తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు..

తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు..
  • కొందరు సాధ్యమా అన్నరు.. ఇప్పుడు ప్రపంచమే  అంగీకరిస్తున్నది: సీఎం రేవంత్​
  • ఏడాదిలోనే దేశవిదేశీ పెట్టుబడులు రాబట్టాం
  • అందరి కన్నా ముందే ఏఐని రాష్ట్రం అందిపుచ్చుకుంది
  • ప్రపంచ స్థాయి నగరాలతోనే హైదరాబాద్​కు పోటీ అని వెల్లడి
  • మాదాపూర్​లో హెచ్​సీఎల్​ టెక్ కొత్త క్యాంపస్  ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, హైదరాబాద్​ రైజింగ్‌‌‌‌ను ఎవరూ ఆపలేరని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘రాష్ట్రాభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. అని మేం అన్నప్పుడు మొదట్లో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలతో ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. ప్రపంచమంతా ఒప్పుకుంటున్నది. తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. ఇక ఆగదు” అని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌‌‌‌లోని మాదాపూర్​లో హెచ్‌‌‌‌సీఎల్‌‌‌‌ టెక్ కొత్త క్యాంపస్‌‌‌‌ను గురువారం సీఎం రేవంత్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏడాది కాలంలోనే అత్యధికంగా అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రం ఆకర్షించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌ (ఏఐ)ను ముందుగా అందిపుచ్చుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో అత్యల్ప ద్రవ్యోల్బణం ఉందని తెలిపారు. 

రాష్ట్రాభివృద్ధి కోసం పట్టుదలతో ముందుకు

తెలంగాణను వన్‌‌‌‌ ట్రిలియన్‌‌‌‌ డాలర్ల జీడీపీ కలిగిన రాష్ట్రంగా మారుస్తామని చెప్తే మొదట అది సాధ్యం కాదని కొందరు అన్నారని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్​కు పోటీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో కాదని.. ప్రపంచ స్థాయి నగరాలతోనే అని తాను చెప్పినప్పుడు కూడా కొంతమంది అది పెద్ద కలనే అవుతుందని వ్యాఖ్యానించారని సీఎం రేవంత్ అన్నారు. 

కానీ, ఎలక్ట్రిక్​ వాహనాల అడాప్షన్‌లో హైదరాబాద్‌ను నంబర్‌ వన్‌గా చేయడంతో పాటు రాష్ట్రాన్ని డేటా సెంటర్ల హబ్‌గా, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్, స్కిల్ డెవలప్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్ రంగాల్లో మార్గదర్శిగా నిలుపుతుండటంతో అందరూ ఆ కల సాకారమవుతుందని అంగీకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రెండుసార్లు దావోస్‌ పర్యటనల్లో మొదట రూ.41వేల కోట్లు, ఆ తర్వాత రూ.1.78 లక్షల కోట్ల ఎంవోయూలపై సంతకాలు చేసుకున్నాక రైజింగ్​ ఆగదని అందరూ నమ్ముతున్నరని తెలిపారు.రాష్ట్రాభివృద్ధి కోసం తాము పట్టుదలతో పనిచేస్తున్నామని చెప్పారు. 

ఉద్యోగ కల్పనలో నంబర్​ వన్​

అతిపెద్ద లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీల్లో ఒకటైన ఆమ్జెన్‌ను కొద్దిరోజుల కింద ప్రారంభించుకున్నామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ సమావేశాల్లో ఒకటైన బయో ఏషియా సదస్సును ఇటీవల నిర్వహించుకున్నామని, ఇప్పుడు హెచ్‌సీఎల్‌ కొత్త క్యాంపస్​ను ప్రారంభించుకున్నామని అన్నారు. కేవలం ఏడాది కాలంలోనే రాష్ట్రానికి దేశవిదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని, ఈ విషయం  గర్వంగా చెప్తున్నానని ఆయన పేర్కొన్నారు. 

ఉద్యోగ కల్పనలో నంబర్‌ వన్​గా నిలిచామన్నారు. గ్లోబల్ కంపెనీగా హెచ్‌సీఎల్ టెక్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచిందని.. ఇది 60 దేశాల్లో ఆపరేట్ చేస్తున్నదని.. 2.2 లక్షల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉందని ఆయన వివరించారు. డిజిటల్, ఇంజినీరింగ్, క్లౌడ్, ఏఐ రంగాల్లో వరల్డ్ క్లాస్ ఆఫరింగ్స్ క్రియేట్ చేస్తున్నారని పేర్కొన్నారు.  2007లో హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అంచెలంచెలుగా హెచ్​సీఎల్​ పెద్ద స్థాయికి ఎదిగిందని తెలిపారు. ప్రస్తుతం 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 5 వేల మందితో  ప్రపంచస్థాయి సదుపాయాలతో హెచ్‌సీఎల్ టెక్ హైదరాబాద్‌లో  అద్భుతమైన విజయాలను సాధించబోతున్నదని సీఎం రేవంత్​ పేర్కొన్నారు.