స్కూళ్లలో స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణకు టీచర్ల తిప్పలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పాఠశాలలకు ఇవ్వాల్సిన ఫండ్స్​ను ప్రభుత్వం ఇన్​టైంలో రిలీజ్​ చేయకపోవడంతో టీచర్లు తిప్పలు పడుతున్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ప్రధాని మోడీతో పాటు సీఎం కేసీఆర్​ పిలుపునిచ్చారు. రెండు వారాల పాటు వజ్రోత్సవాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. కానీ బడులకు ఫండ్స్​ రిలీజ్​ చేయకపోవడంతో పంద్రాగస్టు వేడుకలు ఎట్లా చేయాలని హెచ్ఎంలు, టీచర్లు వాపోతున్నారు.  

పైసల కోసం తిప్పలు..

ఏటా విద్యార్థుల సంఖ్యను బట్టి హైస్కూల్స్​కు ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. ఇలా ఒక్కో బడికి రూ. 20 వేల నుంచి రూ.75 వేల వరకు ఫండ్స్​ వస్తాయి. ప్రైమరీ స్కూల్స్​కు 
రూ.15వేలు, అప్పర్​ ప్రైమరీ స్కూల్స్​కు రూ. 20 వేలు ఇస్తుంది. జిల్లాలో 792 ప్రైమరీ స్కూల్స్, 162 యూపీఎస్​, 111 హైస్కూల్స్​ ఉన్నాయి. వీటికి రూ.2 కోట్ల మేర నిధులు రావాల్సి ఉంది. అలాగే ఎమ్మార్సీలకు ప్రభుత్వం ఏటా రూ. 90 వేలు ఇస్తుంది. ఈ నిధులను ఏడాదికి రెండు దఫాలుగా విడుదల చేస్తుంది. ఈ నిధులను స్టేషనరీ ఇతరత్రా అవసరాలకు ఉపయోగిస్తారు. స్కూల్స్​ స్టార్ట్​ అయి రెండు నెలలు కావొస్తున్నా ఒక్క పైసా ఇవ్వకపోవడంతో టీచర్లు తమ జేబుల్లోంచే డబ్బులు పెట్టాల్సి వస్తుందని వాపోతున్నారు. 

రెగ్యులర్​ ఎంఈవోలు కరువు.. 

జిల్లాలోని 23 మండలాలకు ఒక్కరు కూడా రెగ్యులర్​ ఎంఈవో లేరు. ఒక్కో హెచ్ఎం రెండు నుంచి మూడు మండలాలకు ఇన్​చార్జి ఎంఈవోలుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 662 టీచర్​ పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యాబోధన అంతంతమాత్రంగానే జరుగుతోంది. 44 గ్రేడ్–2 హెచ్ఎం, 343 స్కూల్​ అసిస్టెంట్, 241 ఎస్​జీటీ పోస్టులతో పాటు లాంగ్వేజ్​ పండిట్, పీఈటీలు, మ్యూజిక్​, క్రాఫ్ట్, ఆర్ట్​ టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్ల నియామకం జరిగేంత వరకు విద్యావలంటీర్లనైనా తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. 

ప్రోగ్రామ్స్​ ఎట్ల చేయాలె..

పాఠశాలలకు నిధులను వెంటనే​ రిలీజ్​ చేయాలి. బడులు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా టీచర్ల కొరత వెంటాడుతోంది. ప్రోగ్రామ్స్​ చేయాలని చెబుతున్న ప్రభుత్వం ఫండ్స్​ ఇవ్వక పోవడం సరైంది కాదు. స్వాతంత్ర్య దినోత్సవం, వజ్రోత్సవ వేడుకలకు నిధులు వెంటనే ఇవ్వాలి.
- డి. వెంకటేశ్వరరావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు