పెండ్లికి కట్నంగా 100 పుస్తకాలు

  • కేరళలో నిఖా.. వధువుకు మెహర్​గా బుక్స్ ఇచ్చిన వరుడు     
  • ఖురాన్, భగవద్గీత, బైబిల్ వంటి బెస్ట్ బుక్స్
  • అందుకున్న వధువు
  • సూపర్ అని మెచ్చుకుంటున్న నెటిజన్లు

పెండ్లి సందర్భంగా వధువు లేదా వరుడు ఏం గిఫ్ట్​లు కోరుకుంటారు? బంగారమో లేదా బైక్, కార్ వంటి వెహికిల్సో, లేదా కొత్త సంసారానికి కావల్సిన వస్తువులనో ఆశిస్తుంటారు. కానీ కేరళలోని ఓ వధువు వీటికన్నా విలువైన పుస్తకాలను పెళ్లి కట్నంగా తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇస్లాం సంప్రదాయం ప్రకారం పెళ్లి సందర్భంగా వధువు ఏం కోరితే వరుడు అది కాదనకుండా ఇవ్వాల్సిందే. దీనినే మెహర్ అంటారు. చాలా మంది వధువులు బంగారమో, డబ్బో ఇంకేదైనా విలువైన వస్తువులనో మెహర్ గా కోరుకుంటుంటారు.

కానీ కేరళలోని కొల్లాం సమీపంలోని చదయమంగళానికి చెందిన అజ్నా నజీం తనకు ఎంతో ఇష్టమైన పుస్తకాలనే మెహర్​గా కోరుకుంది. కొల్లాం జిల్లి పోరెడామ్ కు చెందిన పెండ్లి కొడుకు ఇజాస్ హకీమ్ కూడా సంతోషంగా ఆమెకు నచ్చిన పుస్తకాలను కొని చేతిలో పెట్టాడు. ఈ కొత్త ట్రెడిషన్ బాగుందని నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

అజ్నా నజీం బీఈడీ స్టూడెంట్. ఇజాస్ హకీం సివిల్ ఇంజనీర్. ఇద్దరికీ కొన్నాళ్ల క్రితం పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఎంగేజ్ మెంట్ జరిపించారు. ఆ తర్వాత ఇద్దరికీ మాటలు కలిశాయి. ఒకరి మనసు ఒకరు తెలుసుకున్నారు. డిసెంబర్ 29న నిఖా పక్కా అయింది. దీంతో మాటల మధ్యన ఆమెకు మెహర్ గా ఏం కావాలని ఇజాస్ అడిగాడు. తనకు పుస్తకాలు చదవడం చాలా ఇష్టమని, అందుకే పుస్తకాలే కట్నంగా కావాలని చెప్పింది. ఇద్దరి తల్లిదండ్రులూ ఒప్పుకొన్నారు. కానీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మాత్రం ఇలాంటి కొత్త ట్రెడిషన్లు మొదలుపెట్టొద్దని అడ్డుచెప్పారు. అయినా తాము మంచి పనే చేస్తున్నామని వారు పుస్తకాలకే మొగ్గుచూపారు. ఆమె తనకు కావాల్సిన పుస్తకాల లిస్ట్​ను అతడి చేతిలో పెట్టింది. అతడు ఆ లిస్ట్​కు ఖురాన్, భగవద్గీత, బైబిల్ వంటి పుస్తకాలను మరిన్ని మంచి పుస్తకాలను జోడించి, మొత్తంగా100 పుస్తకాలను నిఖా రోజు ఆమెకు కట్నంగా అందజేశారు.

మెహర్ అనేది ముస్లిం మహిళల హక్కు అని, అయితే బంగారం మాత్రమే మెహర్​గా కోరుకోవాలన్న రూల్స్ ఏమీ లేవని ఇజాస్ స్పష్టం చేశారు. పుస్తకాల విలువను చాటిన ఈ నిఖా ముచ్చట నెట్టింట్లో వైరల్ అయింది. అజ్నా, ఇజాస్ ల డెషిషన్ సూపర్ అని నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.