పట్టభద్రులను పట్టించుకోని ప్రభుత్వం
మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే.. తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టుగా నిలిచిన నినాదమిది. ఆంధ్ర పాలకుల దోపిడీకి చరమగీతం పాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న నాడే మన బిడ్డలకు న్యాయం జరుగుతుందని యావత్ తెలంగాణ ప్రజానీకం నమ్మింది. అంతా ఒక కట్టుగా నిలబడి ఆత్మ బలిదానాలకు సైతం వెరవకుండా పోరాడారు. వందల మంది విద్యార్థులు, యువత ప్రాణ త్యాగాలతో సాకారమైన రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. సగటు తెలంగాణ పౌరుడు ఆశించిన ఏ ఒక్కటీ జరగలేదు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సమయంలో మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల కుప్పగా మారింది. నీళ్ల సంగతీ సరే సరి. మనకు కేటాయించిన వాటాలోనే మనం పూర్తిగా వాడుకోలేని స్థితిలో ఉన్నామన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. ఇక నియామకాల విషయానికి వస్తే అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ సమస్య తీరిపోతుందన్న ఆశలు కల్పించిన టీఆర్ఎస్ నేడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీల భర్తీనే పట్టించుకోవట్లేదు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై 2014లో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటకు ఆరేళ్లవుతున్నా ఇప్పటికీ దిక్కులేదు. అప్పటి వరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 8 వేల ఉద్యోగాలు 5 నెలల్లో భర్తీ చేస్తామని ఆనాడు ప్రకటించారు. జీవో నంబర్ 36, 610ల ద్వారా మన యువతకు రావాల్సిన 83 వేల ఉద్యోగాల్లో అక్రమంగా ఆంధ్రావాళ్లు కొనసాగుతున్నారని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. వాళ్లనీ ఆంధ్రాకు పంపి వారి స్థానంలో తెలంగాణ యువతకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. వాటిలో ఇప్పటి వరకు కొత్తగా ఏమాత్రం ఉద్యోగాలు కల్పించారో ప్రభుత్వ పెద్దలు చెప్పాలి.
పది శాతం ఉద్యోగాలైనా భర్తీ చేశారా?
విద్యార్థులు, యువత చేసిన ఉద్యమాలు, త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా టీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. కానీ స్వరాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమం కోసం, నిరుద్యోగ యువత ఉపాధి, ఉద్యోగ నియామకాల విషయంలో ప్రభుత్వం చేసిన మేలు నామమాత్రమేనని చెప్పక తప్పదు. రాష్ట్రంలో కొత్తగా భర్తీ చేసేందుకు అవకాశం ఉన్న ఖాళీల్లో 10 శాతం కూడా భర్తీ చేయలేదు. పాత పది జిల్లాలకు అదనంగా 23 జిల్లాలు, 26 డివిజన్లు, 125మండలాలు, 71 మున్సిపాలిటీలు, 4383 గ్రామపంచాయతీలు,7 పోలీస్ కమిషనరేట్లు, 24 సబ్ డివిజన్లు, 29 సర్కిళ్లు, 102 పోలీస్ స్టేషన్లు కొత్తగా ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పడిన అన్ని విభాగాల్లో కలిపి 23 జిల్లాలో జిల్లాకు ఒక 5000 ఉద్యోగాలు కొత్తగా అవసరమైనా లక్షా 15 వేల కొత్త ఉద్యోగులు భర్తీ చేయాల్సి ఉంటుంది. అలాగే 2014 నుంచి ఇప్పటి వరకు ఏడాదికి 8 వేల మంది ఉద్యోగ విరమణ చేసినా సుమారు 50 వేల ఖాళీలు ఏర్పడతాయి. ఇవి మొత్తం కలిపితే సుమారు ఈ ఆరేళ్లలో సుమారు మూడు లక్షల మందికి పైగా నిరుద్యోగ యువతకు జాబ్స్ వచ్చి ఉండాలి. కానీ అందులో 30,723 పోస్టులు ఈ ఆరేళ్లలో భర్తీ చేసినట్టు TSPSC చైర్మన్ కొద్ది రోజుల క్రితం చెప్పారు.
ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా బలిదానాలు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1400 మంది యువత ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన తోటి నిరుద్యోగులకైనా ఉద్యోగాలు వస్తాయని, మన బిడ్డలు బాగుపడుతారని కాంక్షించి మంటల్లో ఆహుతయ్యారు. వాళ్ల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం కల సాకారమైంది. కానీ ఇప్పటికీ ఆత్మ బలిదానాలు మాత్రం ఆగడం లేదు. మొన్న మిర్యాలగూడకు చెందిన సంపత్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రావడం లేదంటూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు, నిర్మల్ కు చెందిన ఓయూ పాత విద్యార్థి లక్ష్మణ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. OU జాగ్రఫీ స్కాలర్ డాక్టర్ నర్సయ్య యూనివర్సిటీలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఓయూ ఇంగ్లీష్ స్కాలర్ డాక్టర్ రవీందర్ నాయక్, స్టాటిస్టిక్స్ స్కాలర్ ఇలా PHD పూర్తి చేసిన యువత కూడా ఆత్మహత్య చేసుకున్నారు. యువతకు కనీస ఉద్యోగ భరోసా ఇవ్వలేని ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రంలో ఏం మేలు చేసిందో చెప్పాలని విద్యార్థిలోకం ప్రశ్నిస్తోంది.
టీఆర్ఎస్ నేతలు బాగుపడ్డరు
ఆరేళ్లుగా యువతను, నిరుద్యోగులను పట్టించుకోని ప్రభుత్వం మళ్లీ పట్టభద్రుల ఎన్నికలకు సిద్ధపడుతోంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డికి పట్టభద్రులు పట్టం కట్టి శాసన మండలిలో కూర్చోబెడితే ఏనాడూ విద్యార్థులు, యువత గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆయన సొంతానికి ప్రైవేటు యూనివర్సిటీ మాత్రం సాధించుకున్నారు. అటు మంత్రి మల్లారెడ్డి ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నారు. కానీ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడిపిన ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రభుత్వ వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసే ఆలోచనే చేయలేదు.
ఉద్యోగాలకూ 6 నెలల్లో భర్తీ నిబంధన ఉండాలి
ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే, ఎంపీ స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లోగా ఆ ఖాళీ భర్తీ చేయాలనే నిబంధన ఉంది. అదే ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ పొందితే లేదా చనిపోతే ఆరు నెలల లోగా ఆ ఖాళీని భర్తీ చేయాలనే నిబంధన ఎందుకు ఉండకూడదు? రాజకీయ నాయకులకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయం ఎంతవరకు సమంజసం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా క్యాలెండర్ ఎందుకు తీసుకు రావడం లేదు సమాధానం చెప్పాలి. ఒకటి రెండు సార్లు పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లు మినహా రాష్ట్రంలో మిగతా ఉద్యోగాల భర్తీని పెద్దగా పట్టించుకోకుండా ప్రభుత్వం నడుస్తున్న ధోరణి సరికాదు. ఏ ప్రభుత్వమైతే ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోందో అక్కడ పోలీసు వ్యవస్థను బలోపేతం చేసుకుంటుందని ఓ తత్వవేత్త అన్నాడు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది కూడా పోలీసు ఉద్యోగాలే తప్ప మరేమీ కనిపించడం లేదు. కేసీఆర్ మాటలు నమ్మి 2012లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో కావలసినన్ని నోటిఫికేషన్లు వచ్చినా స్వరాష్ట్రంలోనే ఉద్యోగాలు పొందుతామన్న నినాదాలతో గ్రూప్–-2 పరీక్ష హాల్లోనే వేల మంది తెలంగాణ యువత ప్రశ్న పత్రాలు చింపి బయటకొచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తమను పట్టించుకునే నాథుడు ఉండడని ఊహించలేదు.
గుణపాఠం తప్పదు
ఉద్యోగ నియామక ప్రకటన లేక వయసు మీద పడుతుంటే ఏం చేయాలో అర్థం కాక పెద్ద పెద్ద చదువులు చదువుకున్న యువత నిరుద్యోగంలో మగ్గిపోవడానికి ఈ ప్రభుత్వ పెద్దలే కారణమని గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో మానవ వనరులు నిరాశ నిస్పృహల్లో నెట్టేయొద్దన్న ఆలోచన ఇప్పటికైనా చేస్తే మంచిది. పట్టభద్రులను, నిరుద్యోగ యువతను మోసం చేసిన అధికార పార్టీ ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడగాలనుకుంటోంది. రాష్ట్రంలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత గుణపాఠం చెబుతుందని గుర్తుంచుకోవాలి.
ఉద్యోగాలు లేవు.. భృతీ లేదు..
మన ప్రభుత్వం వస్తే కాంట్రాక్టు వ్యవస్తే ఉండదని ప్రగల్భాలు చెప్పారు. కానీ అసలు కొత్తగా సర్కారీ కొలువు అన్న మాటే లేకుండా చేశారు. మేం పని చేసి జీతం తీసుకుంటామని యువత మొత్తుకుంటుంటే.. నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటనలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో చెప్పే పరిస్థితిలోనైనా ప్రభుత్వం ఉందా? అని యువత ప్రశ్నిస్తోంది. ఉద్యమంలో కదంతొక్కుతూనే కష్టపడి డిగ్రీలు, పీజీలు చదివినా ఉద్యోగాలు లేక యువత పడిగాపులు కాస్తూ ఆత్మత్యాగాలకు సిద్ధపడుతుంటే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చే ఆలోచన చేయడం లేదు. పైగా ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచుతామని ప్రతిపాదించడం యువతను మరింత కుంగదీయడం కాదా? ఉద్యోగులు కోరుకుంటున్న PRC, పింఛన్ లాంటివి పట్టించుకోకుండా పదవీ విరమణ వయసు పెంచడం ఎందుకని ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు.
– సిద్ధగౌని సుదర్శన్, రీసెర్చ్ స్కాలర్, (ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నేత), 9701703684
For More News..