చెరువు కుంటల రక్షణకు చర్యలేవి?

జాతీయ, రాష్ట్ర రహదారుల విస్తరణ, కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలోని మారుమూల ప్రాంతంలో కూడా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎకరా భూమి లక్షలు, కోట్ల రూపాయల ధర పలుకుతున్నది. ఇదే అదునుగా కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్‌‌ భూములు, చెరువులు, కుంటలు, చివరకు శ్మశాన వాటికల స్థలాలను కూడా వదిలిపెట్టకుండా ఆక్రమిస్తున్నారు. ఒకప్పుడు విశాలంగా ఉన్న చెరువులు, కుంటలు రాను రాను కుచించుకుపోతున్నాయి. చెరువులు, కుంటల చుట్టూ స్పష్టమైన హద్దులు, కంచె లేకపోవడంతో ఆక్రమణల పర్వం కొనసాగుతున్నది.

చెరువు, కుంటలను ఆలవాలంగా చేసుకునే వాటి సమీపంలో గ్రామం జీవనం సాగిస్తుంటుంది. ఒకప్పుడు సాగు, తాగునీటి అవసరాలు తీర్చిన ఈ చిన్న నీటి వనరులకు ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ‘మిషన్​ కాకతీయ’ పథకం తీసుకువచ్చి చెరువుల పూడిక తీసి, కట్టను బలంగా చేసింది. ఈ తొమ్మిదేండ్లలో వర్షాలు విస్తారంగా పడుతుండటంతో ఏటా చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. అయితే క్యాచ్​మెంట్​ఏరియా తక్కువ ఉన్న, విస్తీర్ణం తక్కువ ఉన్న కొన్ని చెరువు శిఖం భూములను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటల్లో పూడిక తీసింది కానీ, ఆ నీటి వనరులకు హద్దులు నిర్ణయించి, ఎఫ్​టీఎల్​పరిధి నిర్ధారించి, కంచె ఏర్పాటు చేయడం లాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. దీంతో చెరువు, కుంటల భూములకు రక్షణ లేకుండా పోయింది. ఉదాహరణకు సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం కిష్టంపేట గ్రామంలో ప్రభుత్వ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్​276లో3 ఎకరాల విస్తీర్ణంలో లింగంపల్లి కుంట ఉన్నది. 2017లో రాష్ట్ర ప్రభుత్వం రూ.15.18 లక్షల అంచనాతో మిషన్​ కాకతీయ పథకంలో భాగంగా అభివృద్ధి చేసింది. 2021లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.8.63 లక్షలతో మరోసారి పూడిక తీత పనులు చేపట్టింది. రాష్ట్ర సర్కారు కుంటను అభివృద్ధి అయితే చేసింది కానీ.. దాని రక్షణకు చర్యలు తీసుకోలేదు. దీంతో ఒకప్పుడు 3 ఎకరాలు ఉన్న లింగంపల్లి కుంట ఇప్పుడు ఎకరం విస్తీర్ణానికి కుచించుకుపోయింది. ఇదే జిల్లాలోని చేర్యాల మండల కేంద్రంలో రోడ్డును ఆనుకొని ఉన్న చేర్యాల కుడి చెరువును కొందరు అక్రమార్కులు కబ్జా చేసి వెంచర్​వేశారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా చెరువులు, చిన్న చిన్న కుంటలు కబ్జాకు గురవుతున్నాయి. ప్రతి చెరువుకు జియోట్యాగింగ్‌‌ చేసి, మ్యాప్‌‌ను సైతం ఆన్‌‌లైన్‌‌లో పొందుపరుస్తామని, డిజిటల్‌‌ సర్వే చేపట్టడంతో పాటు ఎఫ్‌‌టీఎల్‌‌(నీటి నిలువ సామర్థ్యం)ను గుర్తించేందుకు కృషి చేస్తామని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. కానీ అది పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల్లో అమలు కాలేదు.

సత్వర చర్యలు అవసరం

చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ఓ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. హైదరాబాద్‌‌, రంగారెడ్డి, మేడ్చల్‌‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో జీహెచ్‌‌ఎంసీకి సంబంధించి185 చెరువులను పరిరక్షించేందుకు బల్దియా కీలక నిర్ణయం తీసుకున్నది. చెరువులు, కుంటలకు సంబంధించిన గజం స్థలం కూడా కబ్జా కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 4జీ/5జీ సిమ్‌‌ బెస్డ్‌‌తో 1,170 చోట్ల సీసీ కెమెరాల ఏర్పాటుకు అధికారులు టెండర్లను ఆహ్వానించారు. సీసీ కెమెరాల నిఘా బాధ్యత ఏజెన్సీకి అప్పగించి రెండేండ్లపాటు నిర్వహణ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సంబంధిత చెరువుల్లో ఎలాంటి చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు డంప్​ చేయకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే వారిని గుర్తించి వెంటనే స్థానిక పోలీస్‌‌ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం, కబ్జాలకు పాల్పడే వారి పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇదీగాక ఎఫ్‌‌టీఎల్‌‌ నిర్ధారణ, చెరువు భౌగోళిక స్వరూపం, సర్వే నంబర్లు, విస్తీర్ణం, ప్రాంతం, రెవెన్యూ మండలం వివరాలపై సమగ్ర స్థాయిలో అధికారులు సర్వే చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో చేస్తున్నట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటల పరిరక్షణ బాధ్యతలను ఆయా స్థానిక ప్రభుత్వాలకు అప్పజెప్పి, ప్రభుత్వం నుంచి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ ఉండేలా చూడాలి. ‘కంచె చేను మేస్తుంది’ అన్న చందంగా ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు కబ్జాకు పాల్పడే అవకాశం ఉన్నందున పటిష్ట చర్యలు తీసుకోవాలి.

లక్షల ఎకరాల్లో పంటల సాగు

రాష్ట్రంలో చెరువులు, కుంటలు భూగర్భజలాల స్థిరీకరణతోపాటు సాగు, తాగు నీటి అవసరాలు తీరుస్తున్నాయి. తెలంగాణలో దాదాపు 45 వేల చెరువులు, వేలాది కుంటలు ఉన్నాయి. ఈ చిన్న తరహా నీటి వనరుల కింద దాదాపు 26 లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగవుతున్నాయి. చెరువులు, కుంటలు నిండిన ప్రతీసారి దాని చుట్టు పక్కల ప్రాంతంలో భూగర్భజలాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి సాగు పెరగడంలో, అంచనాకు మించి ధాన్యం దిగుబడులు రావడంలో చెరువులు, కుంటల పాత్ర ఉన్నది. ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను చెరువులు, కుంటల్లో వదులుతున్నది. లక్షలాది మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. గ్రామాల్లో గొర్లు, మేకల తాగునీటి అవసరాలు తీరుస్తున్నవి కూడా చెరువులు, కుంటలే. ఇలా మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో బలమైన సంబంధం కలిగి ఉన్న ఈ నీటి వనరులను నిర్లక్ష్యం చేయడం సరికాదు. కుంటలు, చెరువులే కదా? అని తేలిగ్గా తీసుకుంటే.. భవిష్యత్​లో ముప్పు తప్పదు.
- బందెల సురేందర్​ రెడ్డి,
ఎక్స్​ సర్వీస్ ​మెన్