ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ చివరి అంకానికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో బార్బడోస్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. రెండో పొట్టి టైటిల్ కోసం గత 17 ఏళ్లుగా టీమిండియా ఎదురుచూస్తుంటే.. తొలిసారి ఫైనల్ పోరుకు అర్హత సాధించిన సఫారీలు ఎలాగైనా ప్రపంచకప్ ఎగేరేసుకుపోవాలని తహతహలాడుతున్నారు. ఇలాంటి సమయంలో సఫారీ ఆటగాళ్లకు ఆ జట్టు మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ కీలక సూచనలు చేశారు.
ఐడెన్ మార్క్రమ్ నాయకత్వంలోని ప్రోటీస్ జట్టు.. వ్యూహాల గురించి, భారత బౌలర్ల గురుంచి అతిగా ఆలోచించకూడదని మోర్కెల్ సూచించాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ గురించి ఆలోచించడం మానేసి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలని తెలిపాడు. అతిగా ఆలోచిస్తే.. ఒత్తిడిలోకి జారుకుని వికెట్లు చేజార్చుకోవడం తప్ప ఫలితం ఏమీ ఉండదని ఈ మాజీ పేసర్ మార్గ నిర్ధేశం చేశాడు. ప్రపంచకప్ విజేతగా నిలవాలంటే అదొక్కటే మార్గమని సూచించాడు.
వ్యూహాలకు అందరు..
"నిజాయితీగా చెప్పాలంటే, భారత బౌలింగ్ లైనప్ గురించి ఎక్కువ ఆలోచించకూడదని అనుకుంటున్నా.. బుమ్రా ప్రమాదకర బౌలరైతే, కుల్దీప్ నమ్మశక్యం కాని బౌలర్. అతను ఖచ్చితంగా వికెట్ టేకర్. పరుగులను కట్టడి చేయగలడు. ఒత్తిడి సృష్టించగలడు. కనుక వీరిని ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచన చేయకపోవడం బెటర్. స్వేఛ్చగా బ్యాటింగ్ చేయాలి. క్రీజులోకి వెళ్లాక బాల్ బై బాల్ ఫోకస్ చేయాలి.." అని మోర్కెల్.. మార్క్రమ్ సేనకు సలహాలిచ్చారు.
కాగా, మెగా టోర్నీలో బుమ్రా, కుల్దీప్ ఇద్దరూ అద్భుతంగా రాణిస్తున్నారు. బుమ్రా 7 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ కేవలం 4 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు.