ఎవరూ పొలిటికల్​ట్రాప్‏లో పడొద్దు.. ఆశావర్కర్లకు మంత్రి రాజనర్సింహ సూచన

హైదరాబాద్: ఆశావర్కర్ల డిమాండ్లు సాధ్యాసాధ్యాలను అంచనా వేసి పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎవరూ రాజకీయ నాయకుల ట్రాప్‎లో పడొద్దని  ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ  సూచించారు. నిరసనలు చేయడం కొత్తేమీ కాదని.. నిరసనలకు తమ ప్రభుత్వం అవకాశం కూడా ఇచ్చిందన్నారు. ‘రాజకీయంగా నాయకులు ఉద్రేక భరితంగా లబ్ధి పొందేందుకు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే ట్రాప్‎లో పడకండి. 

మీ పని మీరు చేసుకోండి. ఆర్థిక పరిస్థితులు బేరోజు వేసుకొని సమయానుకూలంగా మీ డిమాండ్లను పరిష్కరిస్తం. ఆరు డిమాండ్లను స్టెప్ బై స్టెప్ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నం. ప్రభుత్వం వచ్చి ఏడాది మాత్రమే పూర్తయింది, ఆశావర్కర్ల పట్ల వ్యతిరేకంగా ఏనాడూ మాట్లాడడం లేదు. రాజకీయం ఎందుకు చేస్తున్నారు. ధర్నా చౌక్ మాయం చేసిన ఘనత బీఆర్ఎస్‎ది. ధర్నా అనేది గొప్పపదం. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పాలనకు.. నిరసన డిమాండ్లకు గొప్ప ఆయుధం’ అని తెలిపారు.