ప్రగతి భవన్‌లో భోజనం పెట్టించి హామీ ఇచ్చిన కేసీఆర్
200 మందికి పైగా సస్పెన్షన్, డిపో స్పేర్
వీరికి డ్యూటీలిస్తలేరు.. జీతాలిస్తలేరు
హైదరాబాద్, వెలుగు: ‘ఆర్టీసీ ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ఢోకా లేదు. డ్రైవర్లు, కండక్టర్ల సస్పెన్షన్ ఉండదు. వారం రోజుల్లో గైడ్‌లైన్స్ తయారు చేయండి’ ఇవీ ఆర్టీసీ సమ్మె తర్వాత ప్రగతి భవన్‌లో జరిగిన మీటింగ్‌లో సీఎం కేసీఆర్ కామెంట్స్. కానీ ఇప్పటికీ ఆర్టీసీలో జాబ్ సెక్యూరిటీ లేకుండా పోయింది. సమ్మె తర్వాత అనేక మందిని సస్పెండ్ చేశారు. మరికొందరిని డిపో స్పేర్‌లో పెట్టారు. వీరందరినీ తిరిగి డ్యూటీలోకి తీసుకోవడంలేదు. జీతాలు కూడా ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
9 నెలలైనా పత్తా లేని గైడ్ లైన్స్…
గత ఏడాది ఆర్టీసీలో సమస్యల పరిష్కారం కోసం 55 రోజులపాటు ఉధృతంగా సమ్మె జరిగింది. దిగొచ్చిన ప్రభుత్వం పలు సమస్యల పరిష్కారానికి ఓకే చెప్పింది. సమ్మె విరమించిన కార్మికులతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ రోజంతా మీటింగ్ ఏర్పాటు చేశారు. పలు హామీలు ఇచ్చారు. ఇందులో కార్మికులకు ఉద్యోగ భద్రత హామీ కూడా ఇచ్చారు. చిన్నచిన్న తప్పులకు ఉద్యోగాలు తీసేయడం ఉండదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి వెంటనే గైడ్‌లైన్స్ రూపొందించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను కూడా ఆదేశించారు. అధికారులు గైడ్‌లైన్స్ రూపొందించారు. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కూడా పలు దఫాలుగా సమావేశమయ్యారు. పలు మార్పులు చేయాలని సూచించారు. కానీ ఆ తర్వాత అది పత్తా లేకుండా పోయింది.
చిన్నచిన్న తప్పులకే సస్పెన్షన్..
జాబ్ సెక్యూరిటీ అమల్లోకి రాకపోవడంతో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. చిన్నచిన్న తప్పులకే సస్పెండ్ చేస్తున్నారు. డిపో స్పేర్‌లో పెడుతున్నారు. ఇలా 200 మంది వరకు సస్పెండ్ అయినట్లు తెలిసింది. మరో వంద మంది వరకు సమ్మె కంటే ముందే సస్పెండ్ అయ్యారు. వీరిలో ఎవరికీ లిఫ్ట్ ఇవ్వడం లేదు. సాధారణంగా సస్పెండ్ అయిన మూడు లేదా నాలుగు నెలల్లో ఎంక్వైరీ పూర్తి చేసి మళ్లీ డ్యూటీలోకి తీసుకుంటారు. పనిష్ మెంట్ కింద కొందర్ని ట్రాన్స్ ఫర్ చేస్తారు. కానీ ఏడాది అవుతున్నా.. ఇప్పటికీ ఎలాంటి చర్య తీసుకోలేదు. డిపో స్పేర్ పెట్టిన వాళ్లకు కూడా డ్యూటీ ఇస్తలేరు. జీతం కూడా చెల్లిస్తలేరు. అధికారులు మాత్రం జాబ్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్ వస్తేనే లిఫ్ట్ ఇస్తామని చెబుతున్నారు.
For More News..