ఊసేలేని ప్లాస్టిక్‌‌‌‌ రహిత నర్సరీలు

ఊసేలేని ప్లాస్టిక్‌‌‌‌ రహిత నర్సరీలు
  • ముందుకు సాగని కేటీదొడ్డి పైలెట్‌‌‌‌ ప్రాజెక్టు  
  • అమలు కాని సీఎం ఓఎస్‌‌‌‌డీ ప్రియాంక వర్గీస్ ఆదేశాలు  
  •  ఏడు నెలలైనా తొట్టిల తయారీకి స్థలం కూడా కేటాయించలే

గద్వాల, వెలుగు: ప్లాస్టిక్ రహిత నర్సరీల ముచ్చట ముందర పడడం లేదు. టెన్త్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ ఇన్నోవేటర్ స్ఫూర్తితో పైలెట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుగా గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని నర్సరీల్లో బయోతొట్టిలు వాడాలని ఏడు నెలల కింద సీఎం ఓఎస్‌‌‌‌‌‌‌‌డీ ప్రియాంక వర్గీస్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు.  బయో తొట్టిల తయారీకి కావాల్సిన స్థలం, సౌలతులు కల్పించాలని సూచించినా.. లైట్ తీసుకున్నారు.  నర్సరీల్లో ఎప్పటిలాగానే  ప్లాస్టిక్ కవర్స్‌‌‌‌‌‌‌‌లో మట్టిని నింపి మొక్కలు పెంచుతున్నారు.  

టెన్త్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్ ఇన్నోవేటర్ స్ఫూర్తితో..

కేటీదొడ్డి మండలం చింతలకుంట జడ్పీ హైస్కూల్‌‌‌‌లో టెన్త్ క్లాస్‌‌‌‌‌‌‌‌ చదువుతున్న శ్రీజ వేరుశనగపొట్టుతో పర్యావరణానికి హాని కలిగించని తొట్టిలను తయారు చేసింది.  వీటి వాడకంతో పాటు ఇవి భూమిలో కరిగిపోతే నేలకు జరిగే మేలును వివరిస్తూ ‘ఇంటింటా ఇన్నోవేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో భాగంగా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ప్రదర్శన ఇచ్చింది. ఈ ఎగ్జిబిట్‌‌‌‌‌‌‌‌కు రాష్ట్రస్థాయి అవార్డు కూడా వచ్చింది.  విషయం తెలుసుకున్న సీఎం ఓఎస్‌‌‌‌‌‌‌‌డీ ప్రియాంక వర్గీస్ 2022 ఫిబ్రవరి 16న గద్వాల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ఇన్నోవేషన్ సెల్ ప్రతినిధులు, జిల్లా అధికారులతో మీటింగ్ పెట్టారు. ఈ సందర్భంగా శ్రీజ బయోతొట్టిలపై మాన్యువల్‌‌‌‌‌‌‌‌గా ప్రదర్శన ఇచ్చారు. స్పందించిన ఓఎస్‌‌‌‌‌‌‌‌డీ పల్లెటూరి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ దేశంలో ఎక్కడా లేని విధంగా బయోతొట్టిలు తయారు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని అభినందించారు. శ్రీజ సొంత మండలం కేటీదొడ్డి నుంచే  ప్లాస్టిక్ రహిత నర్సరీల ఏర్పాటు మొదలు పెట్టాలని డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏ, పంచాయతీ రాజ్‌‌‌‌ అధికారులను ఆదేశించారు. వెంటనే ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఇక్కడ సక్సెస్‌‌‌‌‌‌‌‌ అయితే  రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 

మండలంలో 25 నర్సరీలు

కేటీదొడ్డి మండలంలో 25 నర్సరీలు ఉండగా... ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈజీఎస్‌‌‌‌‌‌‌‌ కింద 23,  అటవీశాఖ ఆధ్వర్యంలో 2  కొనసాగుతున్నాయి. ఇందులో ఒక్క నర్సరీల్లో కూడా బయో తొట్టిలు వాడలేదు.  కనీసం తొట్టిల తయారీకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయలేదు. ఇక్కడి పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఎలా అమలు చేస్తారని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే స్టూడెంట్లు ఎన్ని ఇన్నోవేటర్లు తయారు చేసి ఏం లాభమని మండిపడుతున్నారు.  

మాకు ఆర్డర్స్ రాలేదు

ప్లాస్టిక్ రహిత నర్సరీల  గురించి మాకు ఇంకా ఆర్డర్స్ రాలేదు.  బయో తొట్టిలు వినియోగించాలని  సీఎం ఓఎస్‌‌‌‌డీ ప్రియాంక వర్గీస్  చెప్పిన విషయం తెలియదు.  కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆమె సూచనల మేరకు బయో తొట్టిల వాడకంపై నిర్ణయం తీసుకుంటం.

–నాగేంద్రం, డీఆర్‌‌‌‌‌‌‌‌డీఏ ఇన్‌‌‌‌చార్జి పీడీ