సిట్ రిపోర్టుపై చర్యలు ఏవి?

సిట్ రిపోర్టుపై చర్యలు ఏవి?

తెలంగాణలో గతంలో కీలక కేసుల దర్యాప్తుకు ఏర్పాటైన సిట్​ల పనితీరు.. అంతిమంగా తేలిన ఫలితాన్ని బట్టి చూస్తే.. సిట్​లపై ప్రజలకు నమ్మకం పోయినట్టు కనిపిస్తున్నది. చాలా సందర్భాల్లో సిట్​లో ఉన్న అధికారులు ప్రభుత్వ పెద్దల ఆదేశానుసారం నడుచుకుంటూ కేసులను నీరుగారుస్తున్నారు. ‘సిట్’ అంటే ప్రభుత్వ పెద్దలు కోరిన విధంగా పనిచేస్తూ కేసును సాగదీసి చివరకు నీరుగార్చే సంస్థ అనే విమర్శ వ్యక్తమవుతున్నది. స మాజంలో ఘోరమైన నేరాలు జరిగినప్పుడు వాటి దర్యాప్తు స్థానిక పోలీసు లేదా ఇతర అధికారులతో విచారణ జరగని పరిస్థితిలో ప్రభుత్వం ‘సిట్’(ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని) నియమిస్తుంది. ఇందులో నియమితులైన అధికారులు ప్రత్యేకంగా ఇదే పనిపై నిమగ్నమై సమస్యను లోతుగా పరిశీలించి వీలైనంత తొందరగా తమ నివేదికను ప్రభుత్వానికి పంపడం, లేదా కొన్ని సందర్భాల్లో నిందితులపై కేసులు చేసి న్యాయస్థానంలో విచారణకు పంపడం చేస్తారు. పెద్దఎత్తున అవినీతి జరిగినట్లు అనుమానమున్న సందర్భాల్లో జాయింట్​ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) అలాగే విజిలెన్స్ కమిషన్ ద్వారా విచారణ చేస్తారు. గత కొంతకాలంగా చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు సమస్య తీవ్రత తగ్గించడానికి అలాగే సమస్యను సాగదీయడానికి ‘సిట్’ లను నియమించడం పరిపాటిగా మారింది.  ప్రస్తుతం సిట్ అన్నది రాజకీయనాయకులకు సమస్యను పక్కదోవ పట్టించడానికి ఉపయోగపడుతున్నది. మూడు నాలుగు విధాలుగా రాజకీయ నాయకులు సిట్ వ్యవస్థను నిర్వీర్యం 
చేస్తున్నారు.

సిట్ రిపోర్టుపై చర్యలు ఏవి?

ఉమ్మడి రాష్ట్రంలో 2010లో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగింది. అందులో రాజకీయ నాయకులే గాక అబ్కారీ, పోలీసు, రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారని వార్తలొచ్చాయి. నిజాలు నిగ్గు తేల్చాలని అప్పటి ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖ డీజీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసింది. ఆ స్పెషల్ ​ఇన్వెస్టిగేషన్​ టీమ్ కేసు పూర్వాపరాలను లోతుగా పరిశీలించి తమ రిపోర్టు ప్రభుత్వానికి అందజేసింది. రాష్ట్రం మొత్తం సుమారు 11 వందల ప్రభుత్వ ఉద్యోగుల ప్రమేయముందని సిట్​తన రిపోర్టులో తెలిపింది. అయితే ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత 12 సంవత్సరాలుగా సిట్​పేర్కొన్న పేర్లలో ఎవరికీ శిక్షపడలేదు. 

టీఎస్​పీఎస్సీ పేపర్ ​లీక్ ​కేసులో..

తెలంగాణ పబ్లిక్ ​సర్వీస్ ​కమిషన్ ​నుంచి ప్రశ్నపత్రాలు లీక్ ​కావడం తెలిసిందే. ఇందులో దోషులను తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు అధికారులతో గతంలో లాగే ‘సిట్’ ఏర్పాటు చేసింది. ఇందులో ప్రశ్నపత్రాల లీకేజితో పాటు మనీలాండరింగ్ అంశం ముడిపడి ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలతో విచారణ జరపాలని పలువురు కోర్టుకు వెళ్లగా.. రాష్ట్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకోవడం లేదు. పైగా ఈడీ కేసు నమోదు చేసి మనీ లాండరింగ్​పై విచారణ చేస్తుండగా.. ‘సిట్’ కేసు విచారణకు సంబంధించిన వివరాలు ఇవ్వడంలో సహాయ నిరాకరణ చేస్తున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి, సర్కారు నియమించిన సిట్​కు అభ్యంతరం ఎందుకో?  దీన్ని బట్టి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ ఎలాంటి రిపోర్టు ఇవ్వబోతున్నారో అర్థమవుతున్నది. ఈ కేసును హైకోర్టు జడ్జితో విచారించాలని ప్రజా సంఘాలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ రాజకీయ నాయకుల కబందహస్తాలలో చిక్కుకుపోయింది. పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా చట్టబద్ధంగా పని చేస్తే తప్ప పరిస్థితి చక్కబడదు. ఢిల్లీలో పౌరసత్వ చట్టం(సీఏఏ)పై పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దానిపై కేంద్రం రెండు సిట్లను నియమించగా వారు నమోదుచేసిన కేసులు కోర్టుల్లో నిలవడం లేదు. చాలా సందర్భాల్లో సిట్​లో నియమించిన అధికారులు ప్రభుత్వ పెద్దల ఆదేశానుసారం నడుచుకుంటూ కేసులను నీరుగారుస్తున్నారు. ప్రస్తుతం ‘సిట్’ అంటే ప్రభుత్వ పెద్దలు కోరిన విధంగా పని చేస్తూ కేసును సాగదీసి చివరకు నీరుగార్చే సంస్థ అని ప్రజలు భావిస్తున్నారు. అలాగే కేంద్రంలో సీబీఐ, ఈడీ పంజరంలో చిలుకలాగా కేంద్రానికి అనుకూలంగా పనిచేస్తున్నాయన్న అపవాదు ఉంది. ప్రజలకు ‘సిట్’పై నమ్మకం పోయింది. ఇకనైనా రాష్ట్రప్రభుత్వం ముఖ్యమైన కేసుల్లో న్యాయమూర్తి ద్వారా విచారణ చేయిస్తే బాగుంటుంది.

రాజకీయ జోక్యం లేదా?

రాష్ట్రంలో మాదకద్రవ్యాల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయిందని, వాటి మూలాలపై విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం 2017లో  సిట్ ఏర్పాటు చేసింది. ఇందులో చాలా మంది సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడం, సిట్ వారికి నోటీసులు ఇచ్చి విచారణ చేయడం పూర్తయింది. దర్యాప్తు కేసులు నమోదు చేసే స్థితికి చేరుకుందన్న సమయంలో రాజకీయ జోక్యంతో సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ వచ్చింది. ఎవరో అనామకులపై సుమారు 12 కేసులు రాసి చాలా విజయవంతంగా ప్రజల దృష్టి మరలించగలిగారు. 

నచ్చిన ఆఫీసర్లను నియమించి..

తమకు అనుకూలమైన అధికారులను సిట్ లో నియమించి విచారణ అంతా రాజకీయ నాయకులు తమకు అనుకున్న విధంగా ఎంక్వైరీ రిపోర్టులు తయారు చేసుకుంటారు. సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం నయీమ్(గ్యాంగ్​స్టర్) కేసులో ప్రభుత్వం సిట్​ఏర్పాటు చేసింది. నయీమ్ కు చాలామంది రాజకీయ నాయకులతో, పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలున్నాయని ఫొటోలతో సహా పత్రికల్లో, టీవీల్లో విస్తృతంగా కథనాలు వచ్చాయి. దురదృష్టవశాత్తు సిట్ అధికారులకు కంటిచూపు మందగించి అవి ఏమీ కనబడలేదు. సుమారు 25 మంది పోలీసు అధికారులు నయీంతో అంటకాగారని తెలిసినా, ఎవరిమీదా చర్యలు తీసుకోలేదు. నయీమ్ ఇంట్లో 130  డైరీలు దొరికాయి. వాటిలో చాలామంది పోలీసు ఉన్నతాధికారుల పేర్లు కూడా ఉండటంతో ఆ డైరీల జాడే లేకుండా చేశారు. ‘సిట్’ ఎంక్వైరీని పక్కదోవ పట్టిస్తున్నదని, ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు(సీబీఐ)కి అప్పగించాలని కోర్టులో పిటిషన్​ దాఖలు కాగా, సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ‘సిట్’ నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నదని ప్రభుత్వ పెద్దలు కోర్టుకు తెలిపారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. నయీమ్ ఇల్లు రైడ్ చేసినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున డబ్బు దొరికింది. అది లెక్కించడానికి రెండు కౌంటింగ్ మిషన్లు వాడారు. అంటే డబ్బు వందల కోట్లలో ఉండాలి. కానీ లెక్కలో చూపింది మాత్రం 3 లక్షల 70 వేలు మాత్రమే. అయితే లెక్కకు రాని వందల కోట్ల డబ్బు ఎటుపోయిందో ఆనాటి ‘సిట్’ కే తెలియాలి. ఒక వేళ నయీమ్​కేసును సీబీఐ విచారణ చేపట్టి ఉంటే.. ఆ గ్యాంగ్​స్టర్​తో అంటకాగిన పోలీసులు, రాజకీయ నాయకుల చిట్టా, నయీమ్ అక్రమంగా సంపాదించిన వందల కోట్ల రూపాయిల బాగోతం బయటపడి ఉండేది.


- ఎం. పద్మనాభరెడ్డి,కార్యదర్శి, ఫోరం ఫర్​ గుడ్ ​గవర్నెన్స్​