2 వేల నోటు.. ఉపసంహరణతో నష్టమేమీ లేదు

ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ చాలా తొందరపాటుతో ముందు జాగ్రత్త చర్యలేమీ లేకుండా, ఒక వ్యూహం లేకుండా 2016లో అర్ధాంతరంగా మోడీ ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసింది. ఉన్నట్టుండి ఒకరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ 500, 1000 నోట్లను రద్దు చేశాం, ఇవి ఇక చిత్తు కాగితాలతో సమానం అంటూ లైవ్‌‌‌‌లో ప్రకటించారు. ఆయన అలా ప్రకటించగానే  నేను15 నిమిషాల తర్వాత ఆయనను సమర్థిస్తూ ట్వీట్‌‌‌‌ చేశా. అది సదుద్దేశంతో చేశారనుకున్నా. ఇప్పటికీ ఆయన ఉద్దేశాన్ని శంకించడం లేదు. కానీ ఆయన చేసిన తీరు అట్లా ఉంటుందని ఊహించలేకపోయా. అప్పటి వరకు చెలామణిలో ఉన్న నోట్లను ఇక మీదట చెల్లవు అని ఆ ప్రభుత్వం చెప్పినప్పుడు వాటిని తీసుకొని వంద రూపాయల నోట్లను ఇవ్వొచ్చు. జేబులో డబ్బుకి విలువ లేకపోతే హామీకి విలువెక్కడ ఉంటుంది? కాబట్టి ఒక కరెన్సీని రద్దు చేస్తే కొత్త కరెన్సీ ముద్రించడమో లేదా ప్రత్యామ్నాయం చూపడమో జరగాలి. కానీ పెద్ద నోట్ల రద్దు అప్పుడు అలా జరగలేదు. నేను ఊహించను కూడా ఊహించలేదు. ప్రభుత్వం కొత్త నోట్లు ముద్రించకుండా పాత నోట్లు చెల్లవంటూ చెలామణిలో ఉన్న 85 శాతం కరెన్సీని ఒక్కసారిగా చెల్లదని చెప్పేసింది. దాంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఫలితాన్ని ఇవ్వలేకపోయింది

కచ్చితంగా నల్లడబ్బును అదుపు చేయాలి. అదుపు చేయడానికి ఒక వ్యూహం ఉంటుందని నేను ఆశపడ్డా. దాన్ని సరిగా అమలు చేసి ఉంటే సమాజానికి అదొక మంచి సంకేతం. ముందుగా క్యాష్‌‌‌‌ ప్రింట్‌‌‌‌ చేసుకొని ఉంటారు, ఆ తర్వాత ఒక వ్యూహం ప్రకారం రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌, లంచాలు, రాజకీయంలో ఉన్న నల్లడబ్బును బయకు తీస్తారనుకున్నం. దీనిపై ఒక్క చర్య కూడా తీసుకోలేదు. లంచాల విషయంలో ఓ చిన్న చర్య మాత్రమే తీసుకున్నారు. ఓ క్రమబద్ధంగా దేశవ్యాప్తంగా పనైతే జరగలేదు. అందుకే  నోట్ల రద్దు ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అయినా ఈ దేశ ప్రజలు ప్రభుత్వాన్ని క్షమించారు. ఎందుకంటే భారతీయులకు ఉండే ఉదార స్వభావమే దానికి కారణం. మంచి సంకల్పంతో చేశారనుకొని క్షమించేశారు. ఇలాంటి చర్య ప్రపంచంలో మరే దేశంలోనూ సాధ్యం కాలేదు. నాతో చాలామంది అంటారు ప్రజలను మీరు ఎలా నమ్ముతారని? ప్రజలకు ఎలాంటి ఆలోచనా ఉండదు. కానీ నా దృష్టిలో మన దేశ ప్రజలు చాలా ఉదార స్వభావులు. పాలకులు మంచి ఉద్దేశంతో ఏదైనా పని చేస్తే అందులో నష్టం వచ్చినా క్షమించే గుణం ఉన్నవాళ్లు. దేశానికి మేలు జరుగుతుందనుకుంటే ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. దానికి వేరే ఉదాహరణ అక్కర్లేదు. నోట్ల రద్దు జరిగినప్పుడు వారు ఓపిక పట్టిన తీరే దానికి ఎగ్జాంపుల్‌‌‌‌. ‘దేశ ప్రజల వల్లే దేశం బాగుపడటం లేదు, దేశ ప్రజల అవినీతి వల్లే దేశం అధ్వానంగా ఉంది, రాజకీయం దారుణంగా ఉంది’ అని ఎవరైనా అంటే అంతకన్నా చెత్త మాట మరొకటి లేదు. జనం మంచి చేయడాన్ని కోరుకుంటున్నారు. మీరు మంచి చేయడానికి సిద్ధపడితే మద్దతు ఇస్తారు. నష్టాన్ని, కష్టాన్నీ భరించేందుకు సిద్ధపడుతున్నారు. 

నల్లడబ్బును అరికట్టాలి..

 మౌలిక విషయమేమిటంటే ఆనాడు ఎక్కడ వైఫల్యం చెందామో అక్కడ వైఫల్యం చెందకుండా, ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను సరైన గాడిలో పెట్టాలంటే నిజంగా ఏం చేయాలి? అవినీతిని అంతం చేయడం కోసం, రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌లో జరిగే అన్యాయాలు ఎదుర్కోవాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. సరైన టైంకి పన్నులు చెల్లించేవారు, అక్రమ సంపాదన లేనివారు చిన్న ఆస్తి కొనాలంటే క్యాష్‌‌‌‌ లేకుండా మార్కెట్లో నిలబడటం అసాధ్యం. వాళ్లేం పాపం చేయలేదు, ఈ దేశ ప్రజలేమీ అవినీతిపరులు కారు.  ఆస్తులు కొన్నప్పుడు స్టాంప్‌‌‌‌ డ్యూటీ ఎక్కువగా ఉంటోంది, అమ్మినప్పుడు కమర్షియల్‌‌‌‌ ట్యాక్సులు ఎక్కువ కట్టాల్సి వస్తోంది. అందుకే ఈ పేద దేశంలో ఒక సగటు మానవుడు జీవితంలో ఒక్కసారి కొనుగోలు చేసే ఆస్తి కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలంటే బాధ కలుగుతుంది. ఆ పన్నులను మార్చి, వాటిని తగ్గించి, మార్కెట్‌‌‌‌ విలువ నిజంగా ఎంతుందో దానికి సుమారుగా అటు ఇటుగా 80 శాతం పెట్టి నిజమైన బిల్లులు చూపెడితే మనకి అదనంగా పన్నులు పడవు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గదు, మనకు క్యాష్ అవసరం కూడా ఉండదు. ఇది ప్రభుత్వానికి, ప్రజలకు లాభమే. అక్రమంగా సంపాదించే వాళ్లకే నష్టం. వాళ్లని రక్షించడం కోసమే వీటిని సంస్కరించడం లేదు. రియలెస్టేట్​లో నల్లడబ్బు పోవడం ప్రభుత్వాలకు ఇష్టం లేదు. ఎందుకంటే రాజకీయమంతా నల్లడబ్బుతోనే బతుకుతోంది కదా? మొన్న కర్నాటక ఎన్నికల్లో సుమారు 6 వేల కోట్లు ఖర్చయి ఉంటాయి. ఈ ఏడాది తెలంగాణలో ఎలక్షన్స్‌‌‌‌ రాబోతున్నాయి. ఏడెనిమిది వేల కోట్లు ఖర్చు కావొచ్చు. అలాగే ఆంధ్రా, తమిళనాడులో కూడా ఇదే అంచనా. ఇదంతా అక్రమ ఖర్చని మనందరికీ తెలుసు. ఎన్నికల క్యాంపెయిన్‌‌‌‌లో  కోట్ల డబ్బు పట్టుబడుతున్నది. అయినా ఎలక్షన్స్‌‌‌‌ ఆగవు, ప్రజలకు మనీ పంపకాలు ఆగవు. పట్టుబడ్డ డబ్బంతా ఎక్కడికి పోతుందో ఎవరికైనా తెలుసా? ఎవరైనా ఆలోచిస్తారా? అందుకే అన్ని పార్టీల నాయకులు కలిసి ఆలోచించాలి ఓట్లకు నోట్లు పంచడమేమిటని.

పెద్దనోట్ల రద్దుతో ఇబ్బందులు పడిన మాట వాస్తవం

ఇండియాలో ఇప్పటికీ 5‌‌‌‌‌‌‌‌0 నుంచి 60 శాతం మంది క్యాష్‌‌‌‌ను పే చేయడంపైనే ఆధారపడి ఉన్నారు. యూపీఐలో, బ్యాంక్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌లో మార్పు వచ్చాక ఇప్పుడు అది కొంచెం తగ్గింది. కానీ నోట్ల రద్దు సమయానికి చాలామందికి నగదు లావాదేవీలే ఆధారం. నూటికి 60 శాతం మంది అవసరాలు తీరాలు నగదు ద్వారానే తీరేవి. ఎప్పుడైతే అనాలోచితంగా, ముందు జాగ్రత్తలు తీసుకోకుండా నోట్ల రద్దు చేశారో.. వారికి అర్జెంట్‌‌‌‌గా నోట్లు ముద్రించాలని ఆలస్యంగా జ్ఞానోదయం అయింది. అర్జంట్‌‌‌‌గా ఆ పని జరగాలంటే ఎలా సాధ్యం? ఎందుకంటే 5 వందల నోట్లు 4 కాగితాలు ముద్రిస్తే 2 వేలు అవుతుంది లేదా వంద నోట్లు 20 ముద్రిస్తే 2 వేలు అవుతుంది. ముద్రించడానికి టైమ్ ఒకటే పడుతుంది కాబట్టి వేగంగా ముద్రించాలనే ఉద్దేశంతోనే 2 వేల నోటు బయటకొచ్చింది. త్వరత్వరగా ముద్రించేసి లక్షల కోట్లు మార్కెట్లో ప్రవేశపెట్టాలన్న ఉద్దేశం, ప్రజలకు ఇబ్బంది లేని వాతావరణం కల్పించడం కోసం 2 వేల నోట్ల ముద్రణ జరిగింది. అంటే చేసిన పొరపాటును సరిదిద్దుకునే క్రమంలో అవసరం కంటే ఎక్కువ నోట్ల ముద్రణ జరిగిందన్నమాట. రెండో పొరపాటు ఏమిటంటే నోట్ల రద్దుతో లక్షలమంది ఉపాధి కోల్పోయారు. నిజాయతీగా సంపాదించి ఇంట్లో దాచుకున్న వారి డబ్బు కూడా చెల్లదనేసరికి చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఎంతోమంది మండుటెండల్లో ఏటీఎంల దగ్గర క్యూలో ఇబ్బంది పడ్డారు. క్యూలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు  కూడా  ఉన్నాయి. 

కావాల్సినంత టైమ్​ఉంది

ఆపద్ధర్మంగా, అర్జెంట్‌‌‌‌గా పెద్ద ఎత్తున  2 వేల నోట్లు ప్రింట్ చేశారో కాలక్రమేణా దాని అవసరం లేదని, మనం ఏ లక్ష్యంతో పెట్టామో దానికి వ్యతిరేకంగా జరుగుతోంది కాబట్టి, దాన్ని గుర్తించి కొత్త నోట్లు ప్రింట్‌‌‌‌ చేయడం ఆపేశామని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ ప్రకటించింది. నా దగ్గర ఉన్న సమాచారం కూడా ఇదే. మూడు లక్షల అరవై వేల కోట్ల 2 వేల నోట్లు ఉన్నాయని ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ చెబుతోంది. సామాన్యుల వద్ద ఆ నోట్లు ఎక్కువగా ఉండే అవకాశం లేదు. అలాగే చట్టబద్ధంగా దాచుకున్న వాళ్లు వాటిని సులభంగా మార్చుకోగలరు. అకౌంట్‌‌‌‌లో లేకుండా దాచుకుంటే మాత్రం ఇతరుల ద్వారా మార్చుకుంటారు. కిందటిసారి ఇలాగే జరిగింది. ఈసారి ఎలాగూ సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ వరకు టైం ఉంది కాబట్టి అదీ అలాగే మారి బ్యాంకుల్లో చేరుతుంది. బ్యాంకులో కట్టాలంటే ఐడీలు కూడా అవసరం లేదని తెలిపారు. వారి ఉద్దేశం ఏమిటంటే అవి చలామణిలో లేకుండా చేయాలి. ఈసారి ఆర్భాటాలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా ఎక్కువ టైం ఇచ్చారు. మంచో చెడో కాస్త నింపాదిగా చేస్తున్నారు. ఇప్పటి ప్రజల దగ్గర కూడా పెద్ద నోట్లు ఉండటం లేదు కాబట్టి ఇది పెద్ద కష్టమైన  విషయమేమీ కాదు. 

- జయప్రకాశ్ నారాయణ, లోక్‌‌‌‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు