తెలంగాణకు నయా పైసా ఇవ్వలేదు.. బీజేపీ ఎంపీలు కూడా పట్టించుకోలేదు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

తెలంగాణకు నయా పైసా ఇవ్వలేదు.. బీజేపీ ఎంపీలు కూడా పట్టించుకోలేదు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల టౌన్, వెలుగు: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ నయా పైస కూడా ఇవ్వలేదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. టీ పీసీసీ పిలుపు మేరకు సోమవారం సిరిసిల్లలో కాంగ్రెస్ శ్రేణులు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశాయి. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్రం ప్రతిసారి బడ్జెట్ లో రాష్ట్రానికి మొండి చేయి చూపుతుందని మండిపడ్డారు.  

రాష్ట్రంలో బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా ఏం చేయలేకపోయారని, ఒక్కసారి కూడా రాష్ట్రానికి నిధులు ఇవ్వమని అడిగిన పాపన పోలేదని విమర్శించారు. కేంద్రం దేశ సంపదను ఎన్నికలున్న రాష్ట్రాలకు తీసుకెళ్తుందని ఆరోపించారు.  సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బేషజాలకు పోకుండా ప్రధాని మోదీని రాష్ట్రానికి పెద్దన్న పాత్ర పోషించాలని కోరుతున్నా పట్టించుకోలేదన్నారు. 

హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుండగా.. ఒక్క రూపాయి కూడా  అభివృద్ధి కేటాయించలేదని కేంద్రంపై ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి భవిష్యత్ లో  పతనం తప్పదని హెచ్చరించారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ నేతలు నాగుల సత్యనారాయణ, చొప్పదండి ప్రకాశ్, సంగీతం శ్రీనివాస్, వెలుపుల స్వరూప, తిరుపతిరెడ్డి, కాముని వనిత తదితరులు పాల్గొన్నారు.