డిపోర్టేషన్​కు ఇక ఆర్మీ విమానాలు వాడొద్దు.. ఖర్చులు తగ్గించేందుకు ట్రంప్ డెసిషన్

డిపోర్టేషన్​కు ఇక ఆర్మీ విమానాలు వాడొద్దు.. ఖర్చులు తగ్గించేందుకు ట్రంప్ డెసిషన్

వాషింగ్టన్: అక్రమ వలసదారులను తరలించేందుకు సైనిక విమానాలను వాడొద్దని అమెరికా నిర్ణయించింది. మిలటరీ విమానాల వాడకంతో భారీగా ఖర్చు అవుతోందని, అది తగ్గించుకునేందుకే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయానికి వచ్చారని వాల్ స్ట్రీట్ జర్నల్  ఓ కథనం ప్రచురించింది. డిపోర్టేషన్ ఆపరేషన్​కు సైనిక విమానాలను వినియోగించడం వల్ల పెద్ద మొత్తంలో ఖర్చవుతోందని ప్రెసిడెంట్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది. చివరిసారిగా మార్చి 1న ఒకే సైనిక విమానం షెడ్యూల్ అయిందని, ఆపై మరో విమానాన్ని కేటాయించలేదని తెలిపింది.

ఇది చాలా కాస్ట్​లీ ప్లాన్.. 

అక్రమ వలసదారుల తరలింపు ప్రాసెస్​ను యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పర్యవేక్షిస్తోంది. ఇది సాధారణంగా బిజినెస్ ప్లేన్​లను వినియోగిస్తున్నప్పటికీ, అక్రమ వలసలపై ట్రంప్ కఠినంగా ఉన్నారనే సందేశం ఇచ్చేందుకు మిలటరీ విమానాలను వాడింది. ఆపరేషన్​లో భాగంగా గ్వాంటనామో, పెరూ, హోండూరస్, భారత్ తదితర దేశాలకు వందలాది మంది అక్రమ వలసదారులను తరలించింది. 

గ్వాంటనామోకు తరలించేందుకు ఒక్కో వ్యక్తికి 20 వేల డాలర్లు ఖర్చయినట్లు అంచనా. సాధారణ ప్లేన్​ టికెట్​తో పోలిస్తే ఇది చాలారెట్లు ఎక్కువ. మామూలు విమానాలకు గంటకు 17 వేల డాలర్లు ఖర్చువుతుంటే, డిపోర్టేషన్​కు వాడిన సీ17 విమానాల్లో గంటకు 28,500 డాలర్లు ఖర్చవుతోంది. భారత్​కు తరలించిన ఒక్కో విమానానికి 3 మిలియన్ డాలర్లు ఖర్చయింది. ఈ లెక్కలన్నీ యూఎస్ ట్రాన్స్​పోర్టేషన్ సర్వీస్ తెలిపినట్లు వాల్​స్ట్రీట్ జర్నల్ రిపోర్టు వెల్లడించింది.