
భైంసా, వెలుగు: క్యాన్సర్‌తో తండ్రి.. అనారోగ్యంతో తల్లి మృతిచెంది వారి ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు. ఎవరూ లేక వీధిన పడి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. నిర్మల్‌జిల్లా భైంసా పట్టణంలోని నేతాజీనగర్కాలనీలో నివాసముంటున్న లోగంవార్భూమన్న, సురేఖ దంపతులది నిరుపేద కుటుంబం. వీరికి ముగ్గురు కొడుకులు. వీరిలో ఇద్దరు కవలలు. భూమన్న
హోంగార్డుగా పని చేసి క్యాన్సర్ బారిన పడి నాలుగేండ్ల క్రితం చనిపోయాడు. దీంతో భార్య సురేఖ బాసర ట్రిపుల్ ఐటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ముగ్గురు పిల్లలతోపాటు అత్త(90)ను పోషించేది. అయితే, సురేఖ అనారోగ్యం బారిన పడి వారం రోజుల క్రితం చనిపోయింది.
పేద కుటుంబం కావడంతో కాలనీవాసులంతా తలో కొంచెం వేసుకొని ఆమె అంత్యక్రియలు పూర్తిచేశారు. వృద్ధురాలు సైతం తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమైంది. దీంతో తినేందుకు తిండి కూడా లేక ఆ పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. పెద్ద కుమారుడు శివ ఇంటర్ చదువుతుండగా, కవలైన రామ్ 7, శ్యాం 6వ తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం వారు ఉన్న పరిస్థితుల్లో వారి చదువులు కూడా ఆగిపోయేలా ఉన్నాయి. దీంతో ఎవరైనా ఆదుకొని తమ కష్టాలు తీరుస్తారని వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నారు. సాయం చేయాలనుకున్నవారు 9490139224 ఈ నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు.