నాలుగేండ్లుగా ముందుకు కదలని పనులు
అనువైన స్థలం చూపించడంలో రాష్ట్ర సర్కారు విఫలం
వంద పడకల దవాఖాన ఏర్పాటులో తీవ్ర జాప్యం
రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం వంద పడకల ఈఎస్‌ఐ హాస్పిటల్ మంజూరు చేసింది. కానీ రాష్ట్ర సర్కారు నిర్మాణానికి అనువైన స్థలం చూపించకపోవడంతో నేటికీ పనులు మొదలు కాలేదు. ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే 4 లక్షల మంది కార్మికులు, వారి కుటుంబసభ్యులు ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్లే బాధ తప్పుతుంది. సర్కారు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే స్థలం చూపించడం పెద్ద సమస్య కాదని స్థానికులు పేర్కొంటున్నారు. రాష్ట్ర సర్కారు వెంటనే స్థలం చూపించాలని కోరుతున్నారు.
గోదావరిఖని, వెలుగు: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్‌ఎఫ్‌సీఎల్, కేశోరామ్ సిమెంట్ కంపెనీతో పాటు హమాలీలు, హోటళ్లలో పనిచేసే కార్మికులు, ఇతర రంగాల్లో నెలకు రూ.21 వేల లోపు వేతనం పొందే అసంఘటిత కార్మికులు లక్షల్లో ఉన్నారు. ఈఎస్‌ఐ కార్పొరేషన్ పరిధిలో రామగుండంతో పాటు కాగజ్‌నగర్, మంచిర్యాల, బసంత్ నగర్ ప్రాంతాల్లో డిస్పెన్సరీలు పని చేస్తున్నాయి. ఇందులో రామగుండం డిస్పెన్సరీకి ఎక్కువ సంఖ్యలో కార్మికులు, వారి కుటుంబసభ్యులు వచ్చి వైద్యసేవలు పొందుతుంటారు. దీంతో రామగుండంలో వంద పడకల ఈఎస్‌ఐ హాస్పిటల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నాలుగేండ్ల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామగుండంలో ఈఎస్‌ఐ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే కాగజ్‌నగర్, మంచిర్యాల, రామగుండం, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి ప్రాంతాలకు చెందిన సుమారు నాలుగు లక్షల మంది కార్మికులు, వారి కుటుంబసభ్యులు హైదరాబాద్ నాచారం, సనత్‌నగర్ ప్రాంతాల్లోని ఈఎస్‌ఐ పెద్ద హాస్పిటళ్లకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే ట్రీట్మెంట్ పొందే అవకాశం ఏర్పడుతుంది.
స్థల పరిశీలన.. తిరస్కరణ
రామగుండం కార్పొరేషన్ పరిధి 20వ డివిజన్ పాత చెత్త డంపింగ్ యార్డులోని ఐదెకరాల స్థలాన్ని ఈఎస్‌ఐ కార్పొరేషన్ ఆఫీస్ వర్గాలు జులై 5న స్థానిక రెవెన్యూ ఆఫీసర్లతో కలిసి పరిశీలించారు. అయితే ఈ స్థలానికి వెళ్లడానికి రోడ్డు కనెక్టివిటీ లేదని, పక్కనే సమాధులున్నాయని, బస్టాండ్‌కు, రైల్వే స్టేషన్‌కు దూరంగా ఉందని, అసలు ఈ స్థలం హాస్పిటల్‌కు అనుగుణంగా లేదని తిరస్కరించారు. దీంతో హాస్పిటల్ నిర్మాణానికి అనువైన మరో స్థలం చూపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మళ్లీ సీఎం కేసీఆర్‌కు లెటర్ రాశారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. హాస్పిటల్ నిర్మాణానికి అనువైన ఐదు ఎకరాల స్థలం ప్రభుత్వ ఆధీనంలో లేకపోతే.. సింగరేణి, ఎన్టీపీసీకి చెందిన స్థలాన్నైనా పరిశీలించే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు కొరవడ్డాయి. గతంలో గోదావరిఖనిలో మూసివేసిన సింగరేణి పవర్‌హౌస్‌ను మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం పరిశీలించారు. అయితే మెడికల్ కాలేజీని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ స్థలంలో నిర్మిస్తున్న నేపథ్యంలో పవర్‌హౌస్‌లో అందుబాటులో ఉన్న సుమారు 15 ఎకరాల స్థలంలో ఈఎస్‌ఐ హాస్పిటల్‌ను నిర్మించొచ్చు. రామగుండంలో పాత ఈఎస్‌ఐ హాస్పిటల్ వద్ద మూడెకరాల స్థలం, గౌతమీనగర్‌లో మరో స్థలం అందుబాటులో ఉందని సర్వే డిపార్ట్‌మెంట్ జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఈఎస్‌ఐ హాస్పిటల్ నిర్మాణం జరిగితే కేంద్రానికే పేరు వస్తుందని, తమకేం లాభం ఉంటుందనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్ నిర్మాణానికి అనువైన స్థలం చూపించడానికి జాప్యం చేస్తోందనే ప్రచారం ఇక్కడి కార్మిక వర్గాల్లో జరుగుతోంది.