
చేవెళ్ల, వెలుగు: విశ్వావసు నామ సంవత్సరమంతా బాగానే ఉంటుందని, అతివృష్టి, అనావృష్టి లేకుండా కావాల్సినంత వర్షాలు కురుస్తాయని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సీఎస్ రంగరాజన్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయంలో ఆదివారం ఉగాదిని పురష్కరించుకుని టెంపుల్ మేనేజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. రంగరాజన్ మాట్లాడుతూ గతేడాదిలాగే ఈసారి కూడా గరుత్మంతుడికి నైవేద్యంగా పెట్టే గరుడ ప్రసాదాన్ని (సంతాన ప్రాప్తి కోసం అందించే ప్రసాదం) బ్రహ్మోత్సవాల సమయంలో వితరణ చేయట్లేదని స్పష్టం చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా బ్రహ్మోత్సవాల్లో కాకుండా ఇతర రోజుల్లో ప్రసాదాన్ని వితరణ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు.
గతేడాది మే నెల నుంచి ప్రతి శుక్రవారం అభిషేక ప్రసాదాన్ని గరుడ ప్రసాదంగా ఇచ్చుకుంటూ వస్తున్నామని, ఈసారీ అలాగే చేస్తామన్నారు. అయితే, గతేడాది కూడా ఇలాగే ప్రకటించినా బ్రహ్మోత్సవాల్లో గరుడ ప్రసాదం ఇస్తున్నారని ప్రచారం జరగడంతో వేల సంఖ్యలో జనాలు తరలివచ్చి ఇబ్బందులు పడ్డారు.