ఆరేండ్లుగా ఇదే దుస్థితి
ఏటా వెయ్యి కోట్లు అడిగితే సర్కార్ ఇచ్చేది మూడో వంతే
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీపై రాష్ట్ర సర్కార్ అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఆరేండ్లుగా ఇస్తున్న నిధులు కనీసం స్టాఫ్ జీతాలకు కూడా సరిపోతలేవు. ఏటా వెయ్యి కోట్ల నిధులు కావాలని వర్సిటీ అడుగుతున్నా ప్రభుత్వం అందులో మూడో వంతు కూడా సక్కగ ఇస్తలేదు. 2014–-15లో 170.14 కోట్ల బ్లాక్ గ్రాంట్ ఇస్తే.. ఆ ఏడాది వర్సిటీకి రూ. 436.49 కోట్ల ఖర్చు వచ్చింది. 2019-–20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 346.54 కోట్ల నిధులు ఇస్తే.. రూ. 542.17 కోట్ల ఖర్చు వచ్చింది. ఈ ఫండ్ కూడా సమయానికి రాక జీతాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్టూడెంట్ల ఫీజులు, సెల్ఫ్ ఫైనాన్స్ నిధులు, ఇతరత్రా ఫండ్‌తో వర్సిటీ అధికారులు నెట్టుకొస్తున్నారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆ రోజుల్లోనే రూ. 25 లక్షలు ఖర్చు పెట్టి ఆర్ట్స్ కాలేజీని నిర్మించారని చెబుతారు. తర్వాతి కాలంలో కూడా ఆయా ప్రభుత్వాలు వర్సిటీకి పుష్కలంగా నిధులు ఇచ్చేవి. యూనివర్సిటీలో అన్ని రకాల స్టాఫ్ కలిపి ఐదు వేల మంది దాకా ఉంటారు. ఏటా మూడు లక్షల మంది దాకా చదువుతుంటారు. ఓయూకే ప్రత్యేకమైన డిపార్ట్‌మెంట్లు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన గడ్డ ఓయూ. కానీ.. సొంత రాష్ట్రంలో వర్సిటీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిధులు లేక వర్సిటీ ఇబ్బందులు పడుతోంది.
రిక్రూట్మెంట్స్ బంద్
ఉస్మానియా యూనివర్సిటీలో 56 డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఒక్కో డిపార్ట్మెంట్లో ఏడుగురు టీచింగ్ స్టాఫ్ ఉండాలి. అందులో ఒక ప్రొఫెసర్ ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. యూజీసీ రూల్స్ ప్రకారం మొదట ఓయూలో 1,256 బడ్జెట్ ఫ్యాకల్టీ పోస్టులు ఉండేవి. ఏటా కొందరు రిటైర్ అవుతున్నా కొత్త నియామకాలు చేపట్టడం లేదు. ప్రస్తుతం 415 మంది మాత్రమే పర్మినెంట్ ఫ్యాకల్టీ ఉంది. ప్రతి నెల ఐదు నుంచి 10 మంది దాకా రిటైరవుతున్నారు. దీంతో డిపార్ట్‌మెంట్లు ఖాళీ అవుతున్నాయి. కొన్ని డిపార్ట్‌మెంట్లు కేవలం కాంట్రాక్ట్ సిబ్బందితోనే కొనసాగుతున్నాయి. వర్సిటీలో స్టాఫ్ కొరతపై స్టూడెంట్ల ఆందోళన ఫలితంగా ప్రొఫెసర్ తిరుపతిరావు వీసీగా ఉన్నప్పుడు 2013లో ఒక నోటిఫికేషన్ వెలువడింది. దీని ఆధారంగా రిక్రూట్‌మెంట్ జరిగింది. వర్సిటీలో చివరి రిక్రూట్ మెంట్ అదే. తర్వాత 2017లో 415 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి నా ఇంత వరకు రిక్రూట్‌మెంట్ జరగలేదు. ఇంకా చెప్పాలంటే 2005 నుంచి రిటైరైన ప్రొఫెసర్ , అసిస్ట్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. పర్మినెంట్ వీసీని కూడా నియమించడం లేదు.
మూతపడుతున్న డిపార్ట్‌మెంట్లు
స్టాఫ్ లేక తమిళ డిపార్ట్‌మెంట్ ఎప్పుడో మూతపడింది. వర్సిటీకే ప్రతిష్టాత్మక ఉర్దూ డిపార్ట్‌మెంట్ మూసివేత దిశగా కొనసాగుతోంది. పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లలో ఒక్కోదానిలో 60 మంది టీచింగ్ స్టాఫ్ ఉండేది. ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్లలో 7 నుంచి 12 మందికి టీచింగ్ స్టా ఫ్ కూడా లేదు. లింగ్విస్టిక్స్ , ఆర్కియాలజీ, జియాలజీ, జియోఫిజిక్స్ , జెనెటిక్స్ , మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఆస్ర్టానమీ డిపార్టుమెంట్ల పరిస్థితి ఇట్లే ఉంది. సైకాలజీ, ఉర్దూ, ఫ్రెంచ్, రష్యన్ డిపార్ట్‌మెంట్లు కాంట్రాక్ట్ లెక్చరర్లతో కొనసాగుతున్నాయి. పర్మినెంట్ స్టాఫ్ సహా 250 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, మరో 250 మంది పార్ట్ టైమర్లతో వర్సిటీలో టీచింగ్ కొనసాగుతోంది.
పడిపోతున్న గ్రేడింగ్
మూడేండ్లు గా చదువుల్లో ఓయూ గ్రేడింగ్ పడిపోతోంది. 2001లో ఓయూ తొలిసారిగా న్ యాక్ (నేషనల్ అసెస్‌మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్) గుర్తింపు పొందింది. 2008లో ఏ గ్రేడ్ సాధించింది. 2016 ఏ డబుల్ ప్లస్ గ్రేడ్‌ను సాధించింది. తర్వాత దాని గ్రేడింగ్ పడిపోయింది. విద్యా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే వర్సిటీకి ఈ దుస్థి తి దాపురించిందని, ప్రస్తుత పరిస్థితి చూస్తే న్యాక్ అక్రిడేషన్ కోల్పోయే ప్రమాదమూ కనిపిస్తున్నదని ప్రొఫెసర్లు బాధపడుతున్నారు. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చొరవతో 1918లో ప్రారంభమైన వర్సిటీ ఉన్నత విద్యారంగంలో ఏడవ ప్రాచీన సంస్థ. దక్షిణ భారత దేశంలో మూడో సంస్థ.
ప్రాజెక్టులు వెనక్కి
వర్సిటీలో ఫ్ యాకల్టీ కొరతతో ప్రాజెక్టులు వెనక్కిపోతున్నాయి. డిపార్ట్మెంట్లకు గతంలో సాప్, డీఆర్ఎస్ , డీఎస్ టీ, ఫిస్ట్ వంటి ప్రాజెక్టుల ద్వారా కోట్లలో నిధులు మంజూరయ్యేవి. ఫ్యాకల్టీ లేకపోవడంతో ఆ గ్రాంట్లు నిలిచిపోయాయి. నిధుల కొరతకు ఇదో కారణం. 2014లో యూనివర్సిటీ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్సీ కింద ఓయూ ఎంపికవడంతో రూ . 50 కోట్లు నిధులు వచ్చాయి . ఈ సారి దానికి.. హైదరాబాద్ సెంట్ర ల్ యూనివర్సిటీ ఎంపికైంది. ఓయూకు ఆ లిస్టులో చోటు దక్కలేదు.
వందేండ్ల వేడుకకు 50 కోట్లే..
రెండేండ్ల కింద(2018లో) జరిగిన ఓయూ వండేండ్ల ఉత్సవాలకు ప్రభుత్వం రూ .200 కోట్లు ఇస్తామని ప్రకటించింది. కానీ.. ఇచ్చింది రూ . 50 కోట్ల మాత్రమే. మిగతా రూ. 150 కోట్లు ఇప్పటి వరకు రాలేదు. నాడు ప్రభుత్వం ఏడాది పాటు కార్యక్రమాలు జరుపుతామని ప్రకటించింది. కానీ.. మూడు రోజుల్లోనే కార్యక్రమాలను ముగించింది. అవి కూడా మొక్కుబడిగానే సాగించింది. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మొదటిసారి అప్పుడే(వందేండ్ల వేడుకకు) వర్సిటీలో అడుగుపెట్టారు. స్టూడెం ట్లను ఉద్దేశించి సీఎం మాట్లాడుతారని భావిస్తే.. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. అప్పుడే తప్ప.. అంతకు ముందూ, ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఓయూ ముఖం చూడలేదు.
సొంత రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీని పట్టించుకునే దిక్కు లేకుండాపోయింది. రాష్ట్రం వస్తే వర్సిటీ దశ తిరుగుతుందని ప్రొఫెసర్లు, స్టూడెంట్లు భావించినా.. అదేమీ జరగకపోగా మరింత నిర్లక్ష్యానికి గురవుతోంది. ఆరేండ్లుగా రాష్ట్ర సర్కారు ఓయూను గాలికి వదిలేసింది. నిధుల్లో భారీగా కోతలు పెడుతోంది. ఒకప్పుడు ఒక్కో డిపార్ట్మెంట్లో 20 మంది దాకా ఫ్యాకల్టీ ఉంటే.. ఇప్పుడు రిటైర్మెంట్లు తప్ప రిక్రూట్మెంట్ల ముచ్చట్నే లేదు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కాంట్రాక్టు పోస్టులు తప్ప ఒక్క పర్మినెంట్ పోస్టును కూడా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. ఫ్యాకల్టీ లేక ఇటు డిపార్ట్‌మెంట్లు మూతపడుతుండగా.. అటు ప్రాజెక్టులు రాక ఇతర గ్రాంట్లు కూడా వర్సిటీకి దక్కడం లేదు.
వీసీని నియమించాలి
వర్సిటీ సమస్యలు పరిష్కారం కావాలంటే ముందు వీసీని నియమించాలి. వీసీలను నియమిస్తేనే కొత్త ఫ్యాకల్టీ రిక్రూట్ మెంట్స్ చేపట్టే అవకాశాలు ఉంటాయి. 2013 నుంచి ఫ్యాకల్టీ నియామకాల్లేవు. ఏటా సీనియర్ ఫ్యాకల్టీ రిటైర్ అవుతున్నారు. దీంతో చాలా డిపార్టుమెంట్లు ఖాళీ అవుతున్నాయి. ఇలాగే కొనసాగితే మరో మూడేండ్లలో మొత్తం డిపార్ట్‌మెంట్లు పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదముంది. ప్రభుత్వం వెంటనే వీసీని నియమించాలి. – ప్రొఫెసర్ మనోహర్ రావు, ఔటా అధ్యక్షుడు
కేసీఆర్ వచ్చినంక ఒక్క వర్సిటీ బాగుపడలేదు
కేసీఆర్ సీఎం అయ్యాక వర్సిటీలు భ్రష్టు పట్టినై. ఆయనకన్నా సీమాంధ్ర నేతలే నయంగా ఉండిరి. స్టూడెంట్ల ఆందోళనలకు భయపడి నిధులు ఇచ్చేవాళ్లు. రిక్రూట్‌మెంట్లు చేసే వాళ్లు. ఇప్పుడంతా దరిద్రమైపోయింది. 2012 తర్వాత ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్‌మెంట్ జరగలేదు. కేసీఆర్ వస్తే నాన్ టీచింగ్ పోస్టు లైనా భర్తీ చేస్తరనుకున్నం. ఏడెనిమిది వేల పోస్టులుంటయ్ అవి. అన్ని దొంగ చాటుగా నిం పుతున్నరు. గురువులు లేని చదువులు ఓయులో కొనసాగుతున్నయ్. – మానవతా రాయ్ , చైర్మన్, తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ.