ఆదిలాబాద్ లో రూ.1200 కోట్ల వ్యాపారానికి బ్రేక్
డీటీసీపీ రూల్స్‌కు లోబడి లేని భూముల్లో నిలిచిన రిజిస్ట్రేషన్లు
అసైన్డ్ భూములకు గతంలో ఎన్ వోసీలు
అనుమతుల్లే కున్నా అవే భూముల్లో యథేచ్ఛగా వెంచర్లు
రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ తాజా ఆదేశాలతో అయోమయంలో రియల్టర్లు, లీడర్లు
ఆదిలాబాద్, వెలుగు: ఒకే ఒక్క ఆదేశంతో ఆదిలాబాద్ లో అతిపెద్ద భూదందాకు బ్రేక్ పడింది. డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) రూల్సుకు లోబడి లేని భూముల రిజిస్ట్రేషన్లు నిలిపి వేయాలంటూ రాష్ట్ర రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. ఈ ఆర్డర్స్‌తో ఆదిలాబాద్ సమీపంలో సుమారు రూ. 1200 కోట్ల విలువ జేసే 400 ఎకరాలకుపైగా భూముల్లో వేసిన వెంచర్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఫలితంగా అసైన్డ్ భూములతో అక్రమ భూ వ్యాపారం చేస్తున్న రియల్టర్లు, వాళ్ల వెనుక ఉన్న లీడర్లలో, ఇప్పటికే ప్లాట్ లు కొన్నవారిలో ఆందోళన మొదలైంది.
నిలిచిన రిజిస్ట్రేషన్లు
హైవేను ఆనుకుని ఉన్న ఈ భూముల విలువ ఎకరానికి రూ.6 కోట్ల దాకా ఉంది. రోడ్డుకు కాస్త దూరంగా ఉన్న భూములైతే ఎకరానికి రూ.కోటి వరకు పలుకుతున్నాయి. సరాసరి రూ.3 కోట్లు అనుకున్నా మొత్తం భూముల విలువ రూ.1200 కోట్లకుపైగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రైమ్ లొకేషన్ కావడంతో కొంత కాలంగా క్రయ, విక్రయాలు జోరుగా సాగుతూ వచ్చాయి. తాజాగా డీటీసీసీ అనుమతుల్లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయరాదని ఉత్తర్వులు రావడంతో ఈ ప్లాట్ల సేల్, రీసేల్ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఈ భూముల్లో ఇండ్లు కూడా నిర్మించకపోవడంతో రెగ్యులరైజ్ చేసుకునే ఆప్షన్ కూడా లేకుండా పోయింది. దీంతో ఇక్కడ ప్లాట్ లు కొన్న వందలాది మందిలో ఆందోళన నెలకొంది. మరోవైపు ఈ భూముల్లో వందల కోట్ల దందా సాగిస్తున్న రియల్టర్లు, వారి వెనుక ఉన్న లీడర్లకు రెండు రోజులుగా కంటి మీద కునుకు కరువైంది.
అడ్డదారిలో ఎన్ వోసీలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఫోర్ లేన్స్ హైవేకు ఆనుకుని ఉన్న 400 ఎకరాల కండి షనల్అసైన్డ్ భూముల్లో లబ్ధిదారులు జీవనోపాధి కోసం వ్యవసాయం చేసుకోవచ్చు తప్ప అమ్మడం, కొనడం నేరం. కానీ రియల్టర్ లు, వాళ్ల వెనుకున్న లీడర్లు ఆఫీసర్లను మచ్చిక చేసుకొని కథ నడిపించారు. ప్రధానంగా181 సర్వే నంబర్ తో పాటు 56, 131/13, 83, 73/9, 169/ 3, 75/ఎ, తదితర సర్వే నెంబర్లలోని దాదాపు 400 ఎకరాలకుపైగా అసైన్డ్ భూములకు ఎన్వోసీలు తెచ్చుకున్నారు. వీటిని చూపి, అన్ని భూముల్లోనూ వెంచర్లు స్టార్ట్ చేసి ప్లాట్ లు గా మార్చి క్రయ విక్రయాలు జరుపుతున్నారు.1958 కంటే ముందు అసైన్డ్ అయిన భూములకు మాత్రమే క్రయ విక్రయాలకు చాన్స్ ఉంటుంది. ఇవి ఆ తర్వాత అసైన్డ్ అయిన భూములు కావడంతో ఎన్వోసీలు జారీ చేయడం చట్టవిరుద్ధం. అందుకే వీటిలో ఏ వెంచర్ కూ డీటీసీపీ అనుమతుల్లేవు.
తాజా రూల్సు పాటిస్తాం
జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ నుంచి వచ్చిన తాజా రూల్సు పాలో అవుతాం. అనుమతుల్లేని భూములకు రిజిస్ట్రేషన్లు చేయం. ఈ కోవకు చెందిన సర్వే నంబర్ల వివరాలను ఆఫీస్ లో డిస్ ప్లే చేయిస్తాం.-రవీందర్, రిజిస్ట్రార్, ఆదిలాబాద్.