120 బెడ్లపై 330 మంది పిల్లలకు ట్రీట్‍మెంట్
సీజనల్ వ్యాధులతో ఆస్పత్రికి జనం
క్యూ ఒక్కరోజే 100 మందికి పైగా చిన్నారుల చేరిక
ఓపీ, టెస్టుల కోసం గంటల తరబడి అవస్థలు పడుతున్న పేరెంట్స్
సిబ్బంది లేక వైద్య సేవలకు ఇబ్బందులు
పీజీలు, హౌస్ సర్జన్లతో నెట్టుకొస్తున్న అధికారులు
వరంగల్, ఎంజీఎం, వెలుగు: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉండే వరంగల్ ఎంజీఎం హస్పిటల్‌లో పిల్లల వార్డులో బెడ్లు నిండిపోయాయి. ఒక్కో బెడ్పై ఇద్దరు, ముగ్గురు చిన్నారులను ఉంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. సోమవారం ఒక్కరోజే దాదాపు వంద మంది చిన్నారులు ట్రీట్‍మెంట్ కోసం హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఇప్పటికే బెడ్ల కొరత ఉండటం, పేషెంట్ల సంఖ్య పెరిగిపోవడంతో ఏం చేయాలో తెలియక ఉన్న బెడ్లపైనే పిల్లలకు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. కొందరికి జ్వరం ఇంకా తగ్గకముందే మందులు ఇచ్చి డిశ్చార్జ్ చేస్తున్నారు. మరోవైపు ఎమర్జెన్సీ టైమ్‌లో గంటల తరబడి ఓపీ కోసం ఎదురుచూడలేక చిన్నారులు, వారి తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు.
నిన్నమొన్నటి వరకు 150లోపు ఉన్న ఓపీ.. వైరల్ ఫీవర్ కేసులు ఇప్పుడు మూడింతలు పెరిగాయి. ప్రైవేట్ హాస్పిటళ్లలో వేలాది రూపాయలు ఖర్చుచేయలేక తల్లిదండ్రులు తెల్లవారుజామునే జ్వరంతో ఉన్న తమ పిల్లల్ని భుజాలపై ఎత్తుకుని వస్తున్నారు. ఓపీ నంబర్ కోసం ఎంజీఎంలో గంటల తరబడి క్యూ కడుతున్నారు. తక్కువ సిబ్బంది ఉండటంతో చెకప్ కోసం ఇట్లనే ఎదురుచూడాల్సిన దుస్థితి. ట్రీట్‍మెంట్ అవసరమై హాస్పిటల్‌లో అడ్మిట్ కావాలంటే మధ్యాహ్నం దాటుతోంది. పేషెంట్ల రద్దీకి అనుగుణంగా బెడ్లు, స్టాఫ్ లేకపోవడం సమస్యకు ప్రధాన కారణమవుతోంది. పిల్లలకు టెస్టులు, స్కానింగ్‌లు రాసే క్రమంలో అంతేస్థాయి సిబ్బంది లేకపోవడంతో ఒక్కొక్కరి రిపోర్ట్ రావడానికి గంటల టైం పడుతోంది. అప్పటివరకు అసలు ట్రీట్‍మెంట్ ఆగుతోంది. జ్వరంతో పిల్లలు, గంటల తరబడి నిల్చోలేక పేరెంట్స్ వాలిపోతున్నారు. ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం పీడియాట్రిక్ విభాగంలో 120 బెడ్లు అందుబాటులో ఉండగా.. 30 బెడ్లకు ఒక యూనిట్ చొప్పున 4 యూనిట్ల డాక్టర్ల బృందం పని చేస్తోంది. పిల్లల వార్డులో శనివారం నాటికి 205 మంది దాకా పేషెంట్లు ఉండగా.. సోమవారం మధ్యాహ్నానికి దాదాపు 330కు చేరింది. ఈ లెక్కన ఒక్కో బెడ్ మీద ఇద్దరు, ముగ్గురు చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా పేషెంట్ల సంఖ్య పెరగడంతో హస్పిటల్ అధికారులు అందుబాటులో ఉన్న పీజీలు, హౌస్ సర్జన్లతో నెట్టుకొస్తున్నారు. అయినా ఇబ్బందులు తప్పడంలేదు.
మందులిచ్చి పంపేస్తున్రు
హస్పిటల్‌లో బెడ్ల కొరత, వైద్య సిబ్బంది లేకపోవడం వంటి కారణాలతో డాక్టర్లు తప్పనిసరి పరిస్థితుల్లో పలువురు పేషెంట్లను జ్వరం తగ్గకముందే డిశ్చార్జ్ రాస్తున్నారు. మామూలు జ్వరానికి కోలుకోడానికే మినిమం మూడు రోజులు పడుతుండగా.. వైరల్ ఫీవర్స్ బాధితుల పూర్తిస్థాయి చికిత్సకు మరో రెండు రోజులు ఎక్కువ పడుతోంది. డైలీ ఓపీ, అడ్మిట్ అయ్యే పిల్లల సంఖ్య పెరుగుతుండటంతో సగం ట్రీట్‍మెంట్ దాటగానే ‘హోం కేర్’ సజెస్ట్ చేస్తున్నారు. అందుబాటులో ఉండే మందులు ఇవ్వడానికి తోడు బలం పెరగడానికి అవసరమైన సిరప్ వంటివి బయటకు రాస్తున్నారు.
వెనక్కి పంపలేక
సీజనల్ వ్యాధులు పెరగడంతో ఎంజీఎం పీడియాట్రిక్ విభాగంలో ఓపీ, అడ్మిట్ సంఖ్య డైలీ పెరుగుతోంది. పిల్లల వార్డులో ఉన్న బెడ్లతో పోలిస్తే రెండు, మూడింతల మంది చిన్నారులు ట్రీట్‍మెంట్ కోసం వస్తున్నారు. ఏ ఒక్కరినీ వెనక్కి పంపకుండా అందరికీ సర్వీస్ ఇస్తున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కో బెడ్పై ఇద్దరు, ముగ్గురిని ఉంచాల్సి వస్తున్నది. గతంలో ఉన్న స్టాఫ్‍కు తోడు పీజీ, హౌస్ సర్జన్లు, కొవిడ్ ట్రీట్‍మెంట్ సిబ్బంది సేవలను ఉపయోగించుకుంటున్నాం.
- డాక్టర్ వి.చంద్రశేఖర్, ఎంజీఎం సూపరింటెండెంట్
మందుగోలీలు బయటికే రాస్తున్రు
మా బాబుకు జ్వరమొస్తే ఆదివారం దవాఖానకు తీసుకొచ్చిన. పిల్లల వార్డులో అడ్మిట్ చేయాలని చెబితే చేయించా. అంతా బాగానే ఉంది కానీ.. మందులు ఇక్కడలేవని బయటకు రాస్తున్నారు. ప్రైవేటు హస్పిటల్‌కు పోతే బిల్ ఎక్కువైతదని ఇక్కడికొస్తే మళ్లీ బయటికే రాస్తున్నరు.
- మల్లేశ్, ఎన్‍టీఆర్ నగర్, వరంగల్
ప్రైవేటుకు రాసిచ్చిన్రు
మా తమ్మునికి తీవ్ర జ్వరం రావడంతో శుక్రవారం ఎంజీఎంలో చేర్పించాం. పిల్లల వార్డులో జాయిన్ చేసుకున్న సిబ్బంది.. జ్వరం ఎందుకొచ్చిందో తెలిపే టెస్టులను బయటకు రాసిన్రు. పీడియాట్రిక్ వార్డులో అడ్మిషన్లు ఎక్కువగా ఉన్నాయని, టెస్టులు టైమ్‌కు కావడం లేదని చెప్పిన్రు. ఇప్పటికే రెండు టెస్టులను ప్రైవేట్ ల్యాబ్‍లో చేయించిన.
- సోకాల వెంకటేశ్, రామగుండం