సింగరేణిలో ఆటల్లేవ్! కార్మిక క్రీడాకారులపై యాజమాన్యం నిర్లక్ష్యం

సింగరేణిలో ఆటల్లేవ్! కార్మిక క్రీడాకారులపై యాజమాన్యం నిర్లక్ష్యం
  • పదేండ్ల నుంచి ఖాళీగా స్పోర్ట్స్ ఆఫీసర్ కుర్చీ 
  • రెండేండ్లుగా ఇవ్వని స్పోర్ట్స్ షూస్, యూనిఫాం
  • ప్రమోషన్స్ కు స్పోర్ట్స్​సూపర్​ వైజర్స్​ ఎదురుచూపు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్ కంపెనీ కార్మికుల క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదు.   పదేండ్లుగా స్పోర్ట్స్​ఆఫీసర్​ కుర్చీ ఖాళీగా ఉండగా.. ఇన్ చార్జ్ లతోనే నెట్టుకొస్తున్న పరిస్థితి ఉంది.  కోల్ ఇండియా స్థాయిలో జరిగే పోటీల పర్యవేక్షణతో పాటు వార్షిక క్రీడల క్యాలెండర్​ను సూపర్​వైజర్స్​తోనే తయారు చేయించి కాలం వెళ్లదీస్తుంది. మరో వైపు స్పోర్ట్స్​సూపర్​ వైజర్లు ప్రమోషన్స్​కు ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు. స్పోర్ట్స్​షూస్​, యూనిఫాం రెండేండ్లుగా క్రీడాకారులకు ఇవ్వడంలేదు. సింగరేణి హెడ్డాఫీస్​లోని కొత్తగూడెంలోని  ప్రకాశం స్టేడియం అధ్వానంగా తయారైంది.  సింగరేణి యాజమాన్యం క్రీడాకారులపై నిర్లక్ష్యంగా ఉంటుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రెండేండ్లుగా నో షూస్​,యూనిఫాం 

సింగరేణిలో క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామంటూ వార్షిక క్రీడా పోటీలు, కోల్ ఇండియా స్థాయి పోటీల  సందర్భంగా పేర్కొంటుండడం పరిపాటిగా తయారైంది. కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం ఏరియా, ఇల్లెందు, మణుగూరు, భూపాలపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, అడ్రియాల, ఆర్జీ–1,2,3ఏరియాలతో పాటు ఎస్టీపీపీ ప్రాంతాల్లో ప్రతి ఏడాది వార్షిక క్రీడలను సింగరేణి నిర్వహిస్తుంది. ఇందులో ప్రతిభ చూపిన కార్మికులతో  రీజియన్​ క్రీడా పోటీలు ఏర్పాటు చేసి కంపెనీ స్థాయి క్రీడలకు  ఎంపిక చేస్తుంది. కంపెనీ స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులను కోల్​ ఇండియా స్థాయిలో జరిగే పోటీలకు పంపిస్తుంది. ఇటీవలి కాలంలో కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో కోల్ ఇండియా స్థాయి అథ్లెటిక్స్​ పోటీలను భారీ ఎత్తున నిర్వహించింది. దేశవ్యాప్తంగా తొమ్మిది బొగ్గు కంపెనీల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. సింగరేణి క్రీడాకారులు తమ ప్రతిభతో  గోల్డ్​, సిల్వర్​, బ్రాంజ్​మెడల్స్​ గెలుపొందారు. కాగా రెండేండ్లుగా కార్మిక క్రీడాకారులకు స్పోర్ట్స్​ షూస్​, యూనిఫామ్ ను పంపిణీ చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉంటుంది. రెండేండ్లుగా క్రీడా సామగ్రిని అరకొరగానే కొనుగోలు చేస్తుంది.  ప్రతి ఏడాది బడ్జెట్​కేటాయింపులు కూడా తక్కువేనని అంటున్నారు.  బడ్జెట్​లో కనీసం రూ. 1.50కోట్లు కేటాయించాలని క్రీడాకారులు డిమాండ్​ 
చేస్తున్నారు.