జిల్లాలకు రాని బస్తీ దవాఖానలు

వరంగల్‍రూరల్‍, వెలుగు: 2018 ఏప్రిల్‍6.. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‍ హైదరాబాద్‍ అంబర్‍పేట్‍లోని బీజేఆర్‍ నగర్‍లో మొట్టమొదటి బస్తీ దవాఖానను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‍ లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో అందరికీ అందుబాటులో ఆరోగ్యం కాన్సెప్ట్​తో సర్కారు పనిచేస్తోందన్నారు. రూపాయి ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ప్రతి 10 వేల మందికి ఒకటి చొప్పున ఐదారు నెలల్లో హైదరాబాద్‍లో 500 దవాఖానలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇవేకాక పాత జిల్లా కేంద్రాల్లో కలిపి వీటిని వెయ్యికి పెంచుతామని మాటిచ్చారు. రెండేళ్లు గడిచినా 168 సెంటర్లు దాటలేదు. చాలా జిల్లా కేంద్రాల్లో వీటి ఊసే లేదు.

పేద, మిడిల్‍ క్లాసోళ్లకు మేలు

ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్‍ ‘మొహల్లా క్లినిక్‍’ పేరుతో పేదలకు ఉపయోగపడేలా బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి అత్యుత్తమ సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. దీని స్ఫూర్తితో తెలంగాణ సర్కారు రెండేళ్ల క్రితమే ఇలాంటి దవాఖానల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఎంబీబీఎస్‍ డాక్టర్‍తో పాటు ముగ్గురు, నలుగురు సిబ్బంది ఉంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నడిచే ఈ లోకల్‍ ఆసుపత్రుల్లో రూపాయి ఖర్చు లేకుండా బ్లడ్‍, యూరిన్‍, బీపీ, షుగర్‍, కిడ్నీ, థైరాయిడ్‍ టెస్టులు వంటివి చేస్తారు. టెస్టుల ఆధారంగా ఫ్రీగా మెడిసిన్‍ కూడా అందిస్తారు. మరీ ఎమర్జెన్సీ కేసులుంటే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్‍ చేస్తారు. పేద, మధ్య తరగతి జనాలకు దగ్గరగా ఉండటానికి తోడు సర్కారు పెద్దాసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందనే ఉద్దేశంతో వీటి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

జిల్లా కేంద్రాల్లో ఇంకా పెట్టలే

బస్తీ దవాఖానాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర సర్కారు హైదరాబాద్‍ మహానగరంపై చూపిన శ్రద్ధలో కొంత కూడా ఇతర ప్రాంతాలపై చూపలేదు. ముందుగా పది ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు కార్పొరేషన్లలో వీటిని ప్రారంభిస్తామని చెప్పినా అది అమలుకు నోచుకోలేదు. సిటీ పరిధిలో ప్రతి డివిజన్లో కనీసం ఒక బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకుంటే కొత్త బిల్డింగులు కట్టాలని ఆదేశించినా వాటి నిర్మాణాలు చేపట్టలేదు.

కరోనా.. సీజనల్​ వ్యాధులు

కరోనా వైరస్‍ ఇప్పటికే జనాలను గడగడలాడిస్తోంది. కాస్త జ్వరం, అలసట, గొంతునొప్పి ఉన్నా తమకు ఇక కరోనా రావొచ్చనే భయంతో గాబరా అవుతున్నారు. దీనికితోడు వానలు మొదలుకావడంతో సీజనల్​వ్యాధులు మొదలవుతున్నాయి. ఏది కరోనో.. ఏది మామూలు జ్వరమో అర్థం కాక బాధితులు ఆగమాగం అవుతున్నారు. కరోనా భయంతో కాలనీలకు దగ్గరగా ఉండే ప్రైవేటు క్లినిక్స్​పెద్దగా తెరవడం లేదు. ట్రీట్‍మెంట్‍ ఇవ్వడానికి డాక్టర్లు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రజలు వేలాది రూపాయలు పెట్టి సూపర్​స్పెషాలిటీ హస్పిటళ్లకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. సర్కారు చెప్పినట్టుగా ఇలాంటి సమయాల్లో జనాలకు దగ్గర్లో బస్తీ దవాఖానలు అందుబాటులో ఉంటే ఏంతో మేలు చేకూరుతుంది.