ఎక్కువతక్కువలు ఏం లేవు.. ఎవ్వరినీ వదలం.. ట్రంప్ కీలక ప్రకటన

ఎక్కువతక్కువలు ఏం లేవు.. ఎవ్వరినీ వదలం.. ట్రంప్ కీలక ప్రకటన

వాషింగ్టన్ డీసీ: అమెరికా వాణిజ్య విధానంపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికా వస్తువులపై ఏ దేశాలు ఎంత పన్నులు విధిస్తాయో.. ఇక నుంచి అమెరికా కూడా ఆ దేశాల వస్తువులపై అంతే సుంకం విధిస్తుందని ట్రంప్ కుండబద్ధలు కొట్టారు. ఇక.. అమెరికా సుంకం విధించే విషయంలో ఎక్కువ, తక్కువలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా వస్తువులపై ఎంత పన్ను విధిస్తారో.. అంతే పన్ను ఆ దేశాల వస్తువులపై కూడా అమెరికా విధిస్తుందని ట్రంప్ చేసిన ప్రకటన వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని ఒక సుదీర్ఘ పోస్ట్లో తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా ఆయన వెల్లడించారు.

అమెరికా వాణిజ్య విధానాలు ఇకపై పూర్తి పారదర్శకంగా ఉండనున్నాయని ట్రంప్ ప్రకటించారు. ఒకవేళ ఏ దేశమైనా అమెరికా భారీగా పన్నులు విధిస్తుందని భావిస్తే.. అమెరికా వస్తువులపై విధిస్తున్న సుంకాన్ని తగ్గించాలని లేదా పూర్తిగా రద్దు చేయాలని ట్రంప్ ఆయా దేశాలకు సూచించారు. ఏదైనా దేశం అమెరికాలో ఒక ప్రొడక్ట్ను తయారుచేస్తే.. ఆ ఉత్పత్తులపై అమెరికా ఎలాంటి టారిఫ్ విధించదని ట్రంప్ ప్రకటించారు.

చాలా ఏళ్లుగా కొన్ని దేశాలు వాణిజ్యపరంగా అమెరికాతో సవ్యంగా వ్యవహరించలేదని, అలాంటి దేశాల్లో అమెరికా శత్రు దేశాలతో పాటు మిత్ర దేశాలు కూడా ఉన్నాయని ట్రంప్ తన ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు. అమెరికా ఆర్థిక భారాన్ని భరిస్తూ కూడా చాలా దేశాలకు కొన్నేళ్లుగా సాయం చేసిందని, ఇప్పుడు ఆ దేశాలు ఈ విషయాన్ని గుర్తుచేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అమెరికా సాయం పొందిన దేశాలన్నీ వాణిజ్యపరంగా తమ దేశంతో సఖ్యంగా నడుచుకోవాల్సిన టైం వచ్చిందని ట్రంప్ ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు.

ALSO READ | ప్రపంచ ఆధిపత్యమే ట్రంప్ లక్ష్యమా.. ఇలా అనిపించడానికి కారణాలు ఇవే..

ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా వాణిజ్య విధానాలను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. స్టీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అల్యూమినియం దిగుమతులపై అదనంగా 25 శాతం టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇండియాతో సహా అన్ని దేశాల నుంచి చేసుకునే దిగుమతులపై ఈ టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పడనున్నాయి. దీంతో పాటు తమపై  ఎక్కువ టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వేస్తున్న దేశాలపై అంతేస్థాయిలో టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు (రెసిప్రొకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టారిఫ్స్‌‌‌) విధిస్తామని కూడా ట్రంప్ మొదటి నుంచి చెప్తూ వచ్చారు.

మెక్సికో, కెనడా నుంచి చేసుకునే అన్ని దిగుమతులపై 25 శాతం టారిఫ్ వేస్తామని మొదట ప్రకటించారు. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని 30 రోజుల పాటు వాయిదా వేశారు. చైనాపై వేసిన 10 శాతం టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మాత్రం వెనక్కి తీసుకోలేదు. దీనికి స్పందనగా చైనా కూడా అమెరికా వస్తువులపై 15 శాతం టారిఫ్ విధించింది. వలసలను కంట్రోల్ చేసేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ట్రంప్ ఆయుధంగా వాడుతున్నారు.