జగిత్యాల జిల్లాలో మంచి మంచి నాయకులు తమ పార్టీలోకి వస్తున్నట్లు.. రెండు, మూడు నెలల్లో భారీగా చేరికలు జరుగుతాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ తలకిందకి.. కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా జగిత్యాల జిల్లాలో బీజేపీ గెలుపును ఆపలేడన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న సమ్మె దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ... వీఆర్ఏల జీవితాలు త్రిషంకు స్వర్గంలో ఉన్నాయని, అన్ని వర్గాల వారిగానే వీఆర్ఏలను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.
గత కొద్ది రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించకోకపోవడం దారుణమన్నారు. గ్రామాల్లో వీఆర్ఏ వ్యవస్థ లేకపోతే అన్ని శాఖలు అయోమయంలో పడుతాయని తెలిపారు. మొత్తంగా ఓ వ్యవస్థను రిస్క్ లో పెట్టాడన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ బద్దంగా పే స్కెల్, రూల్స్ చేస్తామని హామీ ఇస్తున్నట్లు వెల్లడించారు. అన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వడమే కాకుండా న్యాయ బద్దంగా ఉన్నవి అన్నీ చేస్తామన్నారు. ధరణి పోర్టల్ తెచ్చి దగా చేసిండన్నారు. వీఆర్ఏలు వినిపిస్తున్న డిమాండ్లను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.