రాజన్న సిరిసిల్ల, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా విలీన గ్రామాల్లో అంతిమ యాత్రకు దారులు లేక, దారులు ఉన్నచోట శ్మశాన వాటికలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మనిషి పోయాడనే బాధ ఓవైపు.. దహన సంస్కారాలు చేయడానికి చోటు లేక మరోవైపు బంధువులు తీవ్ర ఆందోళన చెందుతూ ఎవరి పొలంలో వారే అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామాల్లో శ్మశానవాటిక లేక ప్రజలు అవస్థ పడుతున్నారు. సిరిసిల్ల మున్సిపల్ లో విలీనమైన రగుడు, చిన్నబోనాల, ముష్టిపల్లి, సర్థాపూర్, చంద్రంపేట, పెద్దూర్, రాజీవ్ నగర్ లలో వైకుంఠధామాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
శిలాఫలకాలకే పరిమితం..
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు గ్రామం ఈదుల చెరువు సమీపంలో వైకుంఠధామం కోసం 2019లో మంత్రి కేటీఆర్ శిలాఫలకం వేశారు. అప్పటి నుంచి నేటి వరకు శ్మశాన వాటిక నిర్మించలేదు. రాజీవ్ నగర్ లో శ్మశానవాటిక నిర్మిస్తే అంబికానగర్, పద్మనగర్, వెంకంపేట, ముష్టిపల్లి ప్రాంతాలకు చెందిన వారికి అందుబాటులో ఉంటుందని బావించారు. కాని దీని నిర్మాణంలో ఇప్పటి వరకు పురోగతి లేదు.ఈ గ్రామాల్లో ఎవరైనా మరణిస్తే చెరువు గట్టు వద్ద అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. వర్షాకాలంలో చెరువులు నిండటంతో అంతిమ సంస్కారాలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రూ.33 లక్షలతో రగుడులో స్మశానవాటిక పనులు ప్రారంభించిన అనంతరం నిధుల లేమితో పనులను మధ్యలోనే ఆపేశారు. చుట్టూ ప్రహరీ నిర్మించి వదిలేశారు. చాలా గ్రామాల్లో మాడ్రన్ బర్నింగ్ వైకుంఠధామాలను ప్రభుత్వం నిర్మించినా విలీన గ్రామాల్లో అంతిమ సంస్కారాలు జరపడం ఇబ్బందికరంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. చిన్నాబోనాలలో స్థల సేకరణ చేసి శ్మశాన వాటిక నిర్మించాలని ఎన్నిసార్లు ఆఫీసర్లకు మొరపట్టుకున్నా స్థలం లేదని సాకులు చెబుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.
అవస్థలు పడుతున్నాం
గ్రామంలో శ్మశాన వాటిక పనులు పూర్తి కాలేదు. సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాం. శ్మశాన వాటిక నిర్మించి ఏండ్లు గడుస్తున్నా పూర్తిస్థాయి నిర్మాణానికి నోచుకోవడం లేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి త్వరగా పనులు పూర్తి చేయాలి. - గంగుల భాస్కర్ యాదవ్, పెద్దూరు
వానా కాలంలో ఇబ్బందులు..
వానా కాలంలో విలీన గ్రామాల్లోని ప్రజలు చనిపోతే వైకుంఠధామాలకు వెళ్లేందుకు దారులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువులు, కుంటలు దాటుతూ చావు చేయాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. సర్థాపూర్ లో నిధులు మంజూరైనా శ్మశాన వాటి పనులు పూర్తి చేయడం లేదు. తర్కాశీపల్లెలో ముస్లింల ఖబ్రస్థాన్గతంలో అపెరల్ పార్క్ నిర్మాణంలో పోయింది. కాలనీవాసులు పోరాటాలు చేయడంతో మంత్రి కేటీఆర్ ఇటీవల స్థలం కేటాయించారు. కానీ ఇప్పటి వరకు తుర్కాశీపల్లెలో శ్మశానవాటిక నిర్మాణ పనుల ఊసే లేకుండా పోయింది.