పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, మార్కెట్ కమిటీ చైర్మన్‌ల ప్రమాణ స్వీకారోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు,ప్రభుత్వ సలహా దారుడు వేణుగోపాల్, ఎంపీ వంశీకృష్ణ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఈ సంధర్బంగా ధర్మారం మండలం నంది మేడారం, కటికన పల్లి గ్రామాల్లో 32/11 కేవీ సబ్‍స్టేషన్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సంధర్బంగా మాట్లాడిన ఎంపీ వంశీకృష్ణ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
గృహ లక్ష్మి పథకం
ఎన్నికల హామీల్లో ఒకటైన గృహ లక్ష్మి పథకం(200 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్) అమలు చేస్తున్నామని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. జనాభా పెరుగుతున్న కొద్ది విద్యుత్ వినియోగం పెరుగుతుంది కావున, ప్రతి ఇంటికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎల్లంపల్లి ముంపు గ్రామాల ప్రజలకు 18 కోట్ల రూపాయల నష్టపరిహారం చెక్కులు అందించడం సంతోషంగా ఉందని వంశీకృష్ణ అన్నారు.
గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైతే, దానిని కాంగ్రెస్ పార్టీ గాడిలో పెడుతున్న తీరును కాంగ్రెస్ ఎంపీ ప్రజలకు వివరించారు. సాంకేతిక ఇబ్బందులతో రుణమాఫీ కాని రైతులకు త్వరలోనే ఆ ఇబ్బందులు తొలగించి రుణమాఫీ చేస్తామని ఎంపీ మాటిచ్చారు. 30 గ్రామాల ప్రజల తాగునీటి అవసరాలతో పాటు ధర్మారం, రామగాడు మండలాల్లోని 10 వేల ఎకరాలకు సాగునీరు అందేలా పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఎంపీ వంశీకృష్ణ ప్రజలకు వివరించారు.
ALSO READ | త్వరలోనే మంథనిలో స్కిల్ సెంటర్ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు