీంద్ర కుమార్ మంధాడ్ తెలిపారు. కుంభమేళాను పొడిగిస్తారని సోషల్ మీడియాలో కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, అవన్నీ ఒట్టి పుకార్లని, వాటిని నమ్మకూడదని ఆయన సూచించారు. మేళాను పొడిగిస్తామని యోగి సర్కారు ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదని, ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చే దాకా మేళాను పొడిగించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా.. ఈనెల 26న కుంభమేళా ముగియనున్నది.
కుంభమేళాను పొడిగించండి.. అఖిలేశ్ విజ్ఞప్తి
మహా కుంభమేళాను మరికొద్ది రోజులు పొడిగించాలని యోగి ప్రభుత్వానికి సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేశ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. భక్తులు ఊహించని రీతిలో హాజరవుతున్నారని అన్నారు. గతంలో ఇలాంటి కుంభమేళాలను 75 రోజుల పాటు నిర్వహించారని, ఈసారి రోజులను తగ్గించారని పేర్కొన్నారు. ‘‘ఇంకా చాలా మంది భక్తులు మేళాలో పాల్గొనాలని అనుకుంటున్నరు. ఈ నేపథ్యంలో కుంభమేళా రోజులను పొడిగిస్తే బాగుంటుంది” అని అఖిలేశ్ పేర్కొన్నారు.
టికెట్ అక్కర్లేదని మోదీ చెప్పిండట..
టికెట్ లేకుండా పలువురు బిహార్ మహిళలు కుంభమేళాకు వెళుతుండగా రైల్వే అధికారులు అడ్డుకున్నారు. కుంభమేళాకు వెళ్లేందుకు తమను ప్రధాని నరేంద్ర మోదీ అనుమతించారని వారు చెప్పడంతో అధికారులు అవాక్కయ్యారు. బిహార్ లోని దానాపూర్ లో ఈ ఘటన జరిగింది. కుంభమేళాకు వెళ్లేందుకు పలువురు భారీ సంఖ్యలో ప్లాట్ ఫాంపై నిల్చున్నారు. వారిని గమనించిన అధికారులు ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు. కుంభమేళాకు వెళ్తున్నామని మహిళలు చెప్పగా.. టికెట్లు చూపాలని అధికారులు అడిగారు. తమ వద్ద టికెట్లు లేవని, కుంభమేళాకు టికెట్ తీసుకోకుండా వెళ్లవచ్చని ప్రధాని మోదీ అనుమతిచ్చారని పేర్కొన్నారు. ‘‘మీరు పొరబడ్డారు. ప్రధాని గానీ, ఇంకే అధికారి కానీ ఇలా అనుమతివ్వలేదు. టికెట్లు తీసుకునే రైలెక్కాలి. లేదంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది” అని దానాపూర్ డీఆర్ఎం తెలిపారు.