కరెంటు సమస్యల వల్ల ఏ రైతూ ఇబ్బంది పడొద్దు.. ఒక్క ఎకరం కూడా ఎండొద్దు: డిప్యూటీ సీఎం భట్టీ

కరెంట్ సమస్యల వల్ల రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడొద్దని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యుత్ శాఖ ఉద్యోగులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలో ఒక్క ఎకరం కూడా ఎండటానికి వీలు లేదని అన్నారు.  విద్యుత్ శాఖ ప్రభుత్వానికి అత్యంత కీలకమని,  రైతులు కోరుకునే విధంగా కరెంటు ఉద్యోగులు పనిచేయాలని సూచించారు డిప్యూటీ సీఎం.

విద్యుత్ శాఖలో కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు  అందజేసే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొత్తం 112 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. నియామకాలలో 92 మంది జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లకు, అదేవిధంగా ట్రాన్స్ కోలో మరో 20 మందికి నియామక పత్రాలు అందజేశారు. 

నిరుద్యోగుల కల ప్రత్యేక రాష్ట్రంలో నెరవేరలేదని,  పదేండ్లుగా ఉద్యోగాలు రాలేదని అన్నారు డిప్యూటీ సీఎం భట్టీ. తాము అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 56 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక నియామకాలపై దృష్టి పెట్టామని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఉద్యోగం ఇచ్చే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. 

రాష్ట్రంలో ఉన్నోళ్లంతా ఉద్యోగాలు సాధించాలనీ.. ప్రపంచంతో పోటీ పడి పనిచేసి తెలంగాణకు గొప్ప పేరు తేవాలని సూచించారు.