డబుల్​ బెడ్రూం ఇండ్లల్ల కరెంటు లేదు.. నీళ్లు లేవ్

డబుల్​ బెడ్రూం ఇండ్లల్ల కరెంటు లేదు.. నీళ్లు లేవ్
  • ఉండలేక తాళాలేసుకొని వెళ్లిపోతున్న జనం
  • సౌలతుల ఊసెత్తని కాంట్రాక్టర్లు
  • డ్రైనేజీలు, రోడ్లు కూడా సక్కగ లేవ్
  • 2,91,057 ఇండ్లు కడ్తమని చెప్పి ఏడేండ్లలో పూర్తి చేసింది 1,13,535 ఇండ్లే
  • పంపిణీ చేసింది 17 వేలు మాత్రమే

నెట్​వర్క్​/ నల్గొండ​, వెలుగు: డబుల్​ బెడ్రూం ఇండ్ల స్కీంను ప్రారంభించి ఏడేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ సగం ఇండ్లు కూడా కట్టలేకపోయిన రాష్ట్ర సర్కారు.. పంపిణీ చేసిన కొద్దిపాటి ఇండ్లలోనూ సౌలతులు కల్పించడం లేదు. సవరించిన రేట్ల ప్రకారం ఆయా కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీల్లాంటి సౌలతులు కల్పించాల్సిన బాధ్యత కాంట్రాక్టర్లపై ఉన్నా  ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్​ సరిపోవడం లేదంటూ ఇండ్లు కట్టి వెళ్లిపోతున్నారు. రోడ్లు, డ్రైనేజీలు లేని కాలనీల్లో, కనీసం కరెంట్, నీళ్లు లేని ఇండ్లలో ఉండలేక జనం తాళాలు వేసుకొని పాత ఇండ్లలోకి వెళ్లిపోతున్నారు. 

కట్టిన ఇండ్లలోనూ ఇచ్చింది 15 శాతమే

పేదల సొంతింటి కలను నిజం చేస్తామంటూ 2015లో డబుల్​ బెడ్రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర సర్కారు.. గడిచిన ఏడేండ్లలో సగం లక్ష్యం కూడా చేరుకోలేదు.  మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా  2,91,057 ఇండ్లు (జీహెచ్‌‌ఎంసీ పరిధిలో లక్ష, జిల్లాల్లో 1,91,057) కట్టిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ, ఇప్పటివరకు జీహెచ్‌‌ఎంసీ పరిధిలో 56,066 ఇండ్లను నిర్మించి  3,350 ఇండ్లను మాత్రమే పంపిణీ చేశారు.  ఇక జిల్లాల్లో  57,469 ఇండ్లు పూర్తిచేసి  13,650 ఇండ్లనే అందజేశారు. మొత్తంమీద 1,13,535 ఇండ్లను పూర్తిస్థాయిలో నిర్మించగా.. లబ్ధిదారులకు అందజేసిన ఇండ్లు 17 వేలు(15శాతం) మాత్రమే. 

ఇండ్లు కట్టి వదిలేస్తున్న కాంట్రాక్టర్లు

ఆయాచోట్ల కట్టిన ఇండ్లు తక్కువగా ఉండడం, కనీస సౌలతులు లేకపోవడంతో పంపిణీ చేసేందుకు ఆఫీసర్లు వెనుకాడుతున్నారు. కొన్ని చోట్ల గ్రామస్తులు, లీడర్ల ఒత్తిడితో లాటరీ తీసి లబ్ధిదారులకు అందజేస్తున్నా.. కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇండ్లలో కరెంట్​, నీళ్లు లాంటి కనీస సౌలతులు లేకపోవడంతో జనం తిప్పలు పడుతున్నారు. ప్రారంభంలో ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూరల్​ఏరియాలో రూ. 5.04 లక్షలు, అర్బన్​లో రూ. 5.30 లక్షలు, జీహెచ్​ఎంసీలో రూ.7 లక్షల చొప్పున రేటు నిర్ణయించింది. 2016 తర్వాత సిమెంట్​, ఇసుక, ఐరన్ ​లాంటి ముడిసరుకుల ధరలు, కూలి రేట్లు పెరగడంతో చాలా చోట్ల సర్కారు ఇచ్చే బడ్జెట్​ సరిపోవడం లేదంటూ కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులు నిలిపేశారు. దీంతో మౌలికవసతుల కింద ఒక్కో ఇంటికి రూరల్​ ఏరియాలో రూ. 1.25 లక్షలు, అర్బన్​, జీహెచ్​ఎంసీ పరిధిలో రూ. 75 వేలను చెల్లించాలని సర్కారు నిర్ణయించింది. ఫలితంగా ఒక్కో డబుల్ బెడ్‍రూం యూనిట్​కాస్ట్​ రూరల్​ ఏరియాలో రూ. 6.29 లక్షలకు, అర్బన్​ ఏరియాలో 6.05లక్షలకు, జీహెచ్​ఎంసీలో రూ. 7.75 లక్షలకు పెరిగింది. కానీ ఆ రేట్లు కూడా గిట్టుబాటు కావడం లేదంటూ కాంట్రాక్టర్లు కేవలం ఇండ్లు కట్టేసి, మౌలిక వసతులతో తమకేమాత్రం సంబంధం లేనట్లుగా వెళ్లిపోతున్నారు. ఎలాంటి సౌలతులు లేకపోవడంతో ఇండ్ల పంపిణీకి ఆఫీసర్లు వెనుకాడుతున్నారు. ఒత్తిళ్లతో ఇండ్లు కేటాయిస్తున్న చోట్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు తాళాలు వేసుకొని వెళ్లిపోతుండగా.. వెళ్లిపోతే ఇంటిని వేరేవాళ్లకు ఇస్తరేమోననే భయంతో మరికొందరు కష్టమైనా సరే అక్కడే ఉంటున్నారు. 

కరెంట్, నీళ్ల కనెక్షన్లకు టెండర్లు.. 

లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో డబుల్​బెడ్రూం ఇండ్ల కాలనీల్లో కరెంట్, వాటర్​కనెక్షన్ల కోసం ప్రత్యేకంగా టెండర్లు పిలవాలని సర్కారు ఇటీవల నిర్ణయించింది. టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని మిషన్ భగీరథ, విద్యుత్ శాఖ ఆఫీసర్లను ఆదేశించింది. రోడ్లు, డ్రైనేజీ వసతులు కల్పించాల్సిన బాధ్యతలను ఆయా మున్సిపాలిటీలు, పంచాయతీలకు అప్పగించింది. దీనిపై బల్దియాలు, పంచాయతీ పాలకవర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. అసలే నిధులు లేక అల్లాడుతున్న తమకు ఈ కొత్త తలనొప్పి ఏమిటని మున్సిపల్​ చైర్​పర్సన్లు, సర్పంచులు అంటున్నారు. చాలాచోట్ల డబుల్​బెడ్రూం ఇండ్లను ఊర్లకు, టౌన్లకు దూరంగా శివార్లలో కట్టారు. అక్కడికి రోడ్లు వేయాలంటే లక్షల్లో ఖర్చవుతుందని చెప్తున్నారు. కాగా, డబుల్​బెడ్రూం ఇండ్ల కాలనీల్లో మౌలిక వసతుల కోసం యూనిట్​ కాస్ట్​ను మధ్యలో పెంచిన సర్కారు.. ఇప్పుడు కాంట్రాక్టర్లకు ఆమేరకు తగ్గించి చెల్లిస్తుందా? లేదా? అనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ కాంట్రాక్టర్ల బిల్లుల్లో కోత పెట్టి, తమకు కేటాయిస్తే ఆ నిధులతో మౌలిక వసతులు కల్పిస్తామని పాలకవర్గాలు అంటున్నాయి.

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్​పూర్ లో ఇటీవలే 65 డబుల్ బెడ్రూం ఇండ్లను  పంపిణీ చేశారు. కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేసినా ఇండ్లతో లింక్​చేయలేదు. దీంతో మురుగునీరంతా రోడ్లపై పారి దుర్వాసన వస్తున్నది. గుట్ట ప్రాంతంలో నిర్మించడంతో ఇటీవల కురిసిన చిన్నవర్షానికి.. నాసిరకంగా వేసిన మట్టి రోడ్లు దెబ్బతిన్నాయి. ఇండ్లలోకి నీళ్లు వస్తుండడంతో కాలనీ చుట్టూ గోడ కట్టాలని, ఎవరిని అడగాలో తెలియట్లేదని లబ్ధిదారులు అంటున్నారు. ఇంటి అవసరాలకు దగ్గర్లో ఉన్న బోర్ల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. తాగేందుకు మినరల్ ప్లాంట్ల నుంచి కొనుక్కుంటున్నారు. 

ఆదిలాబాద్​ జిల్లా బోథ్ మండలం ధన్నోర గ్రామంలో రెండేండ్ల కిందట 75 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేశారు. కానీ, ఈ కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించలేదు. కాంట్రాక్టర్​ మట్టి రోడ్లు పోసి వెళ్లిపోయాడు. దీంతో వర్షం కురిసిన ప్రతిసారీ రోడ్లన్నీ బురదతో నిండి అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నామని లబ్ధిదారులు అంటున్నారు. 

కరెంట్​ లేక ఇండ్లకు తాళాలు 

జగిత్యాల జిల్లా కోరుట్లలోని పెద్దగుండు ప్రాంతంలో 80 డబుల్ బెడ్రూం ఇండ్లను ఈ నెల 10 న మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గ్రాండ్​గా ప్రారంభించారు. కానీ, ఇప్పటివరకు కరెంట్​ కనెక్షన్​ ఇవ్వకపోవడంతో ఇండ్లలో ఉండలేక లబ్ధిదారులు ఇలా తాళాలు వేసుకొని వెళ్లిపోయారు. ఇండ్ల మధ్య ఇంటర్నల్​ రోడ్లు కూడా వేయకపోవడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నది.

ఇంట్ల ఉండాల్నంటే బుగులైతున్నది

మా ఊర్లె లబ్ధిదారులను ఎంపిక చేసిన్రు తప్ప డబుల్​ బెడ్రూం కాలనీల్లో సౌలతులు కల్పించలేదు. ఇండ్లలో కరెంట్​ లేదు. నీళ్లు వస్తలేవు. వాడిన నీళ్లు పోయెతందుకు డ్రైనేజీలు లేవు. రోడ్డు కూడా లేదు. గోడలు పగుళ్లు పెట్టి, ఈ వానలకు ఎప్పుడు కూల్తయా అన్నట్లు ఉన్నయ్.  ఇంట్ల ఉండాల్నంటేనే బుగులైతున్నది. 

- తిరగమల్ల పార్వతి , 
పోలేని గూడెం, సూర్యాపేట జిల్లా