జాగాల్లేవ్.. పైసల్లేవ్.. మొక్కలెట్ల నాటాలె?

  • సర్కార్ పై కార్యదర్శులు, సర్పంచ్‌ల ఆగ్రహం
  • సీఎం బర్త్ డే రోజున ఊరికి వెయ్యి మొక్కలు నాటాలని అధికారుల ఆదేశం
  • ఇప్పటికే పెండింగ్ బిల్లులు ఇస్తలేరని సర్పంచ్‌ల ఆవేదన

హైదరాబాద్, వెలుగు: ‘‘సీఎం కేసీఆర్ బర్త్ డే (ఈ నెల 17) సందర్భంగా ప్రతి ఊళ్లో ఉదయం 10 నుంచి 11గంటల మధ్య వెయ్యి మొక్కలు నాటాలి. స్థానికంగా మొక్కలు లేకపోతే గ్రీన్ బడ్జెట్ నుంచి కొనాలి. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు.. ఇలా చెట్లు నాటేందుకు ప్లేస్ ను గుర్తించండి’’

కొన్ని రోజుల క్రితం అన్ని జిల్లాల, మండలాల, గ్రామాల అధికారులకు పంచాయతీ రాజ్ శాఖ జారీ చేసిన ఆదేశాలివీ. అయితే సీఎం బర్త్ డే సందర్భంగా మొక్కలు నాటాలని అధికారులు ఇచ్చిన ఆదేశాలపై సర్పంచ్ లు, కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో వెయ్యి మొక్కలు నాటేందుకు స్థలం ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సర్పంచ్ లకు రాష్ట్ర సర్కార్ పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉంది. తమకు రూ.20 లక్షల వరకు రావాల్సి ఉందని కొంతమంది సర్పంచ్ లు చెబుతున్నారు. మిత్తికి తెచ్చి వైకుంఠధామాలు, ప్రకృతి వనాలు, రైతు వేదికలు నిర్మించామని.. కానీ ఇంత వరకూ వాటి బిల్లులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడేమో వెయ్యి మొక్కలు నాటాలని ఆదేశించారని, వాటికి ఫండ్స్ ఎవరు ఇస్తారని వాపోతున్నారు. ఒక్కో మొక్కకు రూ.35 ఉందని.. గుంతలు, ట్రీ గార్డులు, నాటే ఖర్చు అంతా కలిపి సుమారు రూ.60వేలు అవుతుందని పేర్కొంటున్నారు. మళ్లా తమ సొంత డబ్బులు ఖర్చు చేయాల్నా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మేమే దొరికినమా?

ప్రభుత్వంలో ఇన్ని శాఖలు, ఇంతమంది అధికారులు, ఉద్యోగులు ఉంటే.. మొక్కలు నాటేందుకు మేమే దొరికినమా? అని పలువురు సర్పంచ్ లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఖర్చు భరించే స్థితిలో తాము లేమని వాపోతున్నారు. ఈ కార్యక్రమానికి కావాల్సిన నిధుల వినియోగానికి వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. ఎండాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నాటిన మొక్కలను బతికించడం కూడా కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లా మొక్క బతకలేదనే కారణంతో కార్యదర్శులతో పాటు తమకూ నోటీసులు ఇస్తారని గుర్తు చేస్తున్నారు. అధికారులు పరోక్షంగా ఆదేశాలివ్వడం, ఒత్తిడి తేవడం మానుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు.. గ్రామాలకు వచ్చి ఫొటోలకు పోజులిచ్చి పోకుండా, వాళ్లు కూడా తమ సొంత ఖర్చులతో మరో వెయ్యి మొక్కలు నాటేలా ప్రభుత్వం వారికీ బాధ్యత ఇవ్వాలని సర్పంచ్ లు డిమాండ్ చేస్తున్నారు. 

పెండింగ్ బిల్లులు ఇయ్యలె..

ప్రతి పంచాయతీలో వెయ్యి మొక్కలు నాటాలనడం కరెక్టు కాదు. అదీ ఒక్క గంటలోనే నాటాలన్న అధికారుల ఆదేశాలను వ్యతిరేకిస్తున్నం. గతంలో నాటిన మొక్కలకు, ఇతర అభివృద్ధి పనుల బిల్లులు ఇంకా రాలేదు. మా ఊరికి ప్రభుత్వం నుంచి రూ.15 లక్షల పెండింగ్ బిల్లులు రావాలి. గ్రామాల్లో ఉన్న ఖాళీ స్థలాలన్నింటిలోనూ రెండేండ్లుగా హరితహారం మొక్కలు నాటినం. ఖాళీ ప్లేస్ లేదు. మళ్లీ మొక్కలు నాటడం.. సర్పంచ్ లకు ఆర్థికంగా సమస్య.

– ధనలక్ష్మి, సర్పంచ్, తాటికోల్ గ్రామం, దేవరకొండ, నల్గొండ జిల్లా

అధికారులు ఒత్తిడి తెస్తున్నరు

వెయ్యి మొక్కలు నాటాలని అధికారులు ఒత్తిడి తేస్తున్నరు. రూ.35 వేలు ఖర్చు పెట్టి, రాజమండ్రి నుంచి మొక్కలు తెప్పిచ్చినం. వీటికి గుంతలు తీయడానికి కూలీలు ఎవరూ ముందుకు రావట్లేదు. పోయినేడాది నవంబర్ లో తీసిన వాటికే ఇంత వరకు బిల్లులు రాలేదు. సర్కార్ సైరన్ మోగగానే వెయ్యి మొక్కలు నాటాలని ఎంపీవోలు ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ లు వ్యతిరేకిస్తున్నరు. గ్రామంలో ఖాళీ స్థలాలు లేవు. వెయ్యి మొక్కలు ఎక్కడ నాటాలి? వచ్చేది ఎండాకాలం.. నీళ్లెట్ల? అవి బతకకపోతే మాకే షోకాజ్ నోటీసులు

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గానికి చెందిన గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆవేదన ఇదీ..

For More News..

ఫండ్స్ ఇయ్యకపోతే ఉద్యమమే

నేటి నుంచే గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ నామినేషన్లు

లెక్కల్లో గట్టెక్కేదెట్లా? టెన్త్ స్టూడెంట్లలో ఆందోళన