కలకత్తా ఆర్ జీ కర్ ఆస్పత్రి అత్యాచార కేసు నిందితుడు సంజయ్ రాయ్ తల్లి సంచలన కామెంట్స్ చేశారు. తన కొడుకును ఉరితీసినా పర్లేదని అన్నారు. ‘‘కోర్టు ముందు దోషిగా తేలాడు. నా కొడుకుని ఉరితీసినా పర్లేదు. నేను ఒంటరిగా ఉన్నపుడు బాధపడతాను. కానీ విధి నిర్ణయంగా భావిస్తాను. దురదృష్టం అనుకుంటాను’’ అని నిందితుడు సంజయ్ తల్లి మాలతి అన్నారు.
కోర్టు తీర్పు వెలువడినప్పుడు ఆమె తన ఇంటి వద్దే ఉన్నారు. ‘‘తన కొడుకు తప్పు చేయలేదని తెలిస్తే కోర్టు వాదనలకు హాజరయ్యేదాన్ని. కానీ తప్పు చేశాడని తెలిసి కోర్టుకు హాజరు కాలేదు. నా ఆరోగ్యం బాగాలేదు.. అయినా కోర్టు వాదనలకు వచ్చేదాన్ని’’ అని ఈ సందర్భంగా తెలిపారు.
కలకత్తా ఆర్ జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యం దారుణమని అన్నారు. ‘‘ఒక తల్లిగా నేను ఆ కుటుంబం బాధను అర్థం చేసుకోగలను. నాకు ముగ్గురు అమ్మాయిలున్నారు. ఆ అమ్మాయి కూడా నా కూతురు లాంటిదే’’ నని అన్నారు.
అయితే నిందితుడు సంజయ్ సిస్టర్ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి సాధారణంగానే పెరిగాడు. కానీ ఏజ్ పెరిగే కొద్ది అతనిలో మార్పులు చూస్తూ వచ్చాను. ముఖ్యంగా ఆల్కహాల్ కు అలవాటు పడినప్పటి నుంచి బిహేవియర్ లో చాలా మార్పులు వచ్చాయి. ఏ ఒక్క అమ్మాయితో మిస్ బిహేవ్ చేసినట్లు ఎప్పుడు కంప్లైంట్ రాలేదు. గత కొన్నేళ్లుగా వేరే చోట ఉంటున్నాడు. అప్పట్నుంచి ఆలోచనలు ఎలా ఉన్నాయో.. అతని ఫ్రెండ్స్ ఎలాంటి వారో తెలియదు. ఈ గ్యాప్ లో ఏవైన క్రైమ్స్ చేశాడో లేదో కూడా తెలియదు’’ అని సంజయ్ సోదరి తెలిపారు.
‘‘అత్యాచారం జరిగినపుడు ఘటన స్థలంలో ఇంకొందరు ఉన్నారని అంటున్నారు. దర్యాప్తు చేసి ఒక్కరినే బాధితుడిని చేయడం కరెక్ట్ కాదు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరినీ శిక్షించడం న్యాయం. డైరెక్టుగా ఇన్వాల్వ్ అయినా.. ఇండైరెక్టుగా అయినా.. తప్పు చేసిన వారందరినీ శిక్షించాలి’’ అని నిందితుని సోదరి కోరారు.
కలకత్తా ఆర్ జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ పై 2024 ఆగస్టు 9వ తేదీన అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. హాస్పిటల్ బ్రేక్ టైంలో సెమినార్ రూమ్‌లో నిద్రించేందుకు వెళ్లిన పీజీ వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసులో సంజయ్ రాయ్ నేరానికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది.