
- తునికి నల్ల పోచమ్మ ఆలయం వద్ద సౌలతులు కరువు
- పేరుకుపోయిన రూ.40 లక్షల టెండర్ బకాయిలు
- ఐదేళ్లుగా ఆలయ పాలక మండలి నియమించలే
మెదక్, కౌడిపల్లి, వెలుగు : మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధి తునికి గ్రామ శివారులో వెలసిన నల్ల పోచమ్మ ఆలయం వద్ద సౌలతులు కరవయ్యాయి. ఇక్కడికి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ జంటనగరాల నుంచి ఏడాది పొడవునా భక్తులు వస్తారు. ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఏటా మార్చిలో పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. వచ్చిన భక్తులకు తాగునీటి వసతి, బాత్రూంలు, టాయిలెట్లు సదుపాయాలు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సంవత్సరం కొబ్బరికాయల విక్రయం, షాపుల కిరాయి, పార్కింగ్ టెండర్ , హుండీ ద్వారా నల్ల పోచమ్మ ఆలయానికి సుమారు రూ.70 లక్షల వరకు ఆదాయం వస్తుంది. కానీ ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఐదేళ్లుగా జాడ లేని పాలక మండలి
ఎండోమెంట్ పరిధిలో ఉన్న నల్ల పోచమ్మ ఆలయానికి ప్రభుత్వం పాలక మండలిని నియమిస్తుంది. 2018లో నియామకమైన పాలకమండలి పదవీ కాలం 2019లో ముగిసింది. ఐదేళ్లు గడుస్తున్నా అప్పటినుంచి ఇప్పటివరకు కొత్త పాలకమండలిని నియమించలేదు. దీంతో ఆలయ అభివృద్ధి, సౌకర్యాలు, ఉత్సవాలు, జాతర నిర్వాహణపై ప్రభావం పడుతుంది. ఇప్పటికైనా ఆలయ అభివృద్ధిపై ఆఫీసర్లు దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.
పేరుకున్న బకాయిలు
కొబ్బరి కాయల విక్రయం, పార్కింగ్, షెటర్ల కిరాయికి ప్రతి ఏటా టెండర్లు నిర్వహిస్తున్నారు. వేలం పాటలో హక్కు దక్కించుకున్నవారు నిర్ణీత గడువులోగా డబ్బులు చెల్లించకపోవడంతో రూ.40 లక్షల వరకు బకాయిలు పేరుకు పోయాయి. వాటి వసూలుపై ఎండోమెంట్ ఆఫీసర్లు దృష్టి పెట్టడం లేదు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత సోమవారం అధికారులు మళ్లీ బహిరంగ వేలం నిర్వహించగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత బకాయి డబ్బులు చెల్లించే వరకు వేలం నిలిపివేయాలని నిర్ణయించారు.
సౌకర్యాలు కల్పిస్తాం
నల్ల పోచమ్మ ఆలయం వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తాం. ఐదేళ్లుగా పాలకమండలి నియమించని మాట వాస్తవమే. జాతర సమయంలో తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే కొత్త పాలకమండలి ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
- రంగారావు, ఈవో