
బాబాసాహెబ్ అంబేద్కర్ ను ప్రజల నుంచి దూరం చేయాలనే కుట్ర దశాద్బాలుగా జరుగుతూనే ఉందని, కానీ ఆయనను ప్రజల నుంచి ఎవరూ దూరం చేయలేరని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. సోమవారం (ఏప్రిల్ 14) అంబేద్కర్ జయంతి సందర్భంగా సుల్తానాబాద్, పెద్దపల్లి, కామన్ పూర్ తో పాటు గోదావరిఖని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సదర్భంగా వర్గీకరణ పేరుతో దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు.
దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలందరూ గమనించాలని సూచించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో పదవులు అనుభవిస్తూ..ఆయననే విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణ పేరుతో దళితులను విభజించే కుట్ర చేస్తున్నారని, దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. సమాజాన్ని విడదీయాలని చూస్తున్నారని, కలిపి ఉంచాలని ఎవరూ కోరుకోవడంలేదని ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ అన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు సంవత్సరాలకు పైగా కష్టపడి రాజ్యాంగం రాశారని, రాజ్యాంగం రాసి 70 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆయన రాసిన బాటలోనే మనం నడుస్తున్నామని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని, కానీ ఆయనను కానీ పార్లమెంట్ సాక్షిగా అవమాన పరుస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగం ద్వారా అందరికీ సమానంగా హక్కులు కల్పించారని, సామాజిక న్యాయ సాధన కోసమే రాజ్యాంగాన్ని రాశారని కొనియాడారు. అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగానే ఆర్బిఐని స్థాపించారని గుర్తుచేశారు.
►ALSO READ | సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు :సీపీ అనురాధ
దేశంలో కులవివక్ష , అంటరానితనం , సామాజిక అణిచివేతకు వ్యవతిరేకంగా అంబేద్కర్ పోరాడారాని తెలిపారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా రాజ్యంగం కల్పించిన హక్కు ద్వారానే అభివృద్ధి పథకాలు కొనసాగుతున్నాయని అన్నారు. అంబేద్కర్ మహిళలకు, కార్మికులకు, సబ్బండ వర్గాలకు సమాన హక్కులు కల్పించారని అన్నారు. అప్పట్లో ప్రధాని నెహ్రుతో కొట్లాడి హిందూ యాక్ట్ లో మార్పులు తీసుకువచ్చారని గుర్తు చేశారు. సమాన పనికి సమాన వేతనం.. 8 గంటల పని మొదలైన ఎన్నో సంస్కరణలతో పాటు కార్మికుల క్షేమం కోసం ఆలోచించిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ కొనియాడారు. అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.