పనుల్లేక పస్తులుంటున్న అడ్డా కూలీలు

అడ్డా కూలీలపై కరోనా దెబ్బ

కరోనా ఎఫెక్ట్​తో అడ్డా కూలీల బతుకులు ఆగమవుతు న్నాయి. లాక్ డౌన్​తో చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోగా, ఇక్కడే ఉన్నవాళ్లకి చిన్నాచితక పనులూ  దొరకడం లేదు. అడ్డా మీద గంటల తరబడి పడిగాపులు గాస్తున్నా ఎవరూ పనికి పిలవడం లేదని వాపోతున్నారు. కరోనా భయంతో ఇంటి పనులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు.

హైదరాబాద్​, వెలుగు: సిటీవ్యాప్తంగా 152 కూలీ అడ్డాలున్నాయి. రామాంతాపూర్, యూసుఫ్​గూడ, ఖైరతాబాద్, రాంనగర్, సికింద్రాబాద్, బౌద్ధనగర్, చిలకలగూడ, లాలాపేట, ఎల్​బీనగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, అత్తాపూర్, సింగరేణి కాలనీ వంటి బస్తీల్లో అడ్డా కూలీలు ఎక్కువగా నివాసం ఉంటున్నారు. ఏండ్ల కిందట సొంతూళ్లను వదిలి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని గుడిసెలు, కిరాయి ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు. 67 వేలమందికి పైగా కన్​స్ట్రక్షన్​, హమాలీ, పెయింటింగ్, కార్పెంటర్, ప్లంబింగ్, క్లీనింగ్, మట్టి పనులకి వెళ్తూ ఉపాధి పొందుతుంటారు. 5 నెలలుగా నిర్మాణ పనులు నిలిచిపోవడంతో వారంతా పనుల్లేక అవస్థలు పడుతున్నారు. ఇంట్లో సరుకులూ కష్టమవుతోందని ఆవేదన చెందుతున్నారు. పొద్దుగాల నుంచి మధ్యాహ్నం దాకా అడ్డాలో ఎదురుచూస్తున్నా పని దొరకడం లేదని రాంనగర్ చౌరస్తాలో నివాసం ఉండే కూలీ యాదయ్య తెలిపాడు. కరోనా భయంతో చిన్నచిన్న పనులకు కూడా ఎవరూ పిలవట్లేదని వాపోయాడు.

తిండికి కూడా ఎల్తలేదు

రామాంతాపూర్ అడ్డాకు 500 మందికి పైగా కూలీలు వస్తుంటరు. రెండు నెలల నుంచి ఎవరికీ పనుల్లేవు. ఒంటి గంట దాకా చూసి ఇంటికి పోతున్నం. చేతిలో డబ్బుల్లేక పిల్లలకు కూడా సక్కగ తిండికి పెట్టలేక పోతున్నం. కొన్నిసార్లు పస్తులుండాల్సి వస్తోంది.

‑ యాదగిరి, రామాంతాపూర్

ప్రభుత్వం ఆదుకోవాలె

లాక్ డౌన్ రోజుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను ఆదుకున్నట్లుగానే ప్రభుత్వం అడ్డా కూలీలను ఆదుకోవాలె. నెలకి రూ.7,500 ఇయ్యాలె. అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి వైద్యం అందించాలె.

‑ మల్లేశ్, సీఐటీయూ సిటీ వైస్ ప్రెసిడెంట్

For More News..

పదేండ్లలో ఈసారే తక్కువ బొగ్గు తవ్విన్రు

ఐఏఎస్ , ఐపీఎస్‌ల కోసం మిషన్ కర్మయోగి

25 కిలోమీటర్లు శవాన్ని మోసుకెళ్లిన ఐటీబీపీ జవాన్లు