
న్యూఢిల్లీ: ‘‘మీ మెడలో మంగళసూత్రం లేదు, నుదుటిపై బొట్టు కూడా లేదు. అటువంటపుడు మీ భర్తకు మీపై ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది?” అని ఓ వివాహితను పుణె జిల్లాలోని సెషన్స్ జడ్జి ప్రశ్నించారు. కుటుంబ కలహాల కారణంగా ఆ జంట విడిగా ఉంటున్నది. అంతకుముందు భర్తపై గృహహింస కేసు నమోదైంది. ఈ కేసులో భార్యాభర్తలు పుణె డిస్ట్రిక్ట్ కోర్టుకు హాజరయ్యారు. కేసులో జడ్జి మధ్యవర్తిత్వం వహించారు. కేసును సామరస్యంగా పరిష్కరించుకోవాలని జంటకు సూచించారు.
ఈ క్రమంలో జడ్జి పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ మెడలో మంగళసూత్రం లేదు, నుదుటిపై బొట్టు కూడా లేదు. మీరు ఒక వివాహితగా ప్రవర్తించుకుంటే, మీపై మీ భర్తకు ఆసక్తి ఎలా కలుగుతుంది? అలాగే, ఒక మహిళ బాగా సంపాదిస్తే, తన కన్నా ఎక్కువగా సంపాదించే మగాడిని ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తన కన్నా తక్కువ సంపాదించే మగాడితో బతకాలని అస్సలు కోరుకోదు.
మగాడి విషయంలో అలా ఉండదు. బాగా సంపాదించే మగాడు పెళ్లి చేసుకోవాలనుకుంటే, అతను తన ఇంట్లో పనిచేసే పనిమనిషిని కూడా పెళ్లి చేసుకోవచ్చు. చూడండి పురుషులు ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు. మీరు (మహిళలను ఉద్దేశించి) కొంత ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. మొండిగా, కఠినంగా ఉండవద్దు” అని జడ్జి ఆ క్లైంటుకు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వీడియోను ఆ క్లైంట్ లాయర్ అంకుర్ జహగిర్దార్ లింక్డ్ ఇన్ లో పోస్టు చేశారు. జడ్జి వ్యాఖ్యలపై జహిగిర్దార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్జి అనాలోచితంగా మాట్లాడారని పేర్కొన్నారు.