సిని‘మా’లో తెలంగాణ వాటా ఎంత?

తెలంగాణ కళలకు పుట్టిల్లు. మనలో ఎవ్వరికీ తెలుగు సినిమా పరిశ్రమలో తెలంగాణ వాటా ఎంత అనే సోయిలేదు. స్వేచ్ఛ, స్వయంపాలన లక్ష్యాలతో రాష్ట్రం సాధించి ఏడున్నరేండ్లు దాటింది. కానీ, కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా ఇంకా కొన్ని రంగాల్లో తెలంగాణ తన ఉనికిని చాటుకోలేకపోయింది. సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే శక్తి ఉన్న సినిమా పరిశ్రమలో ఇంకా పొరుగు రాష్ట్రాల ఆధిపత్యం కొనసాగుతోంది. మన రాష్ట్ర కళాకారులు ఆంధ్ర ప్రాంత సినిమా పెద్దల ముందు చేతులు కట్టుకుని నిలబడే స్థితిలోనే ఉన్నారు. ఉద్యమం సమయంలో తెలంగాణ యాస, భాషలను బాగా వాడుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. మన భాష ప్రాతిపదికన సినీరంగ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదు. మన యాస, భాషల నేపథ్యంలో తీసిన సినిమాల విడుదలకు ఎన్నో కష్టాలు ఎదురైనా కేసీఆర్ పట్టించుకోలేదు. స్వరాష్ట్రం ఏర్పడినా ఆంధ్రా నిర్మాతల థియేటర్ల మాఫియా ముందు తెలంగాణ భాష, యాస ఓడిపోయింది. ఎంతో ప్రతిభ కలిగిన మన ప్రాంత యువతీయువకులకు సినిమాల్లో అవకాశాలు తక్కువ. అరకొరగా అవకాశాలు ఇచ్చినా అవమానాలే ఎక్కువ.

తొంబ్భై శాతం వాళ్లే

'మా'లో తెలంగాణకు చెందిన సినీనటులు ఎంత మంది సభ్యులుగా ఉన్నారు? 90% ఆంధ్ర నటులు ఉన్న ఈ సంస్థలో తెలంగాణ వాడు ఏనాడైనా అధ్యక్షుడు కాగలడా? రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రాలో 'మా' ఎందుకు ఏర్పడలేదు? తెలంగాణ గడ్డ మీద వీళ్ల పెంట పంచాయితీ మనకెందుకు? 'మా' అధ్యక్షుడుగా గెలిచిన మంచు విష్ణు లోకల్, నాన్- లోకల్ అని చీలిక తెచ్చి, ‘తెలుగు ఆత్మగౌరవం’ కాపాడుకోవాలనే నినాదంతో ప్రకాశ్​ రాజ్​ను ఓడించాలని పిలుపునిచ్చారు. అసలు లోకల్– నాన్ లోకల్ నిర్ణయించేందుకు విష్ణు ఎవరు? కర్నాటకలో పుట్టి, షాద్​నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెటిలైన ప్రకాశ్ రాజ్ నాన్-లోకల్ అయితే.. చెన్నైలో పుట్టి, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెటిల్ అయిన విష్ణు లోకల్ ఎలా అవుతారు? చెన్నై నుంచి బతుకుదెరువుకు వచ్చిన వాళ్లే లోకల్ వాళ్లు ఎవరనేది డిసైడ్ చేస్తారా? మరీ ఈ స్వరాష్ట్రం దేనికి? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) 1993లో ఏర్పాటైంది. తెలుగు సినీపరిశ్రమలో నటించే కళాకారుల ప్రయోజనాలను కాపాడటం దీని ముఖ్య ఉద్దేశం. గతంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తమ ఆస్తులను కాపాడుకోవడం కోసం కళలకు సరిహద్దులు లేవని సెలవిచ్చిన మోహన్ బాబు, ఇపుడు తన కొడుకును గెలిపించాలని లోకల్-నాన్ లోకల్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. తెలుగు ఆత్మగౌరవమనే ట్యాగ్ లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గట్టెక్కిన విష్ణుకు, ఇప్పటి నుంచి తెలుగు నటీనటులకు మాత్రమే అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేయాలనే నిబంధనలు తెచ్చే దమ్ముందా?

నటీనటులను ఎదగనీయట్లేదు

ఈ 'మా' ఆంధ్ర నటీనటులకే కళామతల్లి. తెలంగాణ నటీనటులకు సవతి తల్లి మాత్రమే. అది వాళ్ల చేతల్లోనే రుజువైంది. తెలంగాణ నటీనటులను అప్రాధాన్య ఈసీ మెంబర్లకే పరిమితం చేశారు. 10% మన నటీనటులు సభ్యులుగా లేని ఈ సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించవద్దు. సినిమా చాలా సున్నితమైన అంశం. 'మా' సభ్యులు రోజుకో డ్రామాతో రోడ్డున పడుతున్నారు. బ్యాలెట్ పేపర్ ఎన్నిక దగ్గర నుంచి, ఎన్నిక జరిగిన తీరు, ఎన్నికల అధికారి బ్యాలెట్ బాక్సులను ఇంటికి తీసుకుపోయేదాకా ప్రతీది వివాస్పదమే. ఇప్పటికే, టాలీవుడ్ డ్రగ్స్ మరకలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోతుంటే, దీనికి తోడు ఈ 'మా' గొడవలు. ఇంత జరుగుతున్నా, కేసీఆర్ ప్రభుత్వం కళ్లుమూసుకుని కూర్చుంది. నాడు మర్రి చెన్నారెడ్డి హయాంలో పైడి జయరాజ్, డైరెక్టర్ దాసరి నారాయణరావు చొరవతో సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చింది. ఎన్నో రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసమని నాడు వందల ఎకరాల భూమిని స్టూడియోల పేరుతో తీసుకుని నేడు కమర్షియల్ కార్యకలాపాలకు వాడుకుంటున్నారు. వీళ్లు దేశాన్ని ఉద్దరిస్తారని, జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వందల ఎకరాలను చంద్రబాబు పంచారు. ప్రభుత్వం ఇన్ని సౌకర్యాలు కల్పించినా వీళ్లు మాత్రం ఓ మూవీ మాఫియాగా ఏర్పడి, వాళ్ల కుటుంబాల నుంచే తప్ప బయటి వాళ్లు ఎదగకుండా అడ్డుకుంటున్నారు.

రాష్ట్ర సినిమా పరిశ్రమ ఉండాలె

తెలంగాణ అంటేనే జానపద కళలు. ఆ కళ కేసీఆర్ గడీలో బందీ అయింది. ఆయన ప్రసంగాలకు డప్పు చప్పట్లు కొడుతున్నది. తెలంగాణ కోసం గోసి గొంగడి వేసుకుని నాలుక తడి ఆరేదాక కొట్లాడిన రసమయి, విమలక్క, గద్దర్ ఎక్కడున్నారు? తెలంగాణ ద్రోహులు కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటే రసమయికి సాంస్కృతిక సంస్థనా? కళాకారులకు ఏం న్యాయం జరిగినట్టు? సినిమాల్లో జానపద పాటలకు మధుప్రియ, గంగ, విజయను కాకుండా రాయలసీమ నుంచి మంగ్లీని తెచ్చి పాడిస్తున్నారు. సాయిచంద్, మిట్టపల్లి, ఏపూరి, రాం నర్సయ్యను వద్దని పెంచలదాసును తీసుకొచ్చి పాడిస్తున్నారు. తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ చక్రిని ఆంధ్ర పెద్దలు దూరం పెట్టిన తీరు ఎన్నటికీ మర్చిపోలేం. విజయ్ దేవరకొండ తన ప్రతిభతో పాటు, కేసీఆర్ దూరపు బంధువు కాబట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నాడు. మరి, మిగిలిన నటీనటుల పరిస్థితి? దర్శి, రాహుల్ రామకృష్ణను మూస కామెడీ ట్రాకులకే వాడుతున్నారు. తెలంగాణ యాసలో సహజ సిద్ధమైన నటన కలిగిన బిత్తిరి సత్తి, గంగవ్వ, సావిత్రి లాంటి వాళ్లను వదిలి సినిమా పాటలకు పేరడీ గంతులు వేసే దుర్గారావుకు అవకాశాలు ఇస్తున్నారు. అంతెందుకు, హీరో విశ్వక్​సేన్​ తన సొంత డబ్బుతో ఫలక్​నుమా దాస్​ సినిమా తీస్తే అది రిలీజ్​ అయిన మొదటి రోజే ప్రేక్షకులకు చేరకుండా బాగా ఆడే థియేటర్లలో తీసేశారు. కొన్ని వేల సినిమా కథలకు సరిపోయే సాహిత్య సంపద, ఉద్యమాల చరిత్ర తెలంగాణలో ఉంది. ఇక్కడి ప్రజల విభిన్న సంస్కృతి, జీవన విధానం ఎంతో గొప్ప  కథాంశం కాగలదు. తెలంగాణ పల్లె అందాలు, పచ్చని పంటపొలాలు తెలంగాణ సినిమా పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతాయి. ఇక్కడ సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందితే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు 
పెరుగుతాయి.

ప్రతిభకు కొదవలేదు

ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకున్న నటుడు పైడి జయరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది కరీంనగర్ జిల్లానే. 200 పైగా హిందీ, మరాఠా చిత్రాల్లో నటించి, 150 సినిమాలు నిర్మించిన ఈయన గురించి నేటి తరంలో ఎంతమందికి తెలుసు? అలాగే గొప్ప గేయ రచయిత సి.నారాయణరెడ్డి, పౌరాణిక నటుడు కత్తి కాంతారావు, సామాజిక చిత్రాల్లో గొప్ప విలన్ ప్రభాకర్ రెడ్డి తెలంగాణ వారే. డైరెక్టర్లు ఎన్.శంకర్, వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి, తరుణ్ భాస్కర్, రఫీ లాంటి ఎంతో మంది ఉన్నా.. వీళ్ల కథలకు ఫైనాన్షియర్లు ముందుకు రారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వీరిని ప్రోత్సహించదు. తెలంగాణ యాస, భాషలను కమెడియన్, విలన్ పాత్రలకే పరిమితం చేసిన వాళ్లే.. ఈ పరిశ్రమ ద్వారా ఎక్కువ రాయితీలు పొంది బాగుపడుతున్నారు. తెలంగాణ వాళ్లను సినీ పరిశ్రమలో దినసరి కార్మికులుగా అవమానిస్తున్నారు.

‘మా’ ఎన్నికను ప్రభుత్వం గుర్తించకూడదు

'మా' ఎన్నికలను గుర్తించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. 'తెలంగాణ మా'ను ఏర్పాటు చేయాలి. దానికి ఆరు నెలల నిర్ధిష్ట కాలపరిమితితో 24 క్రాఫ్టుల నిపుణులతో నిజమైన నటీనటులతో కూడిన ఒక అడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హక్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ ఆరు నెలల కాలంలో 'తెలంగాణ -మా' ఏర్పాటు లక్ష్యాలను, విధివిధానాలను రూపొందించి, తెలంగాణ ప్రాంతానికి చెందిన నటీనటులకు కొత్త సభ్యులుగా చేర్చుకోవాలి. నటీనటులు, టెక్నీషియన్లకు తగిన శిక్షణ ఇప్పించాలి. తర్వాత 'తెలంగాణ- మా'కు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు పెట్టాలి. సినిమా అభివృద్ధి కోసం గతంలో భూములు కేటాయిస్తే వాటిని కమర్షియల్ అవసరాలకు వాడుతున్న వారి నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవాలి. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఈ 'మా'లో ఉన్న తమ సన్నిహితుల కోసం తెలంగాణ బిడ్డల ప్రయోజనాలు తాకట్టుపెడితే చూస్తూ ఊరుకోం. తెలంగాణ సినిమా పరిశ్రమకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు కోసం పైడి జయరాజ్ పేరుతో ఏటా జాతీయ అవార్డు అందచేయాలి. 'తెలంగాణ మా' ఆధ్వర్యంలో మన యాస, భాషలో సినిమాలు తీసేందుకు ప్రతిభ కలిగిన నటీనటులు, డైరెక్టర్లకు ప్రోత్సాహం అందించాలి.

- కొనగాల మహేష్, ఏఐసీసీ సభ్యుడు