ఏ పనికైనా హుండీల ఆదాయమే దిక్కు
ఈసారి భారీగా తగ్గిన హుండీల పైసలు
కల్యాణ వేడుకకు కోటి దాకా ఖర్చయ్యే చాన్స్
ప్రభుత్వం తెచ్చే తలంబ్రాలు, పట్టువస్త్రాలకూ రామయ్య ఖజానా నుంచే ఖర్చు
4 నెలలుగా సిబ్బందికి అందని జీతాలు
పట్టించుకోని పాలకులు
భద్రాచలం, వెలుగు: భద్రాద్రి రామయ్య పెండ్లిని కాసుల కటకట వెంటాడుతోంది. హుండీలు తెరిస్తే కానీ ఏ పనీ సాగని పరిస్థితి నెలకొంది. పాలకులు ఈ ఉత్సవాలను ప్రభుత్వ ఉత్సవాలుగా ప్రకటించక పోగా, కనీసం నిధులు కూడా ఇవ్వడం లేదు. దీంతో త్వరలో చేపట్టే రామయ్య కల్యాణానికి పైసలు ఎట్ల తేవాలని అధికారులు పరేషాన్ అవుతున్నారు. హుండీల ఆదాయం కూడా ఈసారి అంతంతే ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. ఏటా ఈ కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే ముత్యాలు, పట్టువస్త్రాల డబ్బులను కూడా ఆలయ ఖజానా నుంచే ఖర్చు చేయాల్సి వస్తోంది. డబ్బులు లేకపోవడంతో గత నాలుగు నెలలుగా ఇక్కడ సిబ్బందికి జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదు. ఆలయంలో నిర్వహించే శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం పాలకమండలి తీర్మానం చేసింది. అయితే.. దాన్ని అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు దాని ఊసేలేకుండా పోయింది.
సీఎం వచ్చేదెన్నడో..?
భద్రాద్రి రామయ్య పెండ్లికి ముఖ్యమంత్రి వచ్చి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాలు సమర్పించడం ఇక్కడ సంప్రదాయం. కానీ సీఎం కేసీఆర్నాలుగేండ్లుగా రావడమే మానేశారు. 2015లో సీఎం హోదాలో పట్టువస్త్రాలతో ఆయన వచ్చారు. అటు తర్వాత నుంచి ఆయన ప్లేస్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులే పట్టువస్త్రాలు, ముత్యాలు సమర్పిస్తున్నారు. ఏటా పెండ్లి వేడుకకు సీఎం వస్తేనన్నా.. ఇక్కడి సమస్యలు తెలుస్తాయని, సంప్రదాయాన్ని కొనసాగించినట్లన్నా అవుతుందని భక్తులు అంటున్నారు.
ఆదాయం, ఖర్చు సమానం
గత కొంతకాలంగా రామయ్య ఆలయ ఆదాయం, ఖర్చు రెండూ సమానంగానే ఉంటున్నాయి. హుండీల ఆదాయం ఏ మాత్రం పెరగడం లేదు. 2013-–14లో రూ.22,02,45,929 ఆదాయం రాగా, ఖర్చు రూ.22,07,48,713 అయింది. 2014–-15లో రూ.29,86,91,836 ఆదాయం రాగా.. ఖర్చు రూ.29,02,30,937 అయింది. 2015–-16లో రూ. 38,76,80,936 ఆదాయం రాగా రూ. 38,86,60,622 ఖర్చయింది. 2016-–17లో రూ. 29,28,94,065 ఆదాయం రాగా, ఖర్చు 29,48,62,291 అయింది. 2017–-18లో రూ.30, 88,43,099 ఆదాయం రాగా, రూ.28,12,45,870 ఖర్చయింది. భద్రాద్రికి సగటున ఏటా రూ.23 కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో 51శాతానికి పైగా సిబ్బంది వేతనాలకు పోతున్నది. నెలకు సిబ్బంది జీతాలు, పెన్షన్లుకు రూ. కోటి ఇస్తున్నారు. మిగిలిన వాటి నుంచి ఎండోమెంట్‍అడ్మినిస్ట్రేషన్ ఫండ్(ఈఏఎఫ్), కామన్ గుడ్ ఫండ్(సీజీఎఫ్), అర్చక సంక్షేమ నిధి, ఆడిట్‍ఫీజు వంటి నాలుగు రకాల పన్నుల రూపంలో ప్రభుత్వానికి దేవస్థానం తన ఆదాయం నుంచి 21 శాతం చెల్లించాల్సి వస్తోంది. అంటే రూ.4.5 కోట్లు ప్రభుత్వానికే శిస్తు రూపంలో కట్టాల్సి వస్తోంది. ఇవి గత కొంత కాలంగా పెండింగ్‍లో ఉన్నాయి. సుమారు రూ. 14 కోట్లు చెల్లించాల్సి ఉంది. నిధులు లేక 2 నెలలుగా ఔట్‍సోర్సింగ్‍సిబ్బందికి, నాలుగు నెలలుగా శానిటేషన్, హౌస్‍కీపర్లకు వేతనాలు ఇవ్వడం లేదు.
ప్రభుత్వం తెచ్చే తలంబ్రాలకూ రామయ్య పైసలే
రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఏటా రామయ్య పెండ్లికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తుంటారు. దీని కోసం రూ. 15 వేలు ఖర్చవుతుంటుంది. రూ. 10 వేలు పట్టు వస్త్రాలకు, రూ. 5 వేలు ముత్యాల తలంబ్రాలకు ఖర్చు పెడుతారు. అయితే ఈ మొత్తాన్ని కూడా రామయ్య ఖజానా నుంచే తీసుకుంటారు. అటు తర్వాత ఇక్కడి అధికారులు బిల్లులు పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తాన్ని విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ.. చాలా కాలంగా ఆ డబ్బులు కూడా ప్రభుత్వం విడుదల చేయడం లేదు.
హుండీలు తెరిచినా.. ?
దేవస్థానం ఖజానాలో డబ్బులు లేకపోవడంతో ప్రతి ఉత్సవానికి హుండీల ఆదాయంపైనే ఇక్కడి అధికారులు ఆధారపడాల్సి వస్తోంది. ఇటీవల వరుస ఉత్సవాల నిర్వహణకు హుండీల ఆదాయాన్ని సర్దుబాటు చేశారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకు ఇక్కడ తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. ఏప్రిల్ 2న శ్రీరామనవమి, సీతారాముల కల్యాణం, 3న శ్రీరామ పట్టాభిషేకం ఉంటాయి. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ప్రస్తుతం తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి నిర్వహణ ఖర్చు కోసం హుండీలను తెరిచేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ఖర్చు రూ. 85 లక్షల నుంచి రూ. కోటి వరకు అవుతుందని అంచనా వేశారు. ఇటీవల కాలంలో 3 నెలలకోకసారి హుండీ తెరిచినా రూ. 70 లక్షలకు మించి ఆదాయం రావడం లేదు. ఈ మధ్య భక్తులు సంఖ్య బాగా తగ్గడంతో హుండీల ఆదాయం అంతంతే వచ్చేలా ఉంది. రామయ్య పెండ్లి వేడుకకు హుండీల ఆదాయం ఏ మూలకు సరిపోయేలా లేదు. దీంతో డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలన్న రంది దేవస్థానం అధికారులను వేధిస్తోంది.
సెప్టెంబర్ నుంచి భారీగా తగ్గిన భక్తులు
గత ఏడాది సెప్టెంబర్‌లో పాపికొండల్లో లాంచీ ప్రమాదం జరిగిన నాటి నుంచి పర్యాటకుల రాక చాలా తగ్గింది. శని, ఆదివారాల్లో రోజూ 20 వేల మంది, సాధారణ రోజుల్లో 5వేల మంది భక్తులతో కళకళలాడేది. ఇప్పుడు సగటున 3 వేలకు మించి భక్తులు రావడం లేదు. దీంతో హుండీ ఆదాయం భారీగా తగ్గిపోయింది.
ఇబ్బందులు రాకుండా చూస్తున్నం: ఈవో
సీతారామ కల్యాణానికి కాసుల కటకట వాస్తవమేనని భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో గదరాజు నర్సింహులు అన్నారు. అయితే.. ఇబ్బందులు తలెత్తకుండా స్పెషల్ యాక్షన్ ప్లాన్‌తో పనులు చేపడుతున్నామని చెప్పారు. రూ. 85 లక్షల అంచనాతో నవమి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే కొన్ని టెండర్లు ఓకే చేశామని, మరి కొన్ని టెండర్లు ఆగిపోవడంతో రీ టెండర్ కాల్ చేస్తున్నామని తెలిపారు. ఉత్సవాలకు గతంలోనూ ప్రభుత్వం నుంచి నిధులు రాలేదన్నారు.