టోల్ గేట్స్.. ఇప్పటి వరకు టోల్ ఛార్జీలు మాత్రమే వసూలు చేసేవి.. ఇక నుంచి ఇన్సూరెన్స్ జరిమానాలు కూడా విధిస్తాయి. అవును.. మీరు వింటోంది నిజమే. ఇప్పుడు దేశంలో జరుగుతుంది కూడా.. తెలుగు రాష్ట్రాల్లో కాదులేండీ. ఒడిశా రాష్ట్రంలో... టోల్ గేట్ దగ్గర టోల్ ఛార్జీలతోపాటు సదరు వాహనానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది సిస్టమ్ ద్వారా తనిఖీ చేసి జరిమానా విధిస్తున్నారు.
ప్రస్తుతం వాహనాల నెంబర్లు అన్నీ డిజిటల్ అయ్యాయి. మీ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు, ఇన్సూరెన్స్ వివరాలు, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ డిజిటల్ అయ్యాయి. ఈ క్రమంలోనే మీ వాహనానికి టోల్ గేట్ దగ్గర టోల్ ఛార్జీ వసూలు చేస్తుంది. ఇదే సమయంలో మీ వాహనం ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటే ఓకే.. లేదు అంటే వెంటనే 2 వేల రూపాయల ఫైన్ విధిస్తూ.. మీ మొబైల్ కు చలానా వస్తుంది. ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రంలో అమలవుతున్న ఈ విధానాన్ని.. దేశ వ్యాప్తంగా అమలు చేయటానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. అందుకు కారణం.. దేశంలోని పలు వాహనాలకు ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయకపోవటమే అంటున్నారు అధికారులు.
ఈ-డిటెక్షన్ సిస్టమ్
చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలను కట్టడి చేయాలనే ఉద్దేశ్యంతో ఒడిశా రాష్ట్ర రవాణా అథారిటీ ఈ చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 22 టోల్ గేట్లలో ఈ విధానం అమల్లోకి వచ్చింది.
ALSO READ | 5 నెలల్లో 70 లక్షల ఓట్లు పెరిగినయ్ : రాహుల్ గాంధీ
నివేదికల ప్రకారం, టోల్ గేట్లపై అమర్చిన ఈ-డిటెక్షన్ సిస్టమ్‌లు వెంటనే ప్రయాణిస్తున్న వాహనానికి చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ ఉందా లేదా అని తనిఖీ చేస్తాయి. వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉంటే ఒకే. లేదంటే మొదటిసారి రూ. 2వేలు జరిమానా విధిస్తారు. అదనంగా, మూడు నెలల వరకు జైలు శిక్ష కూడా అట. కొన్ని సందర్భాల్లో మూడు నెలల జైలు శిక్ష, జరిమానా రెండూ విధిస్తారట. అదే వాహనం ఇన్సూరెన్స్ లేకుండా రెండోసారి పట్టుబడితే రూ.4వేలు జరిమానా వసూలు చేస్తారు.
బీహార్‌లోనూ.. రూ.10వేలు జరిమానా
ఆటోమేటిక్ ఈ-డిటెక్షన్ సిస్టమ్ గురించి వినడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని నెలల క్రితం బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని 32 టోల్ గేట్లలో ఈ-డిటెక్షన్ సిస్టమ్ ప్రారంభించింది. పొల్యూషన్ సర్టిఫికెట్లు(PUC) లేని వాహనాలను గుర్తించేందుకు దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. పీయూసీ సర్టిఫికెట్ లేకుండా పట్టుబడిన వాహనాలకు తక్షణమే రూ.10వేల జరిమానా విధిస్తామని ప్రకటించారు.
టోల్ గేట్లపై అమర్చిన ఈ-డిటెక్షన్ సిస్టమ్‌లు వాహన డేటాను క్యాప్చర్ చేస్తాయి. దానిని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) వెహికల్ పోర్టల్‌తో క్రాస్-రిఫరెన్స్ చేస్తుంది. ఆపై వాహనం అనుకూలంగా ఉందో లేదో తనిఖీ చేస్తుంది. వ్యాలిడ్ పొల్యూషన్ సర్టిఫికెట్ లేనట్లయితే.. సదరు వాహన యజమానికి వెంటనే ఇ-చలాన్ పంపబడుతుంది.