కరెంటు చార్జీలు పెంచం.. రాష్ట్రంలో వినియోగదారులకు తప్పిన భారం

 కరెంటు చార్జీలు పెంచం.. రాష్ట్రంలో వినియోగదారులకు తప్పిన భారం
  • స్పష్టం చేసిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్
  • రాష్ట్రంలో వినియోగదారులకు తప్పిన భారం
  • డిస్కంల ఏఆర్ఆర్ ప్రతిపాదనలు రూ.65,849.74కోట్లు
  • రూ 59,209.45 కోట్లకు ఈఆర్​సీ అనుమతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెంచబోమని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్‌‌‌‌సీ) స్పష్టం చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ప్రతిపాదించిన అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌‌‌‌మెంట్ (ఏఆర్‌‌‌‌ఆర్)పై బహిరంగ విచారణ పూర్తి చేసిన ఈఆర్‌‌‌‌సీ, రూ.65,849.74 కోట్ల ప్రతిపాదనల్లో రూ.7,221.65 కోట్లు కోత విధించి, రూ.58,628.09 కోట్లకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.13,499.41 కోట్ల లోటును భరించేందుకు అంగీకరించడంతో వినియోగదారులపై చార్జీల భారం పడకుండా నిర్ణయం తీసుకుంది. 

ఈఆర్‌‌‌‌సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 1.9 కోటి వినియోగదారులు ఉన్నారని, వీరిలో 1.37 కోటి గృహ వినియోగదారులు, 29.15 లక్షల వ్యవసాయ కనెక్షన్లు, 19.89 లక్షల వాణిజ్య, 4.5 లక్షల పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయని వెల్లడించారు. ఏ సెక్టార్‌‌‌‌లోనూ విద్యుత్ చార్జీల పెంపు ఉండబోదన్నారు.

డిస్కంల ప్రతిపాదనల్లో కోత

డిస్కంలు విద్యుత్ కొనుగోళ్ల కోసం రూ.50,571.82 కోట్లు, పంపిణీ ఖర్చుల కోసం రూ.9,341.50 కోట్లు ప్రతిపాదించగా, ఈఆర్‌‌‌‌సీ కొనుగోళ్లను రూ.45,350.33 కోట్లకు, పంపిణీ ఖర్చులను రూ.7,644.85 కోట్లకు తగ్గించింది. యాదాద్రి ప్రాజెక్ట్‌‌‌‌లో కొన్ని యూనిట్లు ఇంకా పూర్తి కానీ నేపథ్యంలో అంచనాలను సవరించినట్లు ఈఆర్‌‌‌‌సీ వెల్లడించింది. వ్యవసాయ విద్యుత్ వినియోగంపై డిస్కంలు చేసిన అంచనాలను శాస్త్రీయంగా సమీక్షించి, సరైన ప్రతిపాదిక లేని వాటిని తిరస్కరించింది.

 ఇలా మొత్తం రూ.65,849.74 కోట్ల ప్రతిపాదనల్లో రూ.58,628.09కోట్లు ఆమోదం తెలిపింది. దీంతో రూ.7,221.65కోట్లు కోతపడింది. ఇందులో యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ పూర్తవుతుందని అంచనాల్లో పేర్కొందనీ అయితే యాదాద్రిలో ఇప్పటి వరకు యూనిట్–2 మాత్రమే గత జనవరిలో ప్రారంభమైందని పేర్కొన్నారు. ఆగస్టు 25న ఫస్ట్ యూనిట్, నవంబరులో మూడవ యూనిట్, అక్టోబరులో నాలుగో యూనిట్, వచ్చే జనవరి 2026కు ఐదో యూనిట్ ప్రారంభం అవుతుందని పేర్కొనడంతో.. ఆ మేరకు అంచనాలను ఈఆర్​సీ మార్చింది. అదే విధంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్​మిషన్ చార్జీలు ట్రూ డౌన్ రూ.685.78కోట్లు, ట్రాన్స్ మిషన్ ట్రూ డౌన్ రూ.1608 కోట్లు ఉందనీ ఇలా అన్ని కలిపి ఏఆర్ఆర్ అంచనాల్లో కోత విధించింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్ స్టేషన్ కాంటాక్ట్ లోడ్​ను 58 కిలోవాట్ పర్ 75హెచ్​పీ నుంచి 150కిలోవాట్ పర్ 201హెచ్​పీకి విస్తరించింది. గ్రిడ్ సపోర్ట్ చార్జీలు నెలకు రూ.20.04 కిలోవాట్ గా డిస్కంలు ప్రతిపాదించగా ఈఆర్​సీ నెలకు రూ.18.48కిలోవాట్​కు అనుమతించింది.

సబ్సిడీల వివరాలు

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రూ.11,602.60 కోట్లు, గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కింద రూ.1,896.81 కోట్ల సబ్సిడీ అందిస్తున్నది. మొత్తంగా రూ.13,499.41 కోట్ల నిధులను డిస్కంలకు అందజేస్తుంది.

భవిష్యత్ డిమాండ్‌‌‌‌తో సవాళ్లు

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్నదని, గత మార్చి 20న పీక్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరిందని జస్టిస్ నాగార్జున్ తెలిపారు. 2033-–34 నాటికి విద్యుత్ లోటు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కేంద్రం నెట్‌‌‌‌ జీరో లక్ష్యంతో పునర్వినియోగ ఇంధనాన్ని ప్రోత్సహిస్తుండగా, రాష్ట్రం సోలార్ ప్రాజెక్టులపై దృష్టి సారించిందన్నారు.

లోటు భరించేందుకు ప్రభుత్వం సిద్ధం

డిస్కంలు 2025-–26 కోసం రూ.65,849.74 కోట్ల ఆదాయ అవసరాలను ప్రతిపాదించగా, ఈఆర్‌‌‌‌సీ రూ.58,628.09 కోట్లకు ఆమోదం తెలిపింది. విద్యుత్ చార్జీల ద్వారా డిస్కంలకు రూ.45,710.05 కోట్ల ఆదాయం వస్తుందని, మిగిలిన రూ.13,499.41 కోట్ల లోటును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని పేర్కొంది. దీంతో వినియోగదారులపై భారం పడకుండా కొత్త టారిఫ్‌‌‌‌ను ప్రకటించింది.