
- వ్యవసాయం, ఆటోమొబైల్, ఫార్మా రంగాలు నష్టపోతాయి
- కార్ల దిగుమతులపై టారిఫ్‌లు తగ్గిస్తే మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ కుదేల్
- ఫార్మాలో పేటెంట్ చట్టాలు మార్చాలని కోరుతున్న అమెరికా
న్యూఢిల్లీ: అమెరికాతో ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడం వలన ఇండియాలో వ్యవసాయం, ఆటోమొబైల్స్, ఫార్మా రంగాలు తీవ్రంగా నష్టపోతాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) అభిప్రాయపడింది. ఎఫ్‌టీఏ కుదుర్చుకోవడంపై పునరాలోచించాలని హెచ్చరించింది. ట్రేడ్ డీల్‌లో భాగంగా, రైతులకు ఇచ్చే కనీస మద్దతు ధర వ్యవస్థను బలహీనపరచాలని, జన్యుపరంగా సవరించిన ఆహార దిగుమతులకు అనుమతి ఇవ్వాలని, వ్యవసాయ సుంకాలను తగ్గించాలని, ఫార్మా సెక్టార్‌లో పేటెంట్ చట్టాలను మార్చాలని యూఎస్ కోరుతోంది.
దీంతోపాటు అమెరికన్ ఈ–-కామర్స్ కంపెనీలు డైరెక్ట్‌గా కన్జూమర్లకు విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని అడుగుతోంది. ప్రస్తుతం ఈ–కామర్స్ కంపెనీలు ప్రొడక్ట్‌లను స్టోర్ చేసి డైరెక్ట్‌గా అమ్మకూడదు. కేవలం థర్డ్ పార్టీ సెల్లర్లకు, వినియోగదారులకు మధ్య వారధిగా మాత్రమే పనిచేయాలి. కొన్ని మెడిసిన్స్ పేటెంట్ టైమ్ పూర్తయితే వీటిని జనరిక్ మందులుగా ఏ ఫార్మా కంపెనీ అయినా తయారు చేయొచ్చు. పేటెంట్ రూల్స్ మారిస్తే అమెరికన్ ఫార్మా కంపెనీల గుత్తాధిపత్యం పెరుగుతుంది. అమెరికా డిమాండ్లకు ఒప్పుకుంటే రైతుల ఆదాయం తగ్గిపోతుందని, ఆహార భద్రత, జీవవైవిధ్యం, ప్రజారోగ్యానికి నష్టం వాటిల్లుతుందని, చిన్న రిటైలర్లు ఇబ్బంది పడతారని జీటీఆర్‌ఐ తెలిపింది. "వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గిస్తే కోట్ల మంది ఇబ్బందిపడతారు.
అదే సమయంలో కార్లపై సుంకాలను తగ్గిస్తే మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ నష్టపోతుంది. ఇండియా తయారీ రంగంలో దాదాపు మూడింట ఒక వంతు ఈ రంగానిదే ఉంది. సుంకాలను భారీగా తగ్గించడం వలన 1990లో ఆస్ట్రేలియా కార్ల ఇండస్ట్రీ కుప్పకూలిన విషయం తెలిసిందే" అని వివరించింది. కాగా, ఇండియాపై 26 శాతం టారిఫ్ వేస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని తాజాగా 90 రోజుల పాటు వాయిదా వేసింది.
ఈ టైమ్‌లో 10 శాతం టారిఫ్ వేయనుంది. "అమెరికాతో పూర్తి స్థాయి ఎఫ్‌టీఏను కుదుర్చుకోకూడదు. ఇండియాకు మేలు చేయని రాయితీలను యూఎస్ కోరుతోంది. ఈ డీల్ వలన లాభం కంటే ఎక్కువ నష్టమే ఉంది” అని జీటీఆర్‌ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ అన్నారు. 90 శాతం పారిశ్రామిక వస్తువులపై జీరో -ఫర్- జీరో (నువ్వు జీరో ట్యాక్స్ వేస్తే నేను జీరో ట్యాక్స్ వేస్తా) ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని, అమెరికాకు ఇలాంటి ఒప్పందాన్నే యూరప్ అందించిందని తెలిపారు.
చైనాతో కలిసి పనిచేయాలి..
చైనాతో కలిసి రసాయనాలు, యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో సప్లయ్ చెయిన్‌ను మెరుగుపరుచుకోవాలని సూచించారు. "ఇరు దేశాల్లో దొరికే ముడి పదార్థాలు, ఇంటర్మీడియెట్స్‌ను ఉపయోగించడం ద్వారా, ఇండియా, చైనా రెండూ ఫైనల్ ప్రొడక్ట్ వాల్యూ పెంచొచ్చు. దేశీయ వినియోగం, ఎగుమతుల కోసం వీటిని వాడొచ్చు. ఈ కో–ఆపరేషన్‌తో షార్ట్‌టెర్మ్‌లో అనేక ప్రయోజనాలు దక్కుతాయి" అని శ్రీవాస్తవ అన్నారు.
కార్లు వంటి సెన్సిటివ్ సెక్టార్ల మినహా 90 శాతం పారిశ్రామిక వస్తువులపై పరిమిత రీతిలో "జీరో-టు-జీరో" టారిఫ్ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని సలహా ఇచ్చారు. యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడాతో ఎఫ్‌టీఏలు కుదుర్చుకోవాలని అన్నారు. చైనా, రష్యా వంటి దేశాలతో వాణిజ్య భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని తెలిపారు. దేశీయంగా టారిఫ్‌లను సులభం చేయడం, ప్రొడక్ట్‌ల నాణ్యత మెరుగ్గా ఉండేలా చూసేందుకు వ్యవస్థను ఏర్పాటు చేయడం, జీఎస్‌టీ ప్రాసెస్‌ను సింపుల్ చేయడం వంటి సంస్కరణలు చేపట్టాలని శ్రీవాస్తవ కోరారు.