ప్రజాస్వామ్యాన్ని పద్మ‘వ్యూహం’లో  బంధిస్తారా?

ప్రజాస్వామ్యాన్ని పద్మ‘వ్యూహం’లో  బంధిస్తారా?

వ్యూహ రచనలో, నిర్వహణలో ఎంత ప్రావీణ్యం ఉన్నా... ‘గోబెల్స్’ గెలిస్తే ప్రజాస్వామ్యానికే చేటు. ప్రజాస్వామ్యం అన్నది ప్రజా కేంద్రకంగా, ప్రజల కొరకు... ప్రజల చేత... ప్రజలే అనే మూల సూత్రంతో నడిచే బహిరంగ పాలనా పద్దతి. దానికి విరుద్దంగా ఇప్పుడు ప్రజల్ని మాయచేసే వ్యూహాలు, వ్యూహ కర్తలు పుట్టుకువస్తున్నారు. వారిని పాలకులు పోషించి, ప్రోత్సహిస్తున్నారు. పరస్పర ప్రయోజన ‘జుగల్బందీ’ సాగుతోంది. శాస్త్ర సాంకేతికతను గరిష్టంగా వాడుకొని వ్యూహాలు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఎత్తుగడలతో,  అంకెల విన్యాసంతో ఎన్నికల్లో గెలిచే పథక రచన చేస్తున్నారు. మౌలికమైన ప్రజాభిప్రాయంతో వారికి పని లేదు. ఏయే సామాజిక వర్గాలను ఎలా ఆకట్టుకోవాలి? ఏయే వయసుల వాళ్లకెలా గాలం వేయాలి?  రాజకీయంగా ఎవరితో ఎవరు చేతులు కలిపి, ఏయే శక్తుల  పునరేకీకరణలు జరిపించాలి? ప్రత్యర్థుల్ని ఎలా బోల్తా కొట్టించాలి? ఇలా... ఏం  చేస్తే ఎక్కువ ఓట్లు–సీట్లు కొల్లగొట్టొచ్చు!  అన్నదే ఈ వ్యూహాల వెనుక ఎజెండా. కార్యాచరణ కూడా అదే! ముమ్మాటికీ ఇది ప్రజాస్వామ్యానికి చేటు. 

వ్యూహాలూ ఎత్తుగడలతో ఎన్నికలు గెలవడం నికార్సయిన ప్రజాభిప్రాయానికి జరిపే నయవంచన! నయా వంచన! ఈ నిజాన్ని మరుగుపరచి,  ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు వ్యూహకర్తల వెనుక పరుగులు తీస్తున్నాయి. ఈ మాయోపాయాల్లో ఎవరైనా ‘పోటుగాడ’ని ప్రచారం జరిగితే చాలు, ఆయన సేవలు మాకు కావాలంటే, కాదు మాకు కావాలని ఆయన్ని దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారు. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కు సంబంధించి కాంగ్రెస్–టీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన తాజా దోబూచులాట ఇందుకొక ఉదాహరణ మాత్రమే!  ఏదైనా పార్టీ గానీ, ఎవరైనా  ముఖ్యనాయకులు గానీ లోగడ ఎన్నికల్లో ఓడిపోతే... తిరిగి ఎలా గెలవటం అని సమీక్షించుకునే వారు. పొరపాటు ఎక్కడ జరిగింది? ఎందుకు మనకు ప్రజలు దూరమయ్యారు ?  మనమే ప్రజలకు దూరమయ్యామా? అని  సమాలోచనలు జరిపేది. ఏం  చేసి తిరిగి అదే ప్రజల మెప్పు పొందుదాం? అని ఆలోచించే వారు. ఆ మేర తమ విధానాలను, వాటి ప్రాధాన్యతల్ని మార్చుకునే వారు.  ఎన్నికల ప్రణాళికను సవరించి, ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి దిగే వారు.  అలా ఎన్నికల్లో ప్రత్యర్థులపై ఆధిపత్యానికి యత్నించే వారు. అది నచ్చితే, వారిపై నమ్మకం కుదిరితే ప్రజలు విశ్వసించేవారు, ఓటు వేసి గెలిపించేవారు. లేదంటే, మళ్లీ తిరస్కరించేవారు. ఇదీ వరుస! కానీ, ఇప్పుడలా లేదు.‘ఎన్నికలు ఎలా గెలవటం?’ అనే అంశంపైనే పార్టీ అధినేతలు నిరంతరం కసరత్తు చేయడం, ఎదుటి పార్టీ ముఖ్యుల్ని కలిపేసుకోవడం, ప్రత్యర్థి శిబిరాల నుంచి ఎన్నికైన వారినీ లాక్కోవడం,  వ్యూహకర్తల్ని, కంపెనీలను నియమించుకోవడం, వీటి కోసమే  ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం… ఇది రివాజయింది.

మంచికా – చెడుకా!

ఏడాది కాలంగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో తరచూ భేటీ అవుతున్న పీకేతో డీల్ కుదరనందుకు పార్టీలో సంతోషపడ్డవాళ్లే ఎక్కువ.  అటు కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో, ఇటు టీఆర్ఎస్​కు  తెలంగాణలో...  పీకే కన్సల్టెంట్​గా ఉండటం స్థానిక నాయకుల్ని, కార్యకర్తల్ని అయోమయానికి గురి చేస్తోందని టీపీసీసీ మొదట ఆందోళనకు గురైంది. ఒప్పందం బెడిసాక  కాస్త ఊరట చెందింది. ఈ సమీకరణంతో నిమిత్తం లేకుండా అఖిల భారత స్థాయిలో కూడా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల శ్రేణులు ఊరడిల్లినట్టుగా సమాచారం. ‘వ్యక్తులెప్పుడూ పార్టీ కన్నా పెద్ద కారు’ అని ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖెరా పేర్కొనడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మానసిక స్థితిని తేటతెల్లం చేస్తోంది. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం కొత్తగా నెలకొల్పిన ‘సాధికార కార్యాచరణ బృందం–ఈఏజీ’లోకి పీకే ని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆహ్వానించడం, దాన్ని ఆయన తిరస్కరించడం తెలి సిందే! ఇది మంచికే జరిగిందని పార్టీ వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. నిజంగా పీకే చేశారని చెబుతున్న ప్రతిపాదనల్ని నాయకత్వం యధాతథంగా అంగీకరించి, ఆయన్ని పార్టీలో చేర్చుకొని ఉంటే... అదే కాంగ్రెస్​కు ఓ పెద్ద అవమానంగా మిగిలేది. 1. సోనియాకు తప్ప తానెవరికీ నివేదించరు. 2. పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో తనకు స్వేచ్ఛ ఉండాలి. 3. దేశంలో ఏయే ప్రాంతీయ శక్తులతో కలవాలో, ఎవరెవరితో పోటీ పడాలో తానే సూచిస్తారు. 4. తనకు చెందిన ఇండియన్–పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ–ప్యాక్) ఏ ఇతర పార్టీలకైనా పాక్షికంగానో/సంపూర్ణంగానో పనిచేయవచ్చు.  ఈ షరతులకు కాంగ్రెస్ అధినాయకత్వం అంగీకరించనందుకే బేరం బెడిసిందనే ప్రచారం జరుగుతోంది. 137 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఒక వ్యక్తికి ఇంతలా సాగిలపడాల్సిన పనిలేదని సీనియర్లు హెచ్చరించారు. 

జనామోదం పొందే ‘నమూనా’లు లేవా?

ఏ రాజకీయ పార్టీ అయినా జనాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం, మారుతున్న కాలమాన పరిస్థితుల్ని బట్టి తమ పంథా మార్చుకోవడం, ప్రాధాన్యతలు నిర్ణయించుకోవడం, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు  చేపట్టడం. సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీగా అదే చేసింది. దూరదృష్టి కలిగిన దార్శనికుడిగా తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు, పబ్లిక్ సెక్టార్ పై దృష్టి కేంద్రీకరిస్తే, ఆయన తర్వాత ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్, జై కిసాన్’ అని జనహృదయాలు దోచారు. ఆ పై వచ్చిన ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణతో పాటు ‘గరీబీ హఠావో’ అని సామాజికార్థిక సంస్కరణల బాట పట్టారు. అవసరమే లేని ఎమర్జెన్సీని ఆమె జనంపై రుద్ది ప్రజా కంటకంగా మారినపుడు, ప్రజలే ఆమెను మార్చుకున్నారు. ఫలితంగా అధికారంలోకి వచ్చిన జనతాపార్టీ ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రజాస్వామ్య పంథాలోనే పాలన సాగించాల్సిన పరిస్థితిని ప్రజాభిప్రాయమే కల్పించింది. కానీ, వారిలో ఐక్యత లోపించి, రాజకీయంగా ‘కుక్కలు చింపిన విస్తరి’ అవడంతో తిరిగి ఇందిరనే జనం అధికారంలోకి తెచ్చుకున్నారు. ఆమె మరణానంతరం ప్రధాని పీఠమెక్కిన రాజీవ్ గాంధీ, అప్పుడున్న అవసరాలు, జనాభిప్రాయాన్ని బట్టి ఐ.టీకి, ఆధునిక సాంకేతికతకు పెద్ద పీట వేయాల్సి వచ్చింది. అలాగే పీవీ నర్సింహారావు, 90లలో ఆర్థిక సంస్కరణలకు పచ్చజెండా ఊపితే, తర్వాత వాజ్​పేయి నేతృత్వంలో వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం మౌలిక వసతుల రంగాన్ని భుజాలకెత్తుకుంది. ఆ పైన కాంగ్రెస్ నేతృత్వంలో వచ్చిన యూపీఏ ప్రభుత్వం అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు,  పాలనా సంస్కరణలకు తెరలేపింది కూడా జనాభిప్రాయానికి తలొగ్గడం వల్లే! ఫలితంగానే.... సమాచార హక్కు, గ్రామీణ ఉపాధి హామీ, భూసేకరణ చట్టం–13, కనీస వేతన చట్టం వంటి గొప్ప నిర్ణయాలు వారి హయాంలో సాధ్యమయ్యాయి. ఈ అన్ని ప్రాథమ్యాలకు జనాభిప్రాయమే ప్రాతిపదిక, అదే ఎప్పటికైనా  పాలకులకు శిరోధార్యం.

ప్రశాంత్ కిషోర్ ఒక వ్యూహకర్త. తనను తాను గొప్పగా మార్కెటింగ్ చేసుకోగల దిట్ట! తన ముందున్న మార్కెట్ అవకాశాల్లో గెలుపు గుర్రాలపైనే పందెం కాసి, మార్కులు పెంచుకోవడం ఆయన వ్యూహాల్లో ప్రధానం. ఆయన ఓడిపోయే గుర్రాలెక్కరు (లంగ్డే ఘోడేపే కోయీ షరత్ నయి లగాతే!) ఒకటి రెండు సందర్భాల్లో అలా ఎక్కి బొక్కబోర్లా పడ్డారు. మొన్నటి యూపీ నుంచి నిన్నటి గోవా వరకు ఎన్నో ఉదాహరణలున్నాయి. రాజకీయ పార్టీలు గాని, ప్రభుత్వాలు కానీ, సొంత మానవ వనరులపై ఆధారపడటం కన్నా తటస్థ ఎజెన్సీల సహాయం తీసుకోవడం ఎన్నికల్లో విజయానికి ఉపయోగపడుతుందని పీకే బలంగా నమ్ముతారు. డిజిటల్ శక్తితో సామాజిక మాధ్యమాల్ని పరుగెత్తిస్తారు. అందుకు తగ్గట్టే వ్యూహాలు రచిస్తారు. తాను సహాయం చేస్తాను కనుక, సహాయకుడనాలి తప్ప ‘వ్యూహకర్త’ అనే పద ప్రయోగాన్ని ఆయన అంగీకరించరు. ఎంత వరకు నిజమో తెలీదు కానీ, ఒక ప్రచారమైతే రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దేశ వ్యాప్తంగా ఐ.టీ నైపుణ్యం కలిగిన 5 వేల మంది, నెలకు లక్ష రూపాయల వేతనంతో ఏడాది పాటు ప్రజా క్షేత్రంలో పనిచేస్తే పరిస్థితులు సానుకూలిస్తాయని కాంగ్రెస్​కు ఆయన సలహా ఇచ్చారంటారు. అంత డబ్బు ఎవరు? ఎవరి కోసం వెచ్చిస్తారు? ఏదో రూపంలో అదంతా ప్రజాధనమే కద! రాజకీయాలు ఇటీవల ఫక్తు వ్యాపారమయం అయ్యాయి, ‘పెట్టుబడి–వ్యవహారం–లాభార్జన’ అనే సూత్రం బలపడిందనడానికి ఈ ‘వ్యూహకర్తల’ వ్యవస్థ బలమైన ఒక సాక్ష్యమే!
- దిలీప్​రెడ్డి
dileepreddy.r@v6velugu.com