- సిట్ ఎంక్వైరీపై నమ్మకం లేదు
- పేపర్ లీకేజీ కేసులో కేటీఆర్ పాత్రపై విచారణ జరగాలి
- బేగంబజార్ పీఎస్‌లో వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ఫిర్యాదు
- రాష్ట్రంలో డిజిటల్ సెక్యూరిటీ లేదని విమర్శ
హైదరాబాద్, వెలుగు : పేపర్ లీకేజీ కేసులో సిట్ ఎంక్వైరీపై నమ్మకం లేదని, ప్రగతిభవన్ ఆదేశాల ప్రకారమే విచారణ జరుగుతున్నదని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల విమర్శించారు. ఈ వ్యవహారంలో ఐటీ శాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని, అందుకే ఆ శాఖ మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం బేగంబజార్ పోలీస్ స్టేషన్లో షర్మిల ఫిర్యాదు చేశారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ఐపీ అడ్రస్, పాస్వర్డ్ సాయంతో సిస్టమ్ హ్యాక్ చేసి పేపర్ లీక్ చేశారు. అంత ఈజీగా సిస్టమ్ వివరాలు తెలుసుకోవడం ఎలా సాధ్యమైంది? మన రాష్ట్రంలో పాస్వర్డ్ తెలిస్తే ఏమైనా చేయొచ్చా? ఐటీ శాఖ ఏం చేస్తున్నది”అని షర్మిల ప్రశ్నించారు.
ప్రతీ సిస్టమ్‌కు ఆడిట్ జరగాలి
‘‘మన రాష్ట్రంలో ప్రతీ సిస్టమ్‌కు ఆడిట్ జరగాలి. సిస్ట మ్కు డిజిటల్ సెక్యూరిటీ ఉందా? ఫైర్ వాల్స్ ప్రొటెక్షన్ ఉందా? అధికారి ఓటీపీ, ఫింగర్ ప్రింట్ వంటి పద్ధతులు ఉన్నాయా? అనే వాటిపై ఆడిట్ చేయాలి. ఒక వేళ ఆడిట్ చేసి ఉంటే వాటి సర్టిఫికెట్లు ఉంటాయి. టీ ఎస్పీఎస్సీ కేసులో ఆ సర్టిఫికెట్లు బయటపెట్టాలి”అని షర్మిల డిమాండ్ చేశారు. ‘‘పేపర్ లీకేజీతో ప్రభుత్వానికి సంబంధం ఎందుకు ఉండదు? సిట్ దర్యాప్తు చేసి దోషులు ఎవరని చెప్పకముందే ఇద్దరే ఈ తప్పు చేశారని కేటీఆర్ ఎలా చెబుతారు? ఈ వ్యవహారంలో కేటీఆర్, ఆయన పీఏకి సంబంధం ఉంది”అని షర్మిల ఆరోపించారు.
ప్రగతి భవన్ డైరెక్షన్లోనే దర్యాప్తు
సిట్ లో ఎవరి పేర్లుండాలి, ఎవరిని దోషులుగా చేర్చాలి, ఎలా దర్యాప్తు చేయాలనేది ప్రగతి భవన్ నిర్ణయిస్తున్నదని షర్మిల విమర్శించారు. పేపర్ లీకేజీ చిన్న విషయమే అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. సూత్రధారులను తప్పించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు.
ఐటీ శాఖ వైఫల్యం కారణంగానే పేపర్ లీకైందన్నారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని విమర్శించారు. మళ్లీ ఎగ్జామ్స్ పెడుతున్నా.. సిస్టమ్ హ్యాక్ అవదని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు.