మే నెలలో 61% తగ్గిన హైరింగ్
కోల్‌కత్తా, ఢిల్లీ, ముంబైలలో భారీ పతనం
నౌకరి డాట్ కామ్ సర్వే
న్యూఢిల్లీ: దీర్ఘకాలంగా కొనసాగిన ఎకానమీ స్లోడౌన్.. తిరిగి పుంజుకుంటున్నామనే సమయానికి కరోనా లాక్‌డౌన్.. ఈ రెండింటి దెబ్బతో ఇండియాలో జాబ్ మార్కెట్ గల్లంతైంది. గత కొన్ని నెలల నుంచి కొత్త నియామకాలు భారీగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో ఉద్యోగుల నియామకాలు 61 శాతం పడిపోయాయని ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ నౌకరీ డాట్ కామ్ ఓ సర్వేలో పేర్కొంది. దీంతో వరుసగా రెండు నెలల్లోనూ(ఏప్రిల్, మే) రిక్రూట్‌మెంట్ 60 శాతానికి పైగా పడిపోయిందని తెలిపింది. ఈ సర్వే ప్రకారం మే నెలలో రిక్రూట్‌మెంట్ 61 శాతం తగ్గి 910 జాబ్స్‌కు చేరుకుంది. ఇది గతేడాది మే నెలలో 2,346 జాబ్స్‌గా ఉన్నాయి. నౌకరీ డాట్ కామ్‌లో లిస్టయిన జాబ్స్ ఆధారంగా నౌకరీ జాబ్ స్పీక్ ప్రతి నెల ఈ సర్వేను విడుదల చేస్తోంది.
హోటల్, రెస్టారెంట్లలో కొత్తగా ఉద్యోగాల్లేవు
ఈ సర్వే ప్రకారం ఉద్యోగుల నియామకాలు ఎక్కువగా హోటల్, రెస్టారెంట్, ట్రావెల్, ఎయిర్ లైన్స్ సెక్టార్లో(90 శాతానికి పైగా) పడిపోయాయి. వీటి తర్వాత రిటైల్(87 శాతం), ఆటో, ఆటో అనుబంధ రంగాలు(76 శాతం), బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్(బీఎఫ్‌ఎస్‌ఐ) (70 శాతం) సెక్టార్లలో కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడం భారీగా తగ్గింది. ఇండియాలోని మెట్రో సిటీలలో హైరింగ్ యాక్టివిటీ సగానికి పైగా పడిపోయిందని ఈ సర్వే పేర్కొంది. కొల్‌కతా(68 శాతం), ఢిల్లీ(67 శాతం), ముంబై(67 శాతం)లలో మే నెలలో ఉద్యోగుల నియామకాలు భారీగా తగ్గాయి. కోల్‌కతాలో ఆటో, ఆటో అనుబంధ రంగం(98 శాతం), హాస్పిటాలిటీ(94 శాతం) సెక్టార్లలో ఉద్యోగుల నియమాకాలు భారీగా పడ్డాయని ఈ సర్వే పేర్కొంది. న్యూఢిల్లీలో హాస్పిటాలిటీ, అకౌంటింగ్ సెక్టార్లలో నియామకాలు 94 శాతం మేర పడిపోయాయి. ముంబైలో హాస్పిటాలిటీ(93 శాతం), ఆటో(80 శాతం) సెక్టార్లలో హైరింగ్ భారీగా తగ్గింది.
ఎక్స్‌పీరియన్స్ ఉన్నా జాబ్ లేదు..
అన్ని ఎక్స్‌పీరియన్స్ లెవెల్స్‌లో హైరింగ్ యాక్టివిటీ 64 శాతం మేర పడిపోయిందని ఈ సర్వే పేర్కొంది. ఎంట్రీ లెవెల్(0–3 ఏళ్లు అనుభవం) సెగ్మెంట్‌లో నియామకాలు 66 శాతం, సీనియర్ ఎగ్జిక్యూటివ్(47 ఏళ్లు అనుభవం) నియామకాలు 62 శాతం తగ్గాయి. మిడిల్ మేనేజ్‌మెంట్ లెవెల్లో (8–12 ఏళ్లు) 55 శాతం, సీనియర్ మేనేజ్‌మెంట్ లెవెల్లో(13–16 ఏళ్లు) 50 శాతం వరకు హైరింగ్ యాక్టివిటీ పడిపోయిందని ఈ సర్వే పేర్కొంది.
వచ్చే మూడు నెలలూ కొత్త జాబ్స్ తక్కువే
వచ్చే మూడు నెలల్లో కొత్తగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడానికి కేవలం 5 శాతం కంపెనీలే ప్లాన్స్ వేస్తున్నాయని మ్యాన్‌పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ ఔట్‌లుక్ సర్వే పేర్కొంది. కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడంపై ఇండియన్ కార్పొరేట్ సెక్టార్ వేచి చూసే ధోరణిని అనుసరిస్తోందని తెలిపింది. ఈ సర్వేలో 695 కంపెనీలు పాల్గొన్నాయి. ఎకనామిక్ స్లోడౌన్ దీర్ఘకాలంగా కొనసాగుతుండడంతో కార్పొరేట్ సెక్టార్ తమ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయని పేర్కొంది.
డేటా సైన్స్ స్కిల్స్ పెంచుకుంటున్నరు..
కొత్తగా నియామకాలు లేకపోయినా జాబ్స్ కోసం ప్రయత్నించే వాళ్లలో సగం మంది తమ స్కిల్స్‌ను డెవలప్ చేసుకుంటున్నారని నౌకరి మరో సర్వేలో పేర్కొంది. లాక్‌డౌన్ టైమ్‌ను వీరు ఉపయోగించుకుంటున్నారని తెలిపింది. ఉద్యోగాల కోసం వెతుకుతున్న 50,000 మందితో ఈ సర్వేను నిర్వహించింది. తమ స్కిల్స్‌ను పెంచుకోవడంలో డేటా సైన్స్ కోర్సులను నేర్చుకునే వాళ్లు ఎక్కువగా(23 శాతం) ఉన్నారని ఈ సర్వే తెలిపింది. దీని తర్వాత డిజిటల్ మార్కెటింగ్(20 శాతం), ఫైనాన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్(16 శాతం మంది) కోర్సులను నేర్చుకుంటున్నారని తెలిపింది. లాక్‌డౌన్ ను కొనసాగించడంతో వరుసగా మూడో నెలలోనూ హైరింగ్ యాక్టివిటీ తగ్గుతోందని నౌకరీ డాట్ కామ్ సీఎఫ్‌ఓ పవన్ గొయల్ అన్నారు. తాజాగా హెచ్‌ఆర్ హెడ్స్, రిక్రూటర్లతో సర్వే నిర్వహించామని ఆయన అన్నారు. కీలకమైన పోస్టుల కోసం నియామకాలు చేపడుతున్నామని ఇందులో పాల్గొన్న 39 శాతం మంది చెప్పారని పేర్కొన్నారు. ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్, ఐటీ సాఫ్ట్‌వేర్ సెక్టార్లలో కూడా ఇలానే ఉందని అన్నారు.
For More News..