చెరువుల్లోని అక్రమ నిర్మాణాలకునోటీసులు అవసరం లేదు

చెరువుల్లోని అక్రమ నిర్మాణాలకునోటీసులు అవసరం లేదు
  • బల్దియా యాక్ట్ ​405 ఇదే చెప్తోంది: హైడ్రా చీఫ్ ​రంగనాథ్
  • ఆక్రమణలని తేలిన తర్వాతే ఖాజాగూడలోని చెరువుల వద్ద కూల్చివేశామని వెల్లడి 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన తర్వాతే ఖాజాగూడలోని తొటోనికుంట, భగీరథమ్మ చెరువుల వద్ద ఆక్రమణలను తొలగించామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఆక్రమణలతో తమ ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో తరచూ నీరు నిలిచిపోతుందని స్థానికుల ఫిర్యాదు చేశారన్నారు.

హైడ్రా, స్థానిక అధికారులతో కలిసి స్వయంగా తానే పర్యటించి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నట్లు చెప్పారు. రాత్రి వేళల్లో నిర్మాణ సామగ్రి డంప్​ చేస్తున్న కొన్ని టిప్పర్లను తమ బృందాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాయన్నారు. చెరువును ఆక్రమించినందుకు సంధ్యా కన్స్ట్రక్షన్స్, యజమాని సంధ్య శ్రీధర్ రావు, టిప్పర్ ఆపరేటర్లపై రాయదుర్గం పీఎస్​లో క్రిమినల్ కేసు నమోదైందన్నారు. 3-4 రోజుల తర్వాత ఆక్రమణలను కూల్చివేస్తామని ముందుగానే హెచ్చరించామన్నారు.

డిసెంబర్ 30న 24 గంటల సమయం ఇస్తూ నోటీసులు జారీ చేశామన్నారు. స్పందించకపోవడంతో కూల్చివేశామన్నారు. బల్దియా చట్టం సెక్షన్ 405 ప్రకారం జలవనరుల్లో నిర్మాణాలు చేపడితే నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని, -గతేడాది నవంబర్ లో ‘బుల్డోజర్ జస్టిస్’కు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు కూడా దీనికి వర్తించదన్నారు. అలాగే ఖాజాగూడ చెరువు బఫర్ జోన్ లోని మెకానిక్ షాపుని కూల్చివేసి, అక్కడి వైన్ షాపును వదిలేయడంపై రంగనాథ్ స్పందించారు.

వైన్స్ ప్రభుత్వ లైసెన్స్ తో కొనసాగుతోందన్నారు. ఆ షాపును మరో ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేయాలని ఎక్సైజ్ శాఖను కోరినట్లు చెప్పారు. వైన్స్​కు  అనుబంధంగా ఉన్న సిట్టింగ్, డైనింగ్ రెస్టారెంట్, పాన్ షాపులను కూల్చివేశామన్నారు.