- జీపీలు, మున్సిపాలిటీల నుంచి పెట్టుకోవాలని సూచన
- జిల్లాకు రూ.10 లక్షలిచ్చి చేతులు దులుపుకున్నరు
వరంగల్, వెలుగు: తెలంగాణ వచ్చాకే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి ఘనంగా నిర్వహిస్తున్నట్టు సర్కారు చెప్తున్నా.. ఉత్సవాల కోసం ఒక్కో జిల్లాకు రూ.10 లక్షల చొప్పున కేటాయించి చేతులు దులుపుకుంది. బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లకు అవసరమైన ఖర్చులో ప్రభుత్వం ఇచ్చింది పావు వంతు కూడా కాదని ఆఫీసర్లు అంటున్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో ఉత్సవాలకు ప్రత్యేకంగా పైసలియ్యకపోవడంతో చైర్ పర్సన్లు, సర్పంచులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఉత్సవాల ఖర్చుల కోసం అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నారు. ఫండ్స్ కోసం దాతలను చూసుకోవాలని ఉత్సవ కమిటీలకు సలహా ఇస్తున్నారు.
బతుకమ్మ ఆటలు, దసరా ఉత్సవాలు పల్లెల్లో బాగా జరుగుతాయి. పట్టణాలు, సిటీల్లో ఉండేవారు కూడా నాలుగు రోజులముందే సొంత ఊర్లకు చేరడంతో సందడి పెరుగుతుంది. ఊళ్లలో చెరువుల దగ్గర బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లకు లక్షల్లో ఖర్చు అవుతోంది. బతుకమ్మ ఘాట్ల దగ్గర వరకు రోడ్ల మీద గుంతల పూడిక, లైటింగ్, సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాల్సిఉంటుంది. కానీ.. ప్రభుత్వం ఈసారి పల్లెల్లో బతుకమ్మ సంబురాల కోసం నిధులు ఇవ్వలేదు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ నిధులతోనే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అయితే గ్రామ పంచాయతీల్లో ఫండ్స్ లేవు. అభివృద్ధి పనుల కోసం సొంత డబ్బులు ఖర్చు చేసి చాలామంది సర్పంచులు అప్పులపాలయ్యారు. జీపీలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం, ఎస్‍ఎఫ్‍సీ నిధులు కూడా కొన్ని నెలల నుంచి రావడం లేదు. ఫండ్స్ లేక పనులు చేయకుంటే జనాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయం సర్పంచులను వెంటాడుతోంది.
జిల్లా కేంద్రాల ఖర్చులోనూ.. పావువంతే
రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ, దసరా ఉత్సవాల నిర్వహణకు ఒక్కో జిల్లాకు రూ.10 లక్షల ఇస్తున్నట్లు చెప్పింది. ఈ ఫండ్స్ జిల్లా కేంద్రం పరిధిలో చేసే ఉత్సవాలకు కూడా సరిపోవట్లేదు. గ్రేటర్ వరంగల్ లోనే 10 నుంచి 15 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రభుత్వం తరఫున మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిన్న వడ్డెపల్లి చెరువు, బెస్తం చెరువు, హనుమకొండలో పద్మాక్షి, సిద్ధేశ్వర టెంపుల్ వద్ద బతుకమ్మ ఉత్సవాలు, ఉర్సుగుట్ట వద్ద దసరా కోసం ఏర్పాట్లు చేస్తోంది. నిమజ్జనాల కోసం చెరువుల్లో గుర్రపుడెక్క తొలగించడం, ఈ ప్రాంతాలకు వెళ్లే దారుల్లో గుంతలు పూడ్చడం.. బతుకమ్మలు ఆడేచోట జేసీబీలతో చదును చేయడం, భారీ లైట్లు, సీరియల్ బల్బులు, సౌండ్ సిస్టం పనులకు రూ.50 లక్షలుపైగా ఖర్చు చేయాల్సి ఉందని మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య తెలిపారు. ప్రభుత్వం మాత్రం రూ.10 లక్షలు కేటాయించింది. దీంతో అధికారులు ఉత్సవ కమిటీలతో మీటింగులు పెట్టి.. ఖర్చులకు దాతలను చూసుకోవాలని సలహా ఇచ్చారు.