పెద్దషాపుల దగ్గర రోడ్డు విస్తరణకు నో మార్కింగ్

ఆసిఫాబాద్, వెలుగు :   ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రంలో హైవే విస్తరణ విమర్శలకు దారితీస్తోంది. చిన్న వ్యాపారులు ఉన్న చోట 66 ఫీట్ల రోడ్డును విస్తరించి, పెద్ద వ్యాపారులు, కమర్షియల్​ కాంపెక్స్​లు ఉన్నచోట 55 ఫీట్లకు కుదించారు. దీని వల్ల ట్రాఫిక్​ సమస్య పెరగడంతో పాటు పేదలకు అన్యాయం జరుగుతోందని స్థానికులు అంటున్నారు. 

ట్రాఫిక్​ నియంత్రణకు.. విస్తరణ

ఆసిఫాబాద్​ పట్టణంలో ట్రాఫిక్​ సమస్య ఎక్కువ ఉంది. ఈ సమస్య నియంత్రించేందుకు అధికారులు రోడ్డు విస్తరణ ప్రారంభించారు. వీటికి  రూర్భన్​ స్కీమ్​ ద్వారా నిధులు మంజూరయ్యాయి. 2018లో పనులు ప్రారంభించారు. నిబంధనల ప్రకారం 66 ఫీట్ల దాకా రోడ్డును విస్తరించాలి. పట్టణంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ నుంచి కుమ్రంభీం చౌక్ వరకు మొదట 55 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులను పూర్తి చేశారు. డివైడర్లు, సెంట్రల్​  లైటింగ్​ పనులు కూడా అయ్యాయి. ప్రస్తుతం మరో పది ఫీట్ల రోడ్డు పెంచాలని అధికారులు నిర్ణయించారు. దానికి అనుగుణంగా మార్కింగ్​ చేశారు. కానీ ఇది కేవలం చిన్న వ్యాపారులు ఉన్నచోటే మార్కింగ్​ చేశారని, పెద్ద భవనాలు, వ్యాపార ముదాయాలు ఉన్న చోట ఎలాంటి మార్కింగ్​ చేయలేదని స్థానికులు అంటున్నారు. 

టేలాల తొలగింపు.. 

రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇప్పటికే అధికారులు ఆర్టీసీ బస్ డిపో దగ్గర ఉన్న చిరువ్యాపారుల టేలాలను తొలగించారు. ఒక్కరూపాయి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. కానీ, జూబ్లీ మార్కెట్ లో స్థలం కేటాయిస్తామని చేతులు దులుపుకొన్నారు. రోడ్డు విస్తరణ కొన్ని చోట్ల 55 ఫీట్లు కూడా చేయలేదనే విమర్శలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల 55 ఫీట్లు విస్తరించిన రోడ్డు పైన కూడా కొందరు షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు.

పెరుగుతున్న ట్రాఫిక్​.. 

జిల్లాగా ఆవిర్భవించిన నాటి నుంచి పట్టణంలో రద్దీ ఎక్కువ అవుతోంది. జిల్లా కేంద్రం నుంచి వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి తోడు హైదరాబాదు నుంచి నాగపూర్ రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 66 ఫీట్ల రోడ్డు విస్తరించడం అవసరం అయింది. కానీ, అధికారులు ఒక్కో దగ్గర ఒక్కో కొలతతో విస్తరించడంతో ట్రాఫిక్​ సమస్య తీరేలా కనిపించడం లేదు. నాయకుల అండతో రోడ్డు వెడల్పులో మార్పులు జరగడంతో పార్కింగ్​సమస్యలు ఎదురవుతున్నాయని, మరోవైపు పేదలకు అన్యాయం జరుగుతోందని పలువురు అంటున్నారు.

సమస్య పరిష్కరించాలి

జిల్లా కేంద్రంలో రోడ్డు వెడల్పు లో భాగంగా అధికారులు 66 ఫీట్ల రోడ్డును 55 ఫిట్లకు కుదించడం కరెక్ట్ కాదు. గతంలో ఉన్న అడిషనల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి 66  పీట్ల విస్తరణ కోసం మార్కింగ్ కూడా చేశారు. ఇప్పటికైనా అధికారులు 66 ఫీట్ల రోడ్డు వెడల్పు చేసి ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలి.

ఆత్మకూరి ,చిరంజీవి,  సీపీఐ జిల్లా నాయకుడు

ఫండ్స్​ రాగానే పనులు.. 

గవర్నమెంట్ ఆదేశాలు ప్రకారం 66 అడుగులు రోడ్డు వెడల్పు చేయాలి.  55 అడుగులకే గతంలో ఉన్న అధికారులు కుదింపు చేశారు. గవర్నమెంట్ నుండి ఫండ్స్ వస్తే మిగిలిన పనులు షురూ చేస్తాం.
- పెద్దన్న ,ఆర్అండ్ బీ ఈఈ