- ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు డీలా.. హౌజింగ్ కార్పొరేషన్‌దీ అదే పరిస్థితి
నల్గొండ, వెలుగు : గతంలో స్వయం ఉపాధి పథకాలు, వెల్ఫేర్ స్కీంలతో కళకళలాడిన కార్పొరేషన్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఏటా యాక్షన్ ప్లాన్లు.. వేల కోట్ల బడ్జెట్‌తో నిరుపేదలకు.. నిరుద్యోగ యువతకు అండగా నిలబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు ఇప్పుడు పనిలేక ఉత్సవ విగ్రహాలుగా మారాయి. వెల్ఫేర్ డిపార్ట్మెంట్లకు సర్కార్ నిధులు ఇవ్వకపోవడం, పలు పథకాల బాధ్యతలను వేర్వేరు డిపార్ట్మెంట్లను అప్పగించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని చెప్పుకునే సర్కారు.. సొంతంగా ఉపాధి పొందాలని ఆశిస్తున్న వేలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును దెబ్బతీస్తోంది.
దళిత బంధుకే పరిమితం
వందల కోట్ల బడ్జెట్‌తో వేలాది మందికి ఉపాధి కల్పించిన ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక్క దళితబంధుకే పరిమితమైంది. ఈ స్కీమ్‌ను కూడా త్వరలో ఎంపీడీఓలకు అప్పగించాలన్న ఆలోచనలో ఉంది. దళితులకు మూడెకరాల భూమి పథకాన్ని మధ్యలోనే బంద్ పెట్టారు. మొదట్లో కొంత మందికి భూములు పంపిణీ చేసినా.. చాలా చోట్ల భూముల రేట్లు ఎక్కువగా ఉండడంతో స్కీమ్‌ను ఆపేసింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ స్కీంల బాధ్యతలను ఆర్డీఓలకు కట్టబెట్టడంతో బీసీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లకు పని లేకుండా పోయింది. మూడేండ్లుగా ఈ కార్పొరేషన్ల ద్వారా ఎలాంటి స్కీంలు అమలు కాలేదు. చివరిసారి 2018 ఎలక్షన్ల టైంలో బీసీ వెల్ఫేర్కార్పొరేషన్ ద్వారా రూ.50 వేల లోపు లోన్లు మంజూరు చేసిన సర్కార్.. ఆ తర్వాత మరే స్కీమ్‌నూ అమలు చేయలేదు. ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్శాఖల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. హౌజింగ్ కార్పొరేషన్లో డబుల్ బెడ్ రూమ్ స్కీం తప్ప మరో కార్యక్రమం లేదు. ఈ స్కీమ్ నూ ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్లే చేపడుతున్నాయి. హౌజింగ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ మాత్రమే చేస్తోంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇంకా ఎక్కడా వందశాతం పూర్తికాలేదు.
ఉపాధికి యువత దూరం
టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల నుంచి సెల్ఫ్ ఎంప్లాయిమెంట్, బ్యాంకు లింకేజీ రుణా లు ఇవ్వడం మానేసింది. ఏటా ఏప్రిల్ లో రిలీజయ్యే యాక్షన్ ప్లాన్లు అతీగతీ లేవు. 2018, 2020లో ఎంపిక చేసిన వారికే ఇప్పటివరకు సబ్సిడీ రిలీజ్ చేయలేదు. గత నాలుగేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మంది వివిధ కార్పొరేషన్ల ద్వారా లోన్ల కోసం అప్లికేషన్లు పెట్టుకున్నారు. అవన్నీ ఆఫీసుల్లోనే మూలుగుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా అప్లికేషన్లు తీసుకుని వాటి నీ పక్కనపడేశారు. దీంతో బ్యాంకులు లోన్‌లు ఆపేశాయి. ప్రభుత్వం సబ్సిడీ రిలీజ్ చేస్తేనే లోన్లు ఇస్తామని చెప్తున్నాయి. దీంతో శాంక్షన్ అయిన లోన్లు లబ్ధిదారులకు అందడంలేదు. నల్గొండజిల్లాలోనే ఎస్సీ వెల్ఫేర్కార్పొరేషన్ ద్వారా 2020లో సాంక్షన్ అయిన 590 యూనిట్లు గ్రౌండింగ్ కాకుండా ఆగిపోయాయి. 2018లో సెలక్ట్ అయినవారికే ఇప్పుడిప్పుడు సబ్సిడీ అమౌంట్వస్తోందని అధికారులు చెప్తున్నారు.
బీసీ సంక్షేమ శాఖలోనూ..
బీసీ సంక్షేమ శాఖలోనూ నాలుగేండ్లుగా లోన్లు ఇవ్వడంలేదు. 2018 ఎన్నికల టైమ్‌లో మాత్రమే పెండింగ్‌లో ఉన్న రూ.50వేల లోన్లు శాంక్షన్ చేశారు. గిరిజన సంక్షేమ శాఖలో 2020, 2022 యాక్షన్ ప్లాన్లు ఇప్పటికీ అమలు కాలేదు. టార్గెట్ మేరకు లబ్ధిదారులను ఎంపిక చేసినా ప్రభుత్వం సబ్సిడీ రిలీజ్ చేయకపోవడంతో బ్యాంకర్లు లోన్లు పెండింగ్‌లో పెడ్తున్నారు. అలాగే, మైనార్టీ వెల్ఫేర్‌లోనూ 2020 నుంచి స్వయం ఉపాధి స్కీమ్‌లు ఆగిపోయాయి. 2018–-19లో శాంక్షనై.. ఆన్లైన్లో పెండింగ్‌లో ఉన్న కొందరికి మాత్రం రూ.50 వేల లోన్లు ఇచ్చి ఆపేశారు.
ఖాళీగా ఉంటున్న సిబ్బంది
కార్పొరేషన్లకు నాలుగేండ్లుగా నిధులు ఇవ్వక పోవడంతో కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బందికి చేతి నిండా పని లేకుండా పోయింది. నల్గొండ జిల్లాలో ఒక్క ఎస్సీ కార్పొరేషన్ లోనే 10 మంది స్టాఫ్ పని చేస్తున్నారు. పక్కాగా స్కీంలు అమలు అయ్యే రోజుల్లో ఇటు లబ్ధిదారుల రాకతో, గ్రామ సభలు, పట్టణ సభలు, లోన్ల గ్రౌండింగ్ కు సంబంధించి నిత్యం హడావుడి గా కనిపించే ఆఫీసు ఇప్పుడు బోసిపోయి కన్పిస్తోంది. ఇక బీసీ కార్పొరేషన్ అయితే కేవలం వెల్ఫేర్హాస్టల్స్ నపడం తప్ప వేరే పని లేకుండా పోయింది. సర్కారు లోన్లు ఇవ్వక పోవడంతో ఆఫీస్ వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూసే పరిస్థితి లేదు. కనీసం కుల సంఘాల రిజిస్ట్రేషన్లకు కూడా ఆసక్తి చూపడం లేదు.