గాంధీ మెడికల్​ కాలేజీలో లిఫ్టులు లేక అష్టకష్టాలు.. నాలుగు ఫ్లోర్లు ఎక్కి, దిగలేక నరకయాతన

గాంధీ మెడికల్​ కాలేజీలో లిఫ్టులు లేక అష్టకష్టాలు.. నాలుగు ఫ్లోర్లు ఎక్కి, దిగలేక నరకయాతన

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ మెడికల్‌‌ కాలేజీలో కొన్ని నెలలుగా లిఫ్టులు లేక స్టూడెంట్లు,  ప్రొఫెసర్లు, సీనియర్ ​డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్​లో ఎలక్ట్రానిక్ లైబ్రరీ, మైక్రో బయాలజీ, ఫిజియోలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ మెడిసిన్​తో పాటు పదుల సంఖ్యలో వైద్య విభాగాలు కొనసాగుతున్నాయి. 1,250 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్లు, 450కి పైగా ప్రొఫెసర్లు, ట్యూటర్లు, జూనియర్‌‌ డాక్టర్లు, హౌస్‌‌ సర్జన్లు, మరో 250 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 20 శాతం మంది సీనియర్‌‌ డాక్టర్లు 60 ఏండ్లు దాటినోళ్లు ఉన్నారు. వీరంతా రోజూ నాలుగు ఫ్లోర్లు ఎక్కి, దిగలేక ఇబ్బంది పడుతున్నారు. 

ఆరు నెలల కింద కరాబ్..

గతంలో రెండు లిఫ్టులు ఉండేవి. ఆరు నెలల కింద అవి పూర్తిగా పాడవడంతో మరో రెండు లిఫ్టులు కలిపి మొత్తం నాలుగు కొత్త లిఫ్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీజీ ఎంఎస్​ఐడీసీ అధికారులు పలుమార్లు టెండర్లు పిలవగా, కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి ఈ ఏడాది జనవరిలో రూ.1.62 కోట్లకు ఓ కాంట్రాక్టర్​కు పని అప్పగించారు.  కానీ మూడు నెలలుగా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. 

కనీసం ఒక్క లిఫ్టును కూడా అందుబాటులోకి తీసుకురాలేదు. మెట్లు ఎక్కలేని కొంత మంది గ్రౌండ్‌‌ ఫ్లోర్‌‌లోనే తమ పనులు నిర్వహిస్తున్నారని, మెట్లు ఎక్కే సమయంలో ఆయాసానికి గురై, అస్వస్థతతో  ఆస్పత్రి పాలవుతున్నారని ఓ సీనియర్‌‌ డాక్టర్​ వాపోయారు. సంబంధిత అధికారులను వివరణ కోరగా పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలిపారు.