పైసల్లేవ్.. పోస్టుల్లేవ్.. వర్సిటీలపై నిర్లక్ష్యం

విజ్ఞాన కేంద్రాలుగా వెలుగొందిన యూనివర్సిటీల నుంచే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అన్ని వర్సిటీల నుంచి స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళనల్లో పాల్గొని ఉద్యమానికి ఊపిరి పోశారు. స్వరాష్ట్రం కోసం తెగించి కొట్లాడేందుకు వేదికలైన వర్సిటీల పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. అరకొర నిధులు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్​ ప్రొఫెసర్లు, నాన్​టీచింగ్​ సిబ్బంది కొరత, వర్సిటీల స్వయం ప్రతిపత్తి రోజు రోజుకూ ప్రశ్నార్థకంగా మారడం ఇలా ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయి. టీచింగ్​స్టాఫ్​లేక స్టూడెంట్స్​నష్టపోతున్నారు. దీంతో ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. పరిశోధనలకు ప్రాధాన్యం దక్కడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా యూనివర్సిటీలకు యూజీసీ కల్పించిన స్వతంత్రతను కాపాడుతూ.. వాటి బలోపేతానికి కృషి చేయాలి.

తె లంగాణలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 11 వర్సిటీలు నడుస్తుండగా, రెండు మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉన్నత విద్యకు ప్రాధాన్యం పెరుగుతుందని, వర్సిటీల నిధుల కొరత తీరుతుందని, పూర్తి స్థాయి రిక్రూట్​మెంట్​జరిగి స్టూడెంట్స్​కు మెరుగైన బోధన అందుతుందని అందరూ భావించారు. కానీ విశ్వవిద్యాలయాల పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు సరికదా మరింత దిగజారే పరిస్థితి నెలకొంది. ఉన్నత విద్యలో క్వాలిటీ పడిపోతోంది. యూనివర్సిటీ గ్రాంట్స్​కమిషన్(యూజీసీ) ​కల్పించిన వీసీల అధికారాలు, వర్సిటీల స్వయం ప్రతిపత్తిని రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా దెబ్బతిస్తోంది. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వర్సిటీల స్థాయిలో టీచింగ్, నాన్​టీచింగ్, తాత్కాలిక ఎస్ఎఫ్​సీ ఉద్యోగాల భర్తీ చేపట్టకూడదని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో ఇచ్చారు. యూజీసీ ఏర్పాటు తర్వాత1981 యాక్ట్​ప్రకారం వర్సిటీలకు స్వయం ప్రతిపత్తి లభించింది. దాని ప్రకారం వర్సిటీ వీసీలకు సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా వీసీ అధికారాలకు కోత పెట్టింది.

అన్ని వర్సిటీల్లో ఖాళీలు

రాష్ట్రంలో దాదాపు అన్ని వర్సిటీల్లో టీచింగ్, నాన్​టీచింగ్ స్టాఫ్​కొరత తీవ్రంగా ఉంది. తాత్కాలిక సిబ్బందితోనే కాలం గడుస్తోంది. బాసర ఆర్జీయూకేటీ లో ఒక్క రెగ్యులర్​అధ్యాపకుడు లేరు. కాకతీయ విశ్వవిద్యాలయంలో 71 శాతం బోధనా సిబ్బంది ఖాళీలు ఉన్నాయి. ఓయూలో 67 శాతం పోస్టుల నియామకానికి దిక్కే లేదు. మొత్తంగా అన్ని వర్సిటీలు దాదాపు 65 శాతం ఖాళీలతో వెలవెలబోతున్నాయి. ఒప్పంద, రోజువారి అధ్యాపకులు వర్సిటీలను నడిపిస్తున్నారు. స్టాఫ్​లేకపోవడంతో స్టూడెంట్స్​కు నష్టం జరుగుతోంది. విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీ పోస్టుల రిక్రూట్​మెంట్​కు 2017 నవంబర్ లో పచ్చ జండా ఊపినా.. ఇప్పటికీ నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. 2018లో సుప్రీంకోర్టులో రోస్టర్ పాయింట్ వ్యవహారంపై కేసు దాఖలు కావడంతో భర్తీ ప్రక్రియ లేట్​అయింది. 2019లో స్పష్టత వచ్చినప్పటికీ అదే సంవత్సరం జులైలో వీసీల పదవీకాలం ముగియడంతో అధ్యాపకుల భర్తీ ప్రక్రియ అటకెక్కింది. ఓయూలో 2012లో చివరిసారిగా బోధన సిబ్బంది భర్తీ జరిగింది. జేఎన్టీయూలో 2010లో రిక్రూట్​మెంట్​జరిగింది. ఆ తర్వాత రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చినా మధ్యలో నిలిచిపోయాయి. ఓయూలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, తమిళం లాంటి విభాగాల్లో బోధనా సిబ్బంది ఒక్కరు కూడా లేరు. కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్​లో101 మందికి 43 మందే పని చేస్తున్నారు. 2021 జులైలో రాష్ట్ర ప్రభుత్వం వీసీలను నియమించినా.. వారి అధికారాలకు కోత విధించడంతో సిబ్బందిని రిక్రూట్​మెంట్​చేసుకోవడంలో ఇబ్బందులు తప్పడం లేదు.

స్వయం ప్రతిపత్తిపై దెబ్బ

డిగ్రీ, పీజీ అడ్మిషన్లను సెంట్రలైజ్​చేసినా.. క్లాసులు, ఎగ్జామ్స్ నిర్వహణ ఏ వర్సిటీకీ ఆ వర్సిటే ప్లాన్​ చేసుకునేది. కానీ ఈ ఏడాది నుంచి అన్ని వర్సిటీలకూ కామన్ అకడమిక్ క్యాలెండర్ అమలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. దీంతో వర్సిటీలన్నీ ఉన్నత విద్యామండలి నిర్ణయించే క్యాలెండర్​నే అమలు చేయాల్సి వస్తోంది. ఇదీగాక వర్సిటీల పరిధిలో ఉన్న పీహెచ్​డీ సీట్ల భర్తీతో పాటు టీచింగ్ పోస్టుల భర్తీని కూడా సెంట్రలైజ్ చేయాలని రాష్ట్ర సర్కారు భావించింది. ఆ మధ్య వీసీల మీటింగ్ పెట్టి, కొన్ని ప్రపోజల్స్​ను సర్కారుకు పంపించింది. పీహెచ్​డీ  సీట్ల భర్తీని ఎలా చేయాలనే దానిపై కమిటీని వేసింది. ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి మూడు ప్రపోజల్స్ ను సర్కారుకు అందించింది. ఈ ప్రతిపాదనలు అమలు జరిగితే వర్సిటీలన్నీ డమ్మీలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. 

పోస్టులు భర్తీ చేయొద్దట!

అనేక అధికారాలున్న వర్సిటీ వీసీలు సర్కారు చర్యల వల్ల ఉత్సవ విగ్రహాలుగా మారే అవకాశముందని ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు ఓ లెటర్​పంపింది. వర్సిటీల్లో ఎలాంటి నియామకాలు చేపట్టకూడదని, కనీసం స్వీపర్​ను కూడా ప్రభుత్వ అనుమతి లేనిదే భర్తీ చేయరాదని పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీల స్వయం ప్రతిపత్తిని, స్వతంత్రతను దెబ్బతీస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల తెలంగాణ వర్సిటీలో జరిగిన ప్రక్రియ దీనికి బలం చేకూర్చేలా ఉంది. యూజీసీ గైడ్​లైన్స్​ప్రకారం వర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఉంటుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం భవిష్యత్తులో విశ్వవిద్యాలయాల పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశముందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అరకొర నిధులు 

స్వరాష్ట్రంలోనూ వర్సిటీలకు ప్రభుత్వం కావాల్సినన్ని నిధులు ఇవ్వడం లేదు. ఎంతో కొంత ఫండ్​ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. వచ్చిన నిధులు సిబ్బంది జీతాలు, వర్సిటీ నిర్వహణకు కూడా సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితిలో విశ్వవిద్యాలయాలు సమాజానికి ఉపయోగపడే మేధావులను ఎలా తీర్చిదిద్దగలుగుతాయి? ఈ విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి. 2021-22 ఫైనాన్షియల్​ ఇయర్​లో ప్రభుత్వం రాష్ట్రంలోని వర్సిటీలకు కలిపి రూ. 700 కోట్ల మూల నిధులు కూడా కేటాయించకపోవడం గమనార్హం. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు ప్రభుత్వం రూ.551 కోట్లు కేటాయించింది. అత్యధికంగా ఓయూకు రూ.353.89 కోట్లు, కేయూకు రూ.90.93 కోట్లు, బీఆర్‌ఏవోయూకు రూ.11.94 కోట్లు, పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీకి రూ.28 కోట్లు, హిందీ అకాడమీకి రూ.21.74 కోట్లు, తెలంగాణ వర్సిటీకి రూ. 27.17 కోట్లు, మహాత్మాగాంధీ వర్సిటీకి రూ. 22.28 కోట్లు, శాతవాహన వర్సిటీకి రూ.9.95 కోట్లు,  పాలమూరు వర్సిటీకి రూ. 7.78 కోట్లు కేటాయించారు. ఇవన్నీ జీతాలు చెల్లించేందుకే కావడం గమనార్హం.

- డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి, 

కాకతీయ యూనివర్సిటీ