
యూపీఐ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధిస్తున్నారనే పుకార్లను కేంద్రం కొట్టిపారేసింది. రూ. 2 వేలకు పైగా జరిపే లావాదేవీలపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నట్లు వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రకటించింది. అవన్నీ నిరాధారమైనవని..ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు ఏవీ లేవని తెలిపింది.
రూ. 2,000 కంటే ఎక్కువ UPI లావాదేవీలపై GST విధించాలని ప్రభుత్వం పరిశీలిస్తోందనే వాదనలు పూర్తిగా అబద్ధం, తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి. ఎటువంటి ఆధారం లేని ప్రచారం. ప్రస్తుతం ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన లేదు . UPI ద్వారా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని పేర్కొంది.
దేశంలో డీమానిటైజేషన్ తర్వాత ప్రజలకు యూపీఐ సేవలను ఫిన్ టెక్ కంపెనీలు చేరువ చేశాయి. ఈ క్రమంలో మారుమూల పల్లెలకు సైతం డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వ్యాప్తి చెందింది. ఇదంతా సాధ్యం కావటానికి ఒక్కటే కారణం యూపీఐ చెల్లింపుల మీద ఎలాంటి ఛార్జీలు, అదనపు ఖర్చులు లేకపోవటమే. ఎందుకంటే భౌతికంగా డబ్బు వాడినప్పుడు కూడా ప్రజలకు ఇదే వెసులుబాటు ఉండేది కాబట్టి.
అయితే త్వరలోనే భారత ప్రభుత్వం రూ.2వేలు పైబడి చేసే ట్రాన్సాక్షన్లకు 18 శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేయనుందనే ప్రచారం జరిగింది. ప్రజల జీవితంలో యూపీఐ వినియోగం సాధారణ చర్యగా మారిపోయిన తరుణంలో పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు దీనిని ఒక పెద్ద మార్గంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోందనే వార్తలు వచ్చాయి. చాలా మంది ప్రజలు దీనిపై ఆగ్రహంగా ఉండగా.. ఇది అమలులోకి వస్తే సాధారణ వినియోగదారుల నుంచి చిన్న వ్యాపారుల వరకు అందరిపై అదనపు భారాన్ని కలిగిస్తుందనే ఆందోళనలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధిస్తున్నట్లు వస్తున్న ప్రచారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
ఇప్పటికే మార్కెట్లో చాలా మంది చిన్న వ్యాపారులు క్రెడిట్ కార్డు చెల్లింపుల సమయంలో తమపై పడే 1 నుంచి 2 శాతం ఛార్జీలను తమ కస్టమర్ల వద్ద నుంచే వసూలు చేస్తున్నారు. దీనినే మర్చంట్ డిస్కౌంట్ రేటుగా పిలుస్తుంటారు. వాస్తవానికి వీటిని కొనుగోలుదారుల నుంచి వసూలు చేయకూడదు. వీటిని వ్యాపారులే భరించాల్సి ఉంటుంది. అందుకే చిన్న వ్యాపారుల వద్ద ప్రజలు క్రెడిట్ కార్డులను ఎక్కువగా వినియోగించటానికి ఇష్టపడరు. జీఎస్టీ యూపీఐ చెల్లింపుల మీద నిజంగానే అమలు చేస్తే కరెన్సీ నోట్లకు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది రిజర్వు బ్యాంకుపై అదనపు భారాన్ని కలిగిస్తుంది.